వచ్చే ఎన్నికలలో వైసీపీకి వచ్చేది 5 సీట్లేనట.. టీడీపీ నేత లాజిక్ అదిరింది..
posted on Oct 2, 2020 @ 7:32PM
ఏపీలో గత ఎన్నికలలో టీడీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి షాక్ ఇస్తున్నారు. ముందుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ కు జై కొట్టగా ఆ తరువాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. సీఎం జగన్ చెంతకు చేరిన ఈ ఎమ్మెల్యేలంతా డైరెక్టుగా వైసీపీ కండువా కప్పుకోకుండా బయటి నుంచి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వీరిలో కొంత మంది తమ వారసులకు సీఎం జగన్ తో వైసిపి కండువా కప్పించి ఆ పార్టీలోకి పంపి తమ పైన అనర్హత వేటు పడకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుడిని వైసీపీ గూటికి చేర్చడం ద్వారా అయన కూడా సీఎం జగన్ కు జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం ఐదు సీట్లే వస్తాయని అయన తన తాజా ట్వీట్ లో జోస్యం చెప్పారు. అంతేకాకుండా దీని వెనుక ఉన్న లాజిక్ ను కూడా అయన వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఐతే దీని వల్లే.. దేవుడి స్క్రిప్ట్ ప్రకారం.. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు మార్లు ఎద్దేవా చేసిన సంగతి గుర్తు చేస్తూ బుద్దా వెంకన్నకూడా ఇప్పుడు ఇదే లాజిక్‌ను వైసీపీకి అప్లై చేస్తూ కామెంట్స్ చేసారు.
తాజాగా టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను వైసీపీ లాగేసుకుందని.. ఈ నేపథ్యంలో వైసీపీ లాజిక్ ప్రకారం చుస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు సీట్లే వస్తాయని వెంకన్న ట్వీట్ చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నామని విజయసాయిరెడ్డి చెబుతున్నారని.. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కరోనా ప్రభావంతో మైండ్ దెబ్బతిన్నట్లుగా అనిపిస్తోందని వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతే, వైసీపీలోకి రావాలని గతంలో విజయసాయిరెడ్డి అన్నారని.. మరి రాజీనామా చెయ్యకుండానే వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలను ఎంత పెట్టి కొన్నారో చెప్పాలని బుద్ధా వెంకన్నడిమాండ్ చేశారు.