కేసీఆర్ వీక్ నెస్ ఇదే.. ఈటల సంచలనం
posted on Jun 9, 2021 @ 4:45PM
టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా దూకుడు మరింత పెంచారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండవరోజు పర్యటించిన ఈటల.. తన మద్దతుదారులతో కలిసి బలప్రదర్శన చేశారు. ఇల్లందకుంటకు వెళ్లిన రాజేందర్.. స్థానికులతో మాట్లాడారు. తన పర్యటనతో మద్దతు కూడగట్టుకోవడంతో పాటు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ లో తనకు ఏ విధంగా అవమానం జరిగిందో వివరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను చెప్పుకుంటూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బండారం బయటపెడుతున్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా కేసీఆర్ వీకెనెస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక వస్తుందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటిస్తారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మన ముఖ్యమంత్రికి ఒక అలవాటు ఉంది.. ఎప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఆ నియోజక వర్గాల్లో వరాల జల్లు కురిపించే అలవాటు ఉంది..కాబట్టి ఈ నియోజక వర్గంలో కూడా మూలన పడ్డ పనులు జరిగేలా నిధులు విడుదల చేయాలని నేను కోరుతున్నానాను ఈటల డిమాండ్ చేశారు.వావిరాలను మండలంగా చేయాలని కోరాను., గతంలో చల్లూరు మండలం కావాలని కోరాను. అలాగే, హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని కోరాను. పరిపాలన సౌలభ్యం కోసం. మా కోరిక మేరకు తక్షణమే ఈ దిశగా అడుగులు వేయాలి.
అధికారంలో ఉన్నపుడు.. లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నానన్నారు రాజేందర్. హుజూరాబాద్ నియోజక వర్గంలో తెల్ల రేషన్ కార్డులు, పింఛన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 58 ఏళ్లు నిండిన అందరికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని.. ఇకనైనా వెంటనే అమలు చేయాలన్నారు ఈటల. హుజూరాబాద్‌లో ఓట్లు కావాలంటే నిరుద్యోగ భృతి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటూ అని ఈటల కామెంట్ చేశారు.
తానుపార్టీ పెట్టలేదు.. పార్టీ మారలేదని ఈటల అన్నారు. ఆ పార్టీ నుంచి బయటకు మాత్రం వచ్చానన్నారు. ఎవరో అనామకుడు ఇచ్చిన ఫిర్యాదు వల్ల తనను తొలగించారని చెప్పారు. ఎవరూ తీసుకున్న బొందలో వాళ్లే పడతారని.. తనను వేధించిన వారికి తగిన శాస్త్రి జరుగుతుందని ఈటల ఆవేశంగా మాట్లాడారు. హుజూరాబాద్‌లో కొందరు చెంచాగాళ్లను పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ లో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని.. ఇక్కడ న్యాయ యుద్ధం జరుగుతుందని.. హుజూరాబాద్ ప్రజలే ఇక్కడ గెలుస్తారని చెప్పారు ఈటల రాజేందర్.