భారత్ లో ఇప్పటికే లక్ష మందిని బలి తీసుకున్న కరోనా..
posted on Oct 3, 2020 @ 12:21PM
భారత్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటలలో కొత్తగా 79,476 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరింది. ఇదే సమయంలో నిన్న కరోనాతో పోరాడి 1069 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,00,846కి చేరింది. ప్రస్తుతం మన దేశంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది.. 2.97 శాతంగా ఉంది. ఇది ఇలా ఉండగా భారత్ లో నిన్న 75,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 54,27,706కి చేరింది. దీంతో మన దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 83.8 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 9,44,996 ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాకుండా మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాటి స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.