ఒకే కాన్పులో 10 మంది పిల్లలు! దక్షిణాఫ్రికా మహిళా వరల్డ్ రికార్డ్
posted on Jun 9, 2021 @ 11:59AM
కవల పిల్లలు పుట్టడమే అరుదుగా జరుగుతోంది.. ముగ్గురు పిల్లలు పుడితే ఆశ్చర్యమే.. ఒకే కాన్పులో అంతకంటే ఎక్కువ పిల్లలు పుడితే వింత.. సంచలనం.. కాని ఒకే కాన్పులో ఏకంగా 10 మంది పిల్లలు పుడితే... అసలు ఇది జరుగుతుందని నమ్ముతున్నారా.. కాని ఇది జరిగింది.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలో ఒకే కాన్పులో అత్యంత ఎక్కువ మంది పిల్లలు పుట్టడం ఇదే తొలిసారి కావచ్చనీ... ఇదే ప్రపంచ రికార్డు అవుతుందని అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ... 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే... 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు మగ పిల్లలు కాగా... ముగ్గురు ఆడ పిల్లలు. ఆమె భర్త తెబోగో సోతెత్సీ చెప్పిన వివరాల ప్రకారం ప్రిటోరియాలోని ఆస్పత్రిలో... సిజేరియన్ సెక్షన్‌లో జున్ 7న గోసియామే థమారా సిథోలే ఈ పిల్లలకు జన్మనిచ్చింది.
డాక్టర్లు మొదట ఆమెను స్కాన్ చేసినప్పుడు... ఆరుగురు పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు. ఆ తర్వాత మరో సందర్భంలో చెక్ చేసినప్పుడు... ఎనిమిది మంది పిల్లల పుట్టబోతున్నారని కానీ ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే... మొత్తం 10 మంది ఉన్నట్లు తేలింది.
గోసియామే సిథోలే... ఆమె భర్త తెబోగో సోతెత్సీకి ఆల్రెడీ ఆరేళ్ల కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తెబోగో నిరుద్యోగి. కానీ ఇంత మంది పిల్లలు పుట్టడం తనకు ఆనందంగా ఉందనీ చెప్పారు. "ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు... నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను మాట్లాడలేకపోతున్నాను" అని తెబోగో అన్నారు.
ఈ ప్రెగ్నెన్సీ సహజమైనదేనని వైద్యులు చెబుతున్నారు. సహజంగా ఇలా ఇంత ఎక్కువ మంది పుట్టడానికి అండం విడుదలైనప్పుడు ఎక్కువ ఎంబ్రియోలు చొచ్చుకు వెళ్లడమే కారణం అంటున్నారు. ప్రస్తుతం ఆ తల్లి, పిల్లలంతా క్షేమంగానే ఉన్నారంటున్న డాక్టర్లు వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.