ఐసీయూలో ఉన్నా..నిర్ణయం తీసుకోని కాంగ్రెస్
posted on Jun 9, 2021 @ 12:25PM
తమ పేషెంట్ కు కరోనా వచ్చిందని తెలుసు.. ట్రీట్ మెంట్ తప్పదని తెలుసు.. ఏ ఇంజెక్షన్ ఇస్తే బతుకుతాడో తెలుసు.. అయినా సరే.. ఏ మందూ ఇవ్వకుండా అలాగే వదిలేశారు. ఒక ఇంజెక్షన్ ఇద్దామని రెడీ అయ్యారు.. మిగతా బంధువులంతా ఇవ్వడానికి వీల్లేదంటూ అడ్డం పడుతున్నారు. దాంతో ఏం ఛేయాలో తెలియక పేషెంట్ ను ఐసీపీయూలోనే వదిలేశారు. సరిగ్గా ఇలాగే ఉంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్ధితి. పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయడంలో జరుగుతున్న ఆలస్యం ఆ పార్టీ భవిష్యత్ నే మింగేస్తుందన్న సత్యం తెలుస్తున్నా కూడా.. ఎవరికి వారు తమ తమ వ్యూహాల్లో మునిగిపోయారు.
తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఎలా ఇస్తారని సీనియర్ కాంగ్రెస్ నేతలు అడ్డం తిరుగుతున్నారు. కాని వారు చేయగలిగిందేమీ లేదని వారికీ తెలుసు. ఒక ఎంపీ అయితే.. తాను ఒక జిల్లాకే పరిమితం అని తెలిసినా కూడా.. పీసీసీ చీఫ్ తనకే కావాలని వాదిస్తున్నాడు. మరో నాయకుడు అయితే ఆయన నియోజకవర్గంలోనే ఇప్పుడు గెలవలేని పరిస్ధితి..ఆయన కూడా ఆ పదవి తనకే ఇచ్చి, ఓ అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నాడు.
రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి ఖాయం అనే వార్తలొచ్చిన దగ్గర నుంచి టీకాంగ్రెస్ లో మొదలైన లొల్లి అలాగే కంటిన్యూ అవుతోంది. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి నాగార్జునసాగర్ ఉఫ ఎన్నిక అయ్యేవరకు ఆపాలని పెద్దలు జానారెడ్డి కోరినందుకు.. అప్పటివరకు అని చెప్పి ఆగారు. ఇప్పుడు అది అయిపోయినా కూడా ఏమీ తేల్చలేకపోతున్నారు. మరోవైపు బిజెపిది ప్రతాపం కాదు.. ఆరంభ శూరత్వమే అని కొందరు నేతలు విమర్శిస్తున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ డిల్లీకి పోయి అవగాహన కుదుర్చుకున్నారో.. అప్పటి నుంచే బిజెపి బలం సగం పడిపోయిందని వారంటున్నారు. అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లు.. అవకాశు ఉన్నా.. కాంగ్రెస్ బతికిబట్ట కట్టి మళ్లీ బలం చూపేందుకు ఛాన్స్ ఉన్నా కూడా..ఒక్క నిర్ణయం తీసుకోలేక భవిష్యత్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాగే ఆలస్యం చేస్తే.. బిజెపికి మళ్లీ పుంజుకోవటానికి అవకాశం ఇచ్చినట్లువుతుందని కాంగ్రెస్ లోనే కామెంట్లు వినపడుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఓపికగా ఎదురుచూడటంపైనా కామెంట్లు వస్తున్నాయి. కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర రెడ్డి మొన్న దూరమైతే..నిన్న ఈటల రాజేందర్ కూడా బిజెపి దారి చూసుకోవడం.. ఇవన్నీరేవంత్ రెడ్డి పై ఒత్తిడి పెంచుతున్నాయి. సొంత పార్టీ పెట్టాలనే ఒత్తిడి కూడా రేవంత్ పై ఎప్పటి నుంచో ఉంది. కాని జాతీయ పార్టీ అండ లేకుండా లక్ష్యాన్ని చేరుకోలేమనే ఫార్ములాను రేవంత్ రెడ్డి తన అనుచరులను వినిపిస్తున్నారంట. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇంత లేటు చేసినా..తాను మాత్రం దాన్నే నమ్ముకుని ఎదురు చూస్తానని చెబుతున్నారంట.
ఏమైనా మొత్తం మీద రేవంత్ రెడ్డికే అధిష్టానం మొగ్గు చూపుతుందని.. కాని మిగతావాళ్లు ఒప్పుకోనందునే ఆలస్యం చేస్తుందని..తర్వలోనే రేవంత్ రెడ్డికే అప్పచెబుతూ ప్రకటన వస్తుందని.. ఆయన వర్గం చెబుతోంది. అది జరగకపోతే మాత్రం కాంగ్రెస్ ను తెలంగాణలో మళ్లీ లేపడం సాధ్యమయ్యే పని కాదని వారంటున్నారు.