ఆన్ లైన్ తో ఆస్తి తగాదాలు.. కుటుంబాల్లో చిచ్చు! ధరణికో దండం?
posted on Oct 2, 2020 @ 5:33PM
ప్రజల ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం చేపట్టింది తెలంగాణ సర్కార్. ఈ నెల 5వ తేదీకి వివరాల సేకరణ, ఆన్లైన్ అప్లోడ్ పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్, పంచాయతీ డిపార్ట్మెంట్ల స్టాఫ్.. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులు, ఆధార్, ఫోన్నంబర్, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఈ డేటా అంతటినీ సర్కారు రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఫీల్డ్ లో అధికారులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియతో ఉమ్మడి కుటుంబాల్లో తగాదాలు వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సోదరులు ఉంటే ఒకరికి తెలియకుండా మరొకరు తమ పేరున ఆస్తుల వివరాలు నమోదు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఆస్తిపై తమకే హక్కు ఉందని, తమ పేరుతోనే నమోదు చేయాలని గొడవలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కొట్టుకునే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నమోదు చేసిన ఆస్తుల వివరాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకునే చాన్స్ లేకపోవడంతో ఈ సమస్య వస్తుందంటున్నారు సీనియర్ అధికారులు.
నాన్ అగ్రికల్చర్ ఆస్తుల లెక్కింపు కోసం వెళ్తే.. ఊర్లలో ఎవరూ అందుబాటులో ఉండట్లేదు. అంతా వ్యవసాయ పనులకు పోతున్నరు. ఇండ్లకు వెళితే దొంగల్లా చూస్తున్నరు. 15, 20 ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నరు, ఆసరా పెన్షన్లు ఆపుతరా, ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తరా అని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారని అధికారులు చెబుతున్నారు. సెల్ సిగ్నల్ సరిగా లేక, ఇంటర్నెట్ సరిగా రాక, సర్వర్ బిజీ రావడం వంటి వాటితో ఆన్లైన్లో వివరాల నమోదు కష్టమవుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల హడావుడితో రోజుకు 70 ఇండ్ల వివరాలు సేకరించాలని మున్సిపల్, పంచాయతీ స్టాఫ్ కు ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టారు. స్టాఫ్ టైం తక్కువగా ఉండటంతో పూర్తి సమాచారాన్ని నమోదు చేయలేకపోతున్నారు. పనిపూర్తి చేయాలనే తొందరతో కొందరు తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పంచాయతీలలో ఆన్లైన్ చేసేందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం చెప్పింది. కానిఫీల్డ్ లో అంతా రివర్స నడుస్తోంది. ఆస్తుల ఆన్లైన్ కార్యక్రమం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. గుడిసెలు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఆన్లైన్లోకి ఎక్కించాలంటే పైసలు ఇవ్వాలంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పూడూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అనధికారిక గుడిసెను ఆన్లైన్చేయడానికి ఆఫీసర్లు రూ. 2,300 వసూలు చేశారు. గుడిసెకు ఇంటి పన్ను కట్టినట్లు రూ. 300కు రసీదు ఇచ్చారు. రెండు వేల రూపాయలకు ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకొని ఇంటికి పంపారు. ఇలా గ్రామంలో దాదాపు 80 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ. రెండు వేల నుంచి మూడు వేల వరకు వసూలు చేశారు. రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితే ఉందన్న చర్చ జరుగుతోంది. సర్కార్ అనాలోచిత, హడావుడి నిర్ణయాల వల్లే ప్రజలు నష్టపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజల ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ అంత ఈజీ కాదని.. దసరాలోపు వివరాలను అప్లోడ్ చేయడం కష్టమేనని ఆఫీసర్లు అంటున్నారు. రోజుకు 60, 70 ఇండ్ల డేటా ఎట్లా తీసుకోగలమని, హడావుడిగా వివరాల నమోదు వల్ల కొత్త సమస్యలు వస్తాయని అంటున్నారు. ఉన్నతాధికారులు మధ్యాహ్నం కల్లా వివరాలు అందచేయాలని ఫోన్లు చేస్తున్నరు. ఊర్లలో సెల్ సిగ్నల్ ఉండటం లేదు. యాప్ సర్వర్ బిజీ అని వస్తోంది. ఓపెన్ కావడం లేదు. రోజుకు 70 ఇండ్ల ఆస్తులు లెక్కకట్టాలంటే అసాధ్యం. ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎలా చేస్తారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే తీరును చూస్తుంటే.. దసరా పండుగ రోజున ప్రారంభించే ధరణి పోర్టల్ పాక్షిక సమాచారంతోనే అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు ధరణి పోర్టల్లో ఎక్కని భూములన్నీ మిగులు భూముల కిందే లెక్క అన్న మంత్రి గంగుల కమలాకర్ కామెంట్లు కలకలం రేపుతున్నాయి. పోర్టల్లో ఒక్కసారి ఆస్తులు నమోదై లాక్ అయితే ఎవ్వరేం చేయలేరన్న మంత్రి.. నిర్బంధంగా ప్రజల ఇళ్ల స్థలాలు, సాగు భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆస్తుల డేటా ఎంట్రీలో తప్పులు వస్తే ఆఫీసర్లదే బాధ్యత అని హెచ్చరించారు. గంగుల వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాల్లో చాలా ఇండ్లకు ఎలాంటి డాక్యుమెంట్లు ఉండవు. కొందరు కాగితాలు గత్రా లేకుండా ఇతరుల ఇండ్లు కొంటుంటారు. ఇప్పుడు వారంతా ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇండ్లకు ఇప్పుడు డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఉంటున్న ఇల్లు తమది కాకుండా పోతుందా అన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.
మొత్తానికి అనాలోచితంగా,హడావుడిగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఆస్తుల ఆన్ లైన్ నిర్ణయం అయోమయంగా మారింది. ఆస్తుల సేకరణలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత కాలం ఉమ్మడిగా ఉన్న కుటుంబాలు.. కేసీఆర్ నిర్ణయం వల్ల గొడవలు పడి రోడ్డున పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం హడావుడి చేయకుండా.. నమోదు చేసిన ఆస్తుల వివరాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకునే చాన్స్ ఇవ్వాలని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు.