బీజేపీకి బైబై.. కాంగ్రెస్‌కు జైజై.. జగన్‌రెడ్డికి పీకే బంపర్ ఆఫర్!
posted on Jun 9, 2021 @ 12:40PM
టైటిల్ చూసి షాకై ఉంటారు కొందరు. అవును, అది నిజమేనని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఎందుకంటే.. రంగంలోకి దిగింది ది గ్రేట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ కాబట్టి. ఆయన జగన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది పీకేనే కాబట్టి. త్వరలో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు రెడీ అవుతున్నాడు కాబట్టి. ఇన్ని కాబట్టిలు ఉన్నాయి కాబట్టే.. బీజేపీతో ఏమాత్రం తేడా వచ్చినా.. తనపై ఉన్న సీబీఐ కేసులు ఉచ్చు మరింత బిగిసినా.. మోదీకి హ్యాండ్ ఇచ్చేసి.. కాంగ్రెస్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు జగన్‌రెడ్డి సిద్దమవుతున్నాడని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇదే ఇప్పుడు హస్తినలో హాట్ టాపిక్ అయిందని కూడా తెలుస్తోంది.
పొగ లేనిదే నిప్పు రాదు. అది మీడియా వరకు అస్సలు రాదు. బెంగాల్ ఘన విజయం తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫోకస్ ఢిల్లీ పీఠంపై పడింది. మోదీపై వ్యతిరేకతతో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అందుకే, ఎవరూ అడగకముందే.. రాహుల్‌ను పీఎం కేండిడేట్‌గా ప్రకటిస్తే తాను కాంగ్రెస్ తరఫున పని చేయడానికి సిద్దమని ప్రకటించి కలకలం రేపాడు. ప్రస్తుత పరిస్థితిల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం అంత ఈజీనా. వేరే వారికైతే కాకపోవచ్చు కానీ, పీకే మాత్రం చేసి చూపిస్తానంటున్నాడు. ఇప్పటికే తన వల్ల అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీల మద్దతుతో యూపీఏను పవర్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ దఫా ప్రాథమిక చర్చలు కూడా జరిగాయని సమాచారం. అయితే, ఈ జాబితాలో స్టాలిన్, మమతలతో పాటు జగన్ పేరు కూడా ఉండటమే సంచలన విషయం.
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో ప్రశాంత్ కిశోర్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. తనను గెలిపించిన వ్యూహకర్తగా పీకే అంటే జగన్‌రెడ్డికీ విపరీతమైన అభిమానం. అందుకే, ఆనాడు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే జగన్‌రెడ్డి ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఆయన టీమ్‌ను కలిసి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలిపారు. వారిద్దరి మధ్య ఆ అనుబంధం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. ఆ చొరవతోనే వైసీపీని యూపీఏ కూటమిలోకి తీసుకొచ్చేలా పీకే మధ్యవర్తిత్వం నెరపుతున్నారని చెబుతున్నారు.
పీకే సరే.. మరి జగన్‌కు ఏం లాభం అనే ప్రశ్న రాకమానదు. జగన్‌రెడ్డి ఎందుకు బీజేపీని వీడి కాంగ్రెస్ చెంతకు చేరుతారనే అనుమానం సమంజసమే. తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే.. ఈ ప్రశ్నకు సమాధానం సులువే. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ వ్యూహం, కేంద్రం వైఖరిలో ఇటీవల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలోనైనా సొంతంగా అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం. తాత్కాలిక ప్రయోజనాల కోసమే ప్రాంతీయ పార్టీలకు సపోర్ట్ చేస్తుంటుంది కాషాయం. అవసరం తీరాకా.. పుట్టి ముంచేస్తుంది. అందుకు, మహారాష్ట్రనే బెస్ట్ ఎగ్జాంపుల్. అదే విధంగా ఏపీలోనూ జగన్‌రెడ్డికి కేంద్రం నుంచి మరెంతో కాలం మద్దతు వచ్చే పరిస్థితి లేదు. సీబీఐ కేసుల విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. ఇటీవల జగన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్‌పై సీబీఐ తటస్థ వైఖరి అవలంభించడమే ఇందుకు నిదర్శనం. ఆ కేసు అనూహ్యంగా.. వేగంగా విచారణ జరుగుతుండటం ఆసక్తికరం. రఘురామ సైతం బీజేపీ సానుభూతిపరుడేనని.. ఆ పార్టీ డైరెక్షన్‌లోనే ఆయనలా చెలరేగిపోతున్నారని టాక్. జగన్‌రెడ్డిపై సీబీఐ కేసుల ఉచ్చు మరింత బిగించి, ఆయన్ను జైలుకు తరలించి.. తమిళనాడులో శశికళను సైడ్ చేసినట్టు చేసి.. ముఖ్యమంత్రి పీఠంపై జగన్‌రెడ్డి స్థానంలో వైఎస్ షర్మిలను కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు.. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా.. జగన్‌రెడ్డిపై కేంద్రం, సీబీఐ వైఖరి మారిందనేది మాత్రం పక్కా.
కేంద్రం తీరుకు తగ్గట్టే.. జగన్‌రెడ్డి ఆలోచనలోనూ మార్పు వస్తోందని అంటున్నారు. ఆనాడు తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత తనను ఉన్నపళంగా సీఎం చేయకుండా.. సీబీఐ కేసులతో తనను జైల్లో చిప్పకూడు తినిపించారనే కోపంతోనే.. జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు అదే బీజేపీ.. తనకు హ్యాండ్ ఇచ్చి.. మళ్లీ తనను జైల్లో వేసే ప్రయత్నం చేస్తుంటే.. తన దారి తాను చూసుకోవడంలో తప్పేముందనేది జగన్ వర్షన్‌లా అనిపిస్తోంది. కాంగ్రెస్‌తో శతృత్వం.. గతం గతః. ఇప్పుడు వర్తమానం ఎలా ఉందనేదే ముఖ్యం. భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది మరింత ముఖ్యం. అందుకే, కాంగ్రెస్‌తో గత వైరాన్ని వీడి.. ఫ్రెష్‌గా రాజకీయ బంధం కలుపుకునేందుకు జగన్‌రెడ్డి సైతం సంసిద్దంగానే ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు జగన్మోహన్‌రెడ్డికి ప్రశాంత్ కిశోర్ బ్రెయిన్ వాష్ చేశారని తెలుస్తోంది.
బీజేపీని నమ్మలేని పరిస్థితులు రావడంతో.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఎలా ఉంటుందని జగన్‌రెడ్డి ఇప్పటికే తన సన్నిహిత సీనియర్ మంత్రుల దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ లాంటి మాజీ కాంగ్రెస్ ఘనులు.. హస్తం పార్టీ అన్నిరకాలుగా సురక్షితంగా ఉంటుందని.. యూపీఏలోనైతే ఎవరి ఆట వారు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చని.. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అలానే చేశారని.. ఆయన తనయుడిగా జగన్మోహన్‌రెడ్డికి యూపీఏలో మంచి ప్రాధాన్యం తప్పకుండా ఉంటుందని ఆ సీనియర్ మంత్రులు సైతం జగన్‌కు నచ్చజెప్పారని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు అంటున్నాయి.
అటు, రాజకీయంగానూ జగన్‌రెడ్డి లెక్కలు బేరీజు వేసుకుంటున్నారట. బీజేపీకి మద్దతుగా ఉండటం వల్ల.. ముస్లిం వర్గాలు జగన్‌కు బాగా దూరమయ్యాయి. బీసీల పార్టీగా ఉన్న టీడీపీ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. కాంగ్రెస్‌కు దగ్గరైతే ఆ మేరకు మరింత లాభపడొచ్చు. ఎస్సీ, క్రిస్టియన్ల ఓట్లు 100శాతం కొల్లగొట్టొచ్చనేది జగన్ పొలిటికల్ మ్యాథమెటిక్స్.
మరోవైపు, దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ దారుణంగా పడిపోతుండటం.. పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవాలు ఎదురవుతుండటం.. కరోనా విషయంలో మోదీ ఇమేజ్ ఫుల్‌గా డ్యామేజ్ అవడం.. కీలకమైన యూపీలో బీజేపీ అంతర్మథనం.. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ నాటికి దేశంలో బీజేపీ పరిస్థితి మరింత పతనమయ్యేలా ఉండటం.. చూస్తుంటే ఇంకా కాషాయపార్టీకే గులాంగురి చేస్తే తీవ్రంగా నష్టపోక తప్పదనే భావన వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోందట. ఇదే విషయాన్ని కొందరు నేతలు ఇప్పటికే జగన్‌రెడ్డి దృష్టికీ తీసుకొచ్చారట. బీజేపీతో ఉంటే మనకూ గడ్డుకాలం తప్పదని.. ప్రత్యామ్నాయం చూసుకుంటే బెటరేమోనని చర్చించుకున్నారట. అదే సమయంలో.. సీబీఐ కేసుల విషయంలో కేంద్రం నుంచి సహాయ సహాకారాలు తగ్గిపోవడం.. జగన్‌రెడ్డిని గద్దె దింపి.. ఆ స్థానంలో షర్మిలను తీసుకొచ్చే కుట్రలు చేస్తున్నట్టు అనుమానం రావడంతో.. జగన్ అటెన్షన్‌లోకి వచ్చారని చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి సందిగ్థ సమయంలో.. అనూహ్యంగా ప్రశాంత్ కిశోర్ టచ్‌లోకి రావడం కాకతాళీయమే అయినా.. కలిసొచ్చే పరిణామమని జగన్ భావిస్తున్నారట.
తనకు సన్నిహితుడైన పీకేను నమ్మొచ్చని.. అందులోనూ ఆయనే స్వయంగా రాహుల్‌గాంధీ కోసం పని చేస్తాననడం.. రాహుల్ పేరును ప్రధానిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని స్పష్టం చేయడం.. కేంద్రంలో జరగబోవు అధికార మార్పుకు ముందస్తు సంకేతం అంటున్నారు. అందుకే, ప్రశాంత్ కిశోర్ పిలుపు మేరకు.. కాంగ్రెస్‌తో పాత వైరాన్ని పక్కనబెట్టి.. తేడా వస్తే బీజేపీని వదిలిపెట్టి.. కలిసొచ్చే కాలానికి కలిసొచ్చే పార్టీతో జతకట్టేందుకు జగన్‌రెడ్డి మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారని అంటున్నారు. అయితే, కేవలం ప్రశాంత్ కిశోర్ ఆఫర్ ఇచ్చారని ఇప్పటికిప్పుడే బీజేపీకి బైబై చెప్పేసి.. కాంగ్రెస్‌కు జైజై కొట్టకున్నా.. 2024 ఎన్నికల వరకూ వేచి చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, ఈలోగా సీబీఐ కేసుల చిక్కుముడి తన మెడకు మరింత బిగుసుకుంటే.. సమయం లేదు మిత్రమా అంటూ కాంగ్రెస్‌కు స్నేహహస్తం చాచినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అందుకే కాబోలు.. ఇటీవల పలువురు కాంగ్రెస్‌పార్టీ జాతీయ నేతలు జగన్మోహన్‌రెడ్డికి అనుకూల స్టేట్‌మెంట్లు చేస్తున్నారు. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. గుర్రం ఎగరావచ్చు....