రేవంత్ దూకుడు.. బీజేపీ బేజారు.. భయమా? వ్యూహాత్మక మౌనమా?
posted on Jun 30, 2021 @ 7:01PM
రేవంత్‌రెడ్డి నాన్‌స్టాప్‌గా వాయిస్తున్నారు. నోటికి మరింతగా పని చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌గా ప్రమోషన్ వచ్చాక.. చిచ్చరపిడుగులా చెలరేగి పోతున్నారు. రేవంత్ నోటి నుంచి మాటలు తూటాల్లా దూసుకొస్తున్నాయి. ఇటు కేసీఆర్, కేటీఆర్‌తో పాటు అటు మరో ప్రత్యర్థి అయిన బీజేపీనీ ఏకిపారేస్తున్నారు. మోదీ నుంచి బండి.. వరకూ ఏ ఒక్కరినీ వదలకుండా విమర్శలతో తూట్లు పొడుస్తున్నారు. రేవంత్ మాటలు సూదుల్లా పొడుస్తున్నా.. కమలనాథుల నుంచి కనీస కౌంటర్ పడకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటన వచ్చిన ఫస్ట్‌డేనే కేసీఆర్‌తో పాటు సమానంగా బీజేపీపైనా విమర్శలు సంధించారు రేవంత్‌రెడ్డి. అప్పటి నుంచీ దాదాపు ప్రతీరోజూ కమలనాథులను ఏదో విధంగా కవ్విస్తూనే ఉన్నారు. అయినా, వారి నుంచి ఉలుకుపలుకూ లేదు. ప్రధాని మోదీ సన్యాసి అని కామెంట్లు చేసినా.. కనీసం ఖండించనేలేదు కాషాయదళం. ఈటలను కేసీఆరే బీజేపీలోకి పంపించారని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ.. కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్‌ను కేసీఆరే అరేంజ్ చేశారంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. ప్రధానిని, కేంద్ర మంత్రిని పట్టుకొని అన్నేసి ఆరోపణలు చేసినా.. ఏ ఒక్క బీజేపీ నేత రేవంత్ వ్యాఖ్యలను ఖండించకపోవడం విచిత్రం.
మోదీ దాకా ఎందుకు.. బండి సంజయ్‌ను పట్టుకొని జీహెచ్ఎమ్‌సీ హామీలు ఏమయ్యాయంటూ దుమ్ము దులిపేశారు. ఎంపీ అర్వింద్‌ను సైతం వరద నీటితో కడిగిపడేశారు. బండి.. గుండు.. అంటూ ఆ ఇద్దరినీ ఓ రేంజ్‌లో వేసుకున్నా.. కిమ్మనకుండా పడుంటున్నారే కానీ.. నోరు తెరిచి రేవంత్‌ను ఒక్కమాట కూడా తిరిగి అనకపోవడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేతలు పగటి వేషగాళ్లు అన్నా.. పౌరుషానికి పోవట్లేదు. ఎందుకు? రేవంత్‌రెడ్డికి బీజేపీ నేతలు భయపడుతున్నారా? ఆయన నోరు చూసి మనకెందుకులేనని బెదిరిపోతున్నారా?
బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. పే..ద్ద నోరున్న నేత. కేసీఆర్‌పై ఎప్పుడూ ఒంటికాలిపై లేస్తుంటారు. రేవంత్ విషయానికి వచ్చేసరికి మాత్రం.. బండి నోరు బోరుకొచ్చినట్టు మాట పెదాలు కదలడమే లేదంటున్నారు. తనను, తమ పార్టీని, ప్రధానిని.. రేవంత్ నోటికొచ్చినట్టు విమర్శిస్తుంటే.. కమలనాథుల నుంచి కనీస ప్రతిఘటన రాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. కిషన్‌రెడ్డికి ఫ్లైట్ ఏర్పాటు చేసింది కేసీఆరే అంటే.. కౌంటర్ రాలేదంటే.. రేవంత్ ఆరోపణ నిజమేనా? ఈటలను బీజేపీలోకి కేసీఆరే పంపించారా? మౌనం అర్థ అంగీకారమేనా? అనే అనుమానాలు వస్తున్నాయి. బండి సంజయ్, ఎంపీ అరవింద్‌లు ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఫుల్ ఫేమస్. అలాంటి నోరున్న నేతలనే.. బండి.. గుండు.. అంటూ రేవంత్‌రెడ్డి వారిని పర్సనల్‌గా టార్గెట్ చేసి విమర్శలు చేసినా.. బీజేపీ నాయకుల నుంచి మౌనమే సమాధానంగా వస్తుండటం నాటకీయ పరిణామంగా కనిపిస్తోంది.
రేవంత్‌రెడ్డి నిన్నకాక మొన్న పీసీసీ చీఫ్ అయ్యారు. కొత్త మురిపం ఇంకా పోలేదు. అందుకే ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రేవంత్‌రెడ్డి టాపికే నడుస్తోంది. ఆయన హవా అలా ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్.. కేసీఆర్‌తో పాటు బీజేపీనీ టార్గెట్ చేయడం కామన్. ఫోకస్ అంతా రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలపైనే ఉంది. ఇలాంటి టైమ్‌లో.. ఆవేశపడి రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇస్తే.. ప్రజల దృష్టి, విమర్శల డోసు.. కేసీఆర్ నుంచి తమవైపు షిఫ్ట్ అవుతుందనేది బీజేపీ భావనలా ఉంది. అందుకే, రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎంతగా తిడతారో అంతగా తిట్టనిచ్చి.. రేవంత్ ఫోకస్ అంతా ముఖ్యమంత్రిపై మళ్లేలా చేసి.. రేవంత్ విమర్శలతో కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ కానిచ్చి.. వాళ్లిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లో మధ్యలో కమలనాథులు కలగజేసుకోకుండా కొంతకాలం సైలెంట్‌గా ఉంటేనే బెటర్ అనే భావనతో బీజేపీ నాయకులు రేవంత్‌రెడ్డి విమర్శలపై స్పందించడం లేదనే వాదన వినిపిస్తోంది. లేదంటే, బండి సంజయ్ నోటికేమైనా హద్దా? ఆయన సైతం రేవంత్‌రెడ్డిలా ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పగల నేతే? ఇదంతా వ్యూహాత్మక మౌనం అని.. సరైన సమయంలో మౌనవ్రతం వీడి అసలైన ట్రయాంగిల్ వార్‌కు తెరలేపుతారని అంటున్నారు. అందాకా.. రేవంత్‌రెడ్డికి వార్ వన్ సైడే...