కొడంగల్ కు బైబై.. రేవంత్ రెడ్డి పోటీ చేయబోయేది ఇక్కడే?
posted on Jun 30, 2021 @ 2:14PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా ఎంపికైన ఎంపీ రేవంత్ రెడ్డి.. తనదైన మార్క్ చూపిస్తున్నారు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ లీడర్ గా పిలుచుకునే రేవంత్ రెడ్డి.. పీసీసీ పగ్గాలు వచ్చాక కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. సంచలన ఆరోపణలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ కాక రేపుతున్నారు. పీసీసీ చీఫ్ గా ఏఐసీసీ నుంచి ప్రకటన వచ్చిన కాసేపటికే ఈటల బీజేపీలో చేరికపై సంచలన ఆరోపణలు చేసి బంబా పేల్చారు రేవంత్ రెడ్డి. తర్వాత రోజు కేటీఆర్, కేసీఆర్ ను టార్గెట్ చేశారు. మంగళవారం గులాబీ లీడర్లతో పాటు కమలం నేతలను కడిగిపారేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రకటించడంతో జోష్ మీదున్న కాంగ్రెస్ కేడర్.. ఆయన స్పీడ్ చూసి మరింత ఉత్సాహంగా కదులుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి... రాజకీయంగా ఎదిగింది మాత్రం కొడంగల్. రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే అందరికి వినిపించేది కూడా కొడంగలే. అక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన కొడంగల్ నుంచి అనూహ్యంగా ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలో మల్కాజ్ గిరి బరిలో నిలిచి విజయం సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది. తనకు గుర్తింపు తెచ్చిన కొడంగల్ నుంచే పోటీ చేస్తారా లేక మరో స్థానానికి మారుతారా అన్న చర్చ జరుగుతోంది.
గత రెండేండ్లుగా రేవంత్ రెడ్డి రాజకీయ కదలికలు, ఆయన ముఖ్య అనచురుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఈసారి.. కొడంగల్ కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని సమాచారం. మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ అసెంబ్లీకి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ పై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. బీజేపీకి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా... రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. రేవంత్ వల్లే విజయం దక్కిందని చెబుతున్నారు. లింగోజిగూజ కార్పొరేటర్ ప్రమాణస్వీకరానికి జీహెచ్ ఎంసీ కార్యాలయానికి కూడా వెళ్లారు.గత లోక్ సభ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి ఎల్బీనగర్ లో భారీ మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచే ఎల్బీ నగర్ అసెంబ్లీపై ఆయన ఫోకస్ చేశారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువ ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. చాలాసార్లు సుదీర్ రెడ్డి పేరు చెబుతూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి... ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేగా ఉన్న సుదీర్ రెడ్డిని టార్గెట్ చేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎంచుకోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. వందలాది కాలనీలకు రెడ్లే అధ్యక్షులు, చైర్మన్లుగా ఉన్నారు. ఎంపీగా రేవంత్ గెలవాడనికి వీళ్లంతా సాయం చేశారు. రేవంత్ ను అసెంబ్లీకి పోటీ చేయాలని వీళ్లంతా కోరుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎల్బీ నగర్ పరిధిలో ఎక్కువగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల జనాలతో పాటు సెటిలర్లు భారీగానే ఉన్నారు. నల్గొండ, పాలమూరు ప్రజల మద్దతు రేవంత్ రెడ్డికి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సెటిలర్లు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు. ఇవన్ని కలిసివచ్చే అవకాశాలు ఉండటం వల్లే ఎల్బీనగర్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఎల్బీనగర్ లో రేవంత్ పోటీ చేస్తే.. ఆయనకు కనీస పోటీ ఉండకపోవచ్చనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది..