పోలీసు అధికారుల పేరుతో ఫేస్ బుక్ లో మోసాలు.. ఒక మైనర్ తో సహా నలుగురి అరెస్ట్
posted on Oct 3, 2020 @ 6:19PM
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొంత మంది పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లతో వారి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న కొంత మంది స్నేహితులకు మెసేజ్ చేసి డబ్బులు పంపమని మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో ఐపీఎస్ అధికారులైన ఏడీజీ స్వాతి లక్రా, నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేరుతొ ఇటువంటి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ల తో చేసిన మోసం కూడా కొద్ది రోజుల క్రితం బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ పోలీసులు దీని పై దృష్టి పెట్టి ఇన్వెస్టిగేట్ చేయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేసిన పోలీసులు వారు చెప్పిన వివరాలు తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆ వివరాల ప్రకారం దేశంలోని తెలంగాణతో పాటు ఏపీ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 350 మంది పోలీస్ అధికారుల ఫేస్ బుక్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లుగా గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ నేరగాళ్లు పోలీస్ అధికారుల నకిలీ అకౌంట్లుతో పాటు పలు సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు కనుగొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ కేసులో మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తఖీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాం ఖాన్ లను అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ రంగనాధ్ తెలిపారు. వీరిలో మనీష్ మైనర్ బాలుడని ఆయన తెలిపారు. వీరంతా సాధారణంగా స్థానికంగా రోడ్ల మీద వెళ్లే వారిని బెదిరించి డబ్బులు లూటీ చేయడంతో పాటుగా ఓఎల్‌ఎక్స్ లో ఆర్మీకి చెందిన వాహనాలు, ఇతర వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లు, గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం లాంటి సైబర్ మోసాలకు పాల్పడే వారని తెలిపారు.
అయితే లాక్ డౌన్ మొదలైన తరువాత రోడ్లపై వాహనాలు సరిగా నడవకపోవడంతో పాటు, ఓఎల్‌ఎక్స్ లో కొనుగోళ్లు జరిపే ప్రజలకు అవగాహన పెరగడం.. అలాగే ఓఎల్‌ఎక్స్ ద్వారా ప్రజల కొనుగోళ్లు తగ్గిపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా సులభంగా డబ్బు సంపాదించాలని అలోచించి మొబైల్ ఫోన్, లాప్ టాప్ ల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల ఫేస్ బుక్ అకౌంట్లను టార్గెట్ చేసుకొని, వారి పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, వారి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడంతో పాటు కొందరిని మెసెంజర్ ద్వారా అత్యవసరం ఉందని మెసేజ్ పంపి ఫోన్ పే ద్వారా డబ్బులను పంపించమని మెసేజులు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.
ఈ నేరస్తులు ఉపయోగిస్తున్న పలు రాష్ట్రాలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు వీరు తమ నేరాలకు వాడుతున్నారని, ఇతర వ్యక్తుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అపరిచిత వ్యక్తుల నుండి 3000 రూపాయలకు వాటిని కొనుగోలు చేసి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ నేరస్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు సృష్టించారని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. ప్రస్తుత కరోనా సమయంలో వీరిని పట్టుకోవడానికి తాము చాలా శ్రమించాల్సి వచ్చిందని అయినప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తెలంగాణ పోలీసుల ప్రతిష్ట నిలిపే విధంగా సమర్ధవంతంగా వ్యవహరించి తమ బృందం రాజస్ధాన్ వరకు వెళ్లడం జరిగిందన్నారు.
మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలా ఫేస్ బుక్ అడ్డాగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ పోలీస్ బృందం పట్టుకుందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అయితే దీనిపై మరింత లోతైన విచారణ కొనసాగిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు చాలా అప్రమత్రంగా ఉండాలని, దీనిపై సరైన అవగాహన పెంచుకోవడం ద్వారా మోసపోకుండా జాగ్రత్త పడాలని అయన ప్రజలకు సూచించారు.