పాలిటిక్స్ కు రాజ్ భవన్ అడ్డా కాదు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం
posted on Oct 2, 2020 @ 7:34PM
తెలంగాణ రాజ్ భవన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దీ రోజులుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ ను తాము అపాయింట్ మెంట్ కోరగా.. ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందిస్తూ రాజకీయాలు చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
కరోనా కారణంగా తాను ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గత నాలుగు నెలలుగా రాజ్ భవన్ ఇదే విధానాన్నిఅవలంబిస్తోందని ఆమె తెలిపారు. రాజ్ భవన్ ఎపుడూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా రాజ్ భవన్ తలుపులు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆమె పేర్కొన్నారు.