ఈటలకు మరో పార్టీ ఆహ్వానం.. మనసు మార్చుకుంటారా?
posted on Jun 9, 2021 @ 2:39PM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో బలప్రదర్శనకు దిగిన రాజేందర్.. టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు వెళుతున్నారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటి తన పవరేంటో చూపించాలని చూస్తున్నారు. అయితే రాజేందర్ కేంద్రంగా తెలంగాణలో రసవత్తర రాజకీయం సాగుతోంది. బీజేపీలో చేరబోతున్నట్లు ఈటల సంకేతం ఇచ్చినా.. ఆయన కోసం మిగితా పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో రాజేందర్ మంతనాలు సాగించినా.. ఇప్పటికి ఆయనపై తమ వైపు వస్తారనే ఆశతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే రాజేందర్ కు మద్దతుగానే హస్తం లీడర్లు ప్రకటనలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగానే ఈటల రాజేందర్ కు మరో పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. జూలై8న తన పార్టీని ప్రకటించనున్న వైఎస్ షర్మిల.. రాజేందర్ ను సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీలో చేరాలంటూ ఈటలకు వెల్ కం పలికారు షర్మిల. కేసులకు భయపడే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ఆమె కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని అన్నారు. ఈటల రాజేందర్ తమ పార్టీలోని వస్తానంటే ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. కరోనా విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే సరిపోయింది.. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కొనే ఉద్దేశం కేసీఆర్ లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటున్న వైఎస్ షర్మిల.. బుధవారం లోటస్‌పాండ్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు షర్మిల దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు, ఆంక్షలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ టీపీలో కార్యకర్తలే కీలకమని.. వారికే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పార్టీలో కార్యకర్తలే కీలకం.. వారికే పెద్దపీట ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. పార్టీ ఏర్పాటుకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఆలోగా కార్యకర్తలందరూ ప్రతీ గడపకు వెళ్లి.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. ప్రతి వర్గాన్ని కలవాలని షర్మిల నిర్దేశించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించాలని స్పష్టం చేశారు.