హంపి పార్టీపై మంత్రి జగదీశ్ రెడ్డి రియాక్షన్.. చెత్త లీడరంటూ ఫైర్
posted on Jun 9, 2021 @ 4:16PM
కర్ణాటకలోని హంపిలో మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో జరిగిన పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారగా.. అధికార టీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తోంది. ఈటల రాజేందర్ బర్తరఫ్ వేడి చల్లారకముందే .. తెరపైకి వచ్చిన హంపి మీటింగ్ రచ్చ గులాబీ లీడర్లలో గుబులు రేపుతోంది. హంపి పార్టీలో జరిగిన పరిణామాలపై గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నారని.. కేసీఆర్ కు అత్యంత నమ్మినబంటుగా ముద్ర పడిన మంత్రి జగదీష్ రెడ్డికి కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో సెగలు రేపుతున్న హంపీ పార్టీపై.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.
తనను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యంగ్య ట్వీట్ పై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు మాట్లాడిన విషయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు.
జగదీశ్ రెడ్డి కుమారుడి పుట్టిన రోజు వేడుకలను హంపిలో జరిపినట్టు, ఆ వేడుకలకు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనలపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అందులో పేర్కొంది. ఇప్పటికే ఈటలపై వేటు పడడంతో.. తర్వాతి వేటు పడేది జగదీశేనా? అన్న కోణంలో వార్తను ప్రచురించింది. ఆ కథనాలను ట్వీట్ చేసిన రేవంత్.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా? అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా గత జనవరిలో కర్నాటక రాష్ట్రంలోని హంపిలోని ఒక ఫాంహౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు. తనకు బాగా సన్నిహితులు అనుకున్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికారంలో వివిధ హోదాలను అనుభవిస్తున్న పలువురు ముఖ్యులు ఈ పార్టీకి హాజరయ్యారు. హుషారుగా పార్టీ మొదలైంది. మందేసిన తర్వాత అసలు సినిమా మొదలైంది. కేసీఆర్ పాలన పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు మనసులో మాట బయట పెట్టారట. పాలన పూర్తిగా కుటుంబమయమైపోయిందని... పెత్తనం మొత్తం అయ్యా కొడుకుల దగ్గరే ఉందని ఒక్కొక్కరుగా రెచ్చిపోయారట. ఈటెల రాజేంద్రను అధిష్టానం టార్గెట్ చేయడంపైనా కొందరు ఫైరయ్యారట. పెద్దసార్ నియంత అయినా భరించనం కాని.. రేపొద్దుగాల చిన్నసారు సీఎం అయితే... భరించుడు మనతో ఐతదా...!? అన్న కోణంలో చర్చ జరిగిందట. సహజంగా కళాకారుడైన ఓ ఎమ్మెల్యే మత్తులోనే కేసీఆర్ నియంత పాలన, రేపొద్దున కేటీఆర్ సీఎం అయితే చిన్నసారు నియంత పాలన ఎట్లుంటదో తనదైన శైలిలో ఊహించుకుని, పాటకట్టి పాడాడట. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మనసులో మాట చెప్పుకోగలం అన్నట్టు ఎవరికి వారు రెచ్చిపోయారని సమాచారం.