జగన్ ప్రభుత్వానికి హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్.. నమ్మకం లేకపోతే కోర్టునే మూసేయండి
posted on Oct 2, 2020 @ 10:49AM
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హైకోర్టును అపకీర్తి పాలు చేసేలా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభ్యంతరకర పోస్టులపై తాజాగా జగన్ సర్కార్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు లేవంటూ హైకోర్టులో అప్పటి రిజస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన వ్యాజ్యం నిన్న విచారణకు రాగా ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలు కుట్రలో భాగంగానే హైకోర్టుపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. ఇతరుల ప్రభావం లేకుండా ఎవరూ న్యాయమూర్తులను దూషించరని... దీని వెనుక ఉన్న కుట్రను తప్పకుండా తేల్చుతామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించబోమని హెచ్చరించింది.
న్యాయవ్యవస్థపై నమ్మకం లేనివారు పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరడం మంచిదని ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు... రాష్ట్రంలో చట్టబద్ధ పాలన (రూల్ ఆఫ్ లా) అనేది ఉందా? అని నిలదీసింది. "రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు కావడంలేదు. చట్టబద్ధ పాలన జరగకపోతే... మేమే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని ఉపయోగిస్తాం" అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. న్యాయమూర్తులనే అవమానపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తారా.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "‘ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. న్యాయం అనే స్తంభం బలహీనమైతే అది అంతర్యుద్ధానికి (సివిల్ వార్) దారి తీస్తుంది" అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. "న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని రోజున ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది" అని తెలిపింది. ఇదే సందర్భంలో "మీది ధనిక రాష్ట్రం కదా! సుప్రీంకోర్టుకు వెళ్లి... సీనియర్ లాయర్లను నియమించుకోవచ్చు" అని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేసింది.
న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా హైకోర్టే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి అభ్యంతరకర పోస్ట్‌లను అనుమతించరాదని సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. కోర్టుల పై అభ్యంతరకర కామెంట్ల పై తగిన చర్యలు తీసుకోవాలని, పోస్టింగులకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థలు స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించారు. సామాజిక మాధ్యమాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సజన్ పూవయ్య, ముకుల్ రోహత్గీ తదితరులు హాజరై.. ఆయా సోషల్ మీడియా సంస్థల తరఫున కౌంటర్లు దాఖలు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పెంపొందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సాల్వే, సజన్ పూవయ్య కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.