బ్రోకర్ జీవన్ రెడ్డి.. పార్క్ హయత్ లో ఏమి నీ దందా?
posted on Jun 30, 2021 @ 8:25PM
తెలంగాణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు టార్గెట్ గా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పంచ్ డైలాగులతో విరుచుకుపడుతుండగా... ఆయన బాటలోనే హస్తం నేతలు వాయిస్ పెంచారు. కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటరిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిందని అన్నారు. దీంతో జీవన్ రెడ్డి కౌంటరిస్తూ కాంగ్రెస్ నేతలు సంచలన కామెంట్లు చేశారు.
ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని బ్రోకర్ జీవన్ రెడ్డి అంటేనే ఎవరైనా గుర్తుపడతారని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి విమర్శించారు. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జీవన్ రెడ్డికి ఉన్న విలాసవంతమైన సూట్ లో జరుగుతున్న వ్యవహారాలు అందరికీ తెలుసునని అన్నారు. సినిమా రంగముతో ఉన్న సంబంధాలు, వాటిని రాజకీయ అవసరాల కోసం వాడుతున్న సంగతి గురించి మీ టీఆరెస్ నాయకులు ఎవరిని అడిగినా చెప్తారని అయోధ్య రెడ్డి చెప్పారు. దుబాయ్ లో దొంగ వ్యాపారం, బ్యాంకులకు రుణాలు ఎగవేత ఇలా ఎన్ని చెప్పినా జీవన్ రెడ్డి గురించి ఇంకా తక్కువేనని విమర్శించారు. ఆర్మూరులో జీవన్ రెడ్డి అవినీతి అక్రమాలపై పోరాడుతున్న తలారి సత్యం ఎలా దారుణంగా హతం అయ్యాడో ముందుగా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత జీవన్ రెడ్డి మీద ఉందన్నారు కాంగ్రెస్ లీడర్.
ఆర్మూరులో పసుపు రైతులకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నా పట్టించుకోకుండా పార్క్ హయత్ హోటల్ లో నువ్వు జల్సాలు చేసుకుంటున్న సమయంలోనే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకునిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సభ పెట్టారని అయోధ్య రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కొట్లాడేదాకా సోయి లేని జీవన్ రెడ్డి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా అని ప్రశ్నించారు.తన మీద ఉన్న ఆరోపణలు, బ్రోకర్ పనుల మీద అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీవీ స్టూడియో నుంచి పారిపోయిన జీవన్ రెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవన్ రెడ్డి మాటలు చూసి టీఆర్ఎస్ నేతలే నవ్వుతున్నారని అయోధ్య రెడ్డి ఎద్దేవా చేశారు.