తెలంగాణ జాతిరత్నాలు.. చంద్రబాబు చెక్కిన శిల్పాలు..
posted on Jun 30, 2021 @ 1:17PM
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు. ఆయన ప్రధాన ప్రత్యర్థి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. ఒకనాడు టీడీపీలో మామూలు నాయకులు. సైకిల్ దిగే సమయానికి జాతిరత్నాలు. టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలోనే వాళ్లు రాజకీయంగా రాటుదేలారు. తెలుగు జాతికి సమర్థులైన నాయకులను అందించిన పొలిటికల్ ఫ్యాక్టరీ టీడీపీ అయితే.. వారందరికీ రింగ్‌మాస్టర్ చంద్రబాబు నాయుడు. కొరడా పట్టుకొని.. తప్పటడుగులు వేయకుండా ట్రైనింగ్ ఇచ్చారు. క్రమశిక్షణతో పని చేయడం చంద్రబాబే నేర్పించారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేయడం చంద్రబాబు నుంచే నేర్చుకున్నారు.
ఎన్టీఆర్‌తో చెప్పి.. ఎమ్మెల్యేగా పలుమార్లు అవకాశం ఇచ్చి.. కేసీఆర్‌ను బలమైన నాయకుడిని చేసింది చంద్రబాబే. రాజకీయ సమీకరణాల్లో మంత్రి పదవి సాధ్యం కాకపోతే కేసీఆర్‌ను డిప్యూటీ స్పీకర్‌ను చేసింది చంద్రబాబే. అసంతృప్తితో పార్టీని వీడి.. టీఆర్ఎస్‌ను స్థాపించి.. ముఖ్యమంత్రిగా పాలిస్తున్నా.. ఆయన రాజకీయ బీజం టీడీపీలోనే. ఆయన నాయకత్వ దక్షత చంద్రబాబు నుంచి వచ్చిందే. రాజకీయ ప్రత్యర్థిగా కేసీఆర్ ఆ విషయం ఒప్పుకోకపోవచ్చు కానీ.. ఆయన అంతరాత్మకు తెలుసు చంద్రబాబు వల్లే తాను రాటుదేలానని...
ఇక సీఎం కేసీఆర్‌కు సరిసమాన సత్తా గత రేవంత్‌రెడ్డిని ఆ స్థాయి లీడర్‌గా తీర్చిదిద్దడంలో కర్త, కర్మ, క్రియ.. అంతా చంద్రబాబే. రేవంత్‌రెడ్డి నాయకత్వ లక్షణాలను గుర్తించింది చంద్రబాబే. ఎమ్మెల్యేగా అవకాశమిచ్చి ఆయనలోని నాయకుడిని సానబెట్టిందీ చంద్రబాబే. టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఆయన్ని ప్రమోట్ చేసిందీ చంద్రబాబే. అందుకే, కేసీఆర్‌పై పోరాడేందుకు.. టీడీపీని వీడలేక వీడిపోయారు రేవంత్‌రెడ్డి. ఆయనకు రాజకీయ రోల్‌మోడల్ చంద్రబాబేనంటారు సన్నిహితులు.
కేసీఆర్, రేవంత్ అనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తున్న చాలామంది చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసి రాటుదేలిన వారే. కేసీఆర్ కేబినెట్‌లో పదవులు అనుభవిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్.. వీళ్లంతా ఒకప్పుడు చంద్రబాబుకు ప్రధాన అనుచరులు. ఎర్రబెల్లి రాజకీయ జీవితమంతా చంద్రబాబు నీడలోనే సాగింది. ఒకదశలో పార్టీలో నెంబర్ టూ పొజిషన్ ఎర్రబెల్లిదే. ఎక్కడో వరంగల్ జిల్లాలో రేషన్ షాపు డీలర్‌గా ఉండే ఎర్రబెల్లిని.. చంద్రబాబు పక్కసీట్లో కూర్చొనే స్థాయి నాయకుడిగా తయారు చేసింది ఆయన కాదా? ఇప్పుడు మంత్రి పదవి అనుభవిస్తున్నారంటే.. ఎర్రబెల్లి ఆ స్థాయి లీడర్‌గా ఎదిగింది చంద్రబాబు చలవతోనే కదా అని గుర్తు చేస్తున్నారు.
ఒక్క ఎర్రబెల్లినే కాదు.. తలసానిని హైదరాబాద్‌లో కీలక నేతగా చేసింది.. ఆయనకు అప్పట్లోనే మంత్రి పదవి కట్టబెట్టి ప్రమోట్ చేసింది.. చంద్రబాబే అనేది అందరికీ తెలిసిన విషయమే. గంగుల కమలాకర్ కరీంనగర్ టీడీపీలో కీలక నాయకుడిగా తీర్చిదిద్దింది కూడా చంద్రబాబే. మరోమంత్రి సత్యవతి రాథోడ్ సైతం చంద్రబాబు శిబిరం నుంచి వచ్చిన నాయకురాలే. మంత్రులే కాదు.. టీఆర్ఎస్‌లో సగం మంది కీలక నేతలు చంద్రబాబు కార్ఖానా నుంచి తయారైన వారే. ఎంపీ నామా నాగేశ్వరరావు నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి వరకూ అంతా చంద్రబాబు చెక్కిన శిల్పాలే. ఇక, చంద్రబాబు శిష్యరికంలో సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగిన ఎల్.రమణనూ టీఆర్ఎస్ తమవైపు లాక్కోవాలని చూస్తోంది. నాయకులను తయారు చేసే సత్తాలేని కేసీఆర్.. చంద్రబాబు తూనీరంలోని తురుపుముక్కలను తనవైపునకు తిప్పుకొని రాజకీయ పబ్బం గుడుపుకుంటున్నారనేది విమర్శకుల మాట.
ఇక, కాంగ్రెస్, టీఆర్ఎస్ అనే కాదు పలువురు బీజేపీ నేతలు సైతం చంద్రబాబు డైరెక్షన్లో పని చేసిన ఒకప్పటి ఎన్టీఆర్ భవన్ నాయకులే. హుజురాబాద్‌లో బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న పెద్దిరెడ్డితో పాటు మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి, మోత్కుపల్ల నర్సింహులు లాంటి వాళ్లు ఒకప్పుడు చంద్రబాబు ప్రధాన అనుచరులే. ఇలా, తెలంగాణ రాజకీయ నాయకుల్లో అనేక మంది చంద్రబాబు శిబిరం నేతలే. ఆయన చెక్కిన శిల్పాలే. టీడీపీ ఉగ్గుపాలు తాగి, చంద్రబాబు నుంచి ఓనమాలు నేర్కిన వారే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తున్నారు. అన్నిపార్టీలు ఆ తానుముక్కలే. ఎనీ డౌట్స్?