వైఎస్ షర్మిలకు అమరావతి సెగ..
posted on Jun 30, 2021 @ 1:02PM
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు సీమాంధ్ర నేతల నుంచి సెగ తగిలింది.అమరావతి పరిరక్షణ సమితి కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించారు. అమరావతి పరిరక్షణ సమితి ఛైర్మెన్ కొలికపుడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలో లోటస్ పాండ్ కు పిలుపునిచ్చారు. వారి సభ్యులు లోటస్ పాండ్ లోని షర్మిల ఆఫీసును ముట్టడించారు. సీమాంధ్రకు వ్యతిరేకంగా, సీమ రైతుల నోట్లో మట్టి కొట్టేలా ప్రకటనలు చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిల.. ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల తెలంగాణకు అనుకూలంగా, సీమాంధ్రకు వ్యతిరేకంగా కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. చుక్క నీరు కూడా వదులుకోం అంటూ గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే దీనిపై ఎవరితోనైనా పోరాటానికి సిద్ధమేనని కామెంట్ చేశారు. షర్మిల వ్యాఖ్యలపై సీమాంధ్ర జనాలు పైరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొలికపుడి శ్రీనివాస్ టీమ్ షర్మిల ఇంటి ముట్టడికి ప్రయత్నించింది.
ఈ సమయంలో షర్మిల పార్టీ అనుచరులకు, అమరావతి పరిరక్షణ సమితి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు లోటస్ పాండ్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.బంజారాహిల్స్ పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కొలికపూడి శ్రీనివాస్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులను అక్కడినుంచి వెల్లగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.