దేశాధ్యక్షుడిని లాగి కొట్టేశాడు.. వైరల్ గా మారిన వీడియో
posted on Jun 9, 2021 @ 12:25PM
అతనో దేశాధ్యక్షుడు.. జనంలోకి వచ్చాడు. వారితో కరచాలనానికి యత్నించాడు. అక్కడే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశాధ్యక్షుడు ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వగా.. అనూహ్యంగా అతను చెంపదెబ్బ కొట్టాడు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది.ప్రెసిడెంట్ ను చెంప దెబ్బ కొట్టిన ఘటన షాకింగ్ గా మారింది. ఆ వీడియో వైరల్ గా మారింది.
ప్రజల్ని స్వయంగా కలుసుకోవాలని భావించిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్.. రెండు నెలల వ్యవధిలో దేశంలోని 12 ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా చేసిన రెండో పర్యటనలోనే ఆయనకు ఈ షాకింగ్ ఘటన ఎదురైంది. ఆగ్నేయ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మక్రాన్.. అక్కడో హైస్కూల్ ను సందర్శించారు. అనంతరం తన కారు వైపు వెళుతుండగా.. పెద్ద ఎత్తున నిలబడి ఉన్న ప్రజలు.. ప్రెసిడెంట్ ను తమ దగ్గరకు రావాలని కోరారు. దీంతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉత్సాహంగా అక్కడికి వెళ్లారు మక్రాన్. ఇంతలోనే గుంపులోని ఓ వ్యక్తి మక్రాన్ చెంప చెల్లుమనిపించాడు.
మెరుపు వేగంతో భద్రతా సిబ్బంది స్పందించినప్పటికి.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ ఘటన పెను సంచలనంగా మారింది. చెంపదెబ్బ కొట్టిన వ్యక్తితో పాటు.. మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెంప దెబ్బ కొట్టే సమయంలో ‘డౌన్ విత్ మాక్రోనియా.. మోంట్ జోయి సెయింట్ డెనిస్’’ అంటూ నినాదం వినిపించింది. ఇది ఫ్రాన్స్ రాజరిక సమయంలో ఫ్రెంచ్ సైన్యం యుద్ధ నినాదంగా చెబుతున్నారు. దేశాధ్యక్షుడు మాక్రాన్ పై దాడి ప్రయత్నం జరిగినట్లుగా ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది.అయితే.. ఈ దాడి ఎందుకు జరిగింది? చేసిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? వారెందుకు చేశారు? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదు.
దేశాధ్యక్షుడిని చెంపదెబ్బ కొట్టిన ఘటనను ఫ్రాన్స్ రాజకీయ నేతలంతా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం అంటే చర్చ.. చట్టబద్ధమైన అసమ్మతి తెలపటమే కానీ ఇలా చేయి చేసుకోవటం పద్దతి కాదని దేశ ప్రధాని జీన్ కాస్టెక్స్ పేర్కొన్నారు. అధ్యక్షుడికి సంఘీభావం తెలుపుతూ ఫ్రాన్స్ విపక్ష నేత జీన్ లూక్ మెలెన్ చాన్ కూడా ట్వీట్ చేశారు.