గన్నవరంలో ఉద్రిక్తత.. వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ
posted on Oct 3, 2020 @ 6:19PM
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వంశీ.. ఇప్పుడు వైసీపీ గూటికి రావడాన్ని దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో అప్పటినుంచి వైసీపీ నేతలు, వంశీ మధ్య వరుసగా వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా, యార్లగడ్డ ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, ఇంచార్జ్ ని తానేనని వంశీ ప్రకటించుకోగా.. దుట్టా, యార్లగడ్డ వర్గాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అంతేకాదు, ఒకసారి వంశీ-యార్లగడ్డ వర్గీయుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. తాజాగా మరోసారి గన్నవరం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో శనివారం నాడు రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. వల్లభనేని, దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహా బాహికి దిగారు. ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో కాకులపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. వరుస వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.