దుబ్బాకలో టీజేఎస్.. మండలికి కాంగ్రెస్! కొత్త ఫార్మూలా?
posted on Oct 2, 2020 @ 11:31AM
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై పీసీసీ నేతలు తీవ్రంగా మంతనాలు సాగిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేస్తుండటంతో అక్కడ ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు వస్తున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో ఉంది టీజేఎస్. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేశారు కోదండరామ్. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ సర్కార్ పై పోరాడుతున్నారు. మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కోదండరామ్.. తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరారు. దీంతో కోదండకు మద్దతుపై కాంగ్రెస్ లో క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది.
కోదండరామ్‌కు మద్దతు ఇచ్చే విషయంపై పార్టీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులంతా ఆయనకు మద్దతు ఇవ్వకుండా సొంతంగా పోటీ చేయాలని టీపీసీసీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున పోటీ చేసిన తెలంగాణ జనసమితి కనీస ప్రభావాన్ని చూపలేకపోయిందనీ.. పోటీచేసిన అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారట. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారట. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. దుబ్బాక ఉపఎన్నికల్లో టీజేఎస్‌కు మద్దతు ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ సహాయం కోరాలని మరికొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో కోదందరామ్‌కు మద్దతు ఇచ్చే విషయంపై సబ్‌కమిటీని ఏర్పాటుచేసి ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌లో పోటీదారుల సంఖ్య భారీగా ఉంది.మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానానికి 29 మంది, నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి 25మంది అశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీమంత్రి జీవన్ రెడ్డి గెలవడంతో గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోటీకి నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. యువత, ఉద్యోగులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉండటంతో కష్టపడితే ఈజీ గెలవొచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. సొంతంగానే పోటీచేయాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తుండటంతో పీసీసీ పెద్దలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.
మరోవైపు సబ్ కమిటీ పేరుతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరమైతే కోదండరామ్‌నే కాంగ్రెస్ పక్షాన పోటీకి ఒప్పించాలని, అందుకు అంగీకరించని పక్షంలో స్వతహాగా పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఫైనల్ చేయాలని టీపీసీసీ పెద్దలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.