చంద్రబాబు వల్లే రేవంత్ కు పీసీసీ పదవి? క్లారిటీ ఇచ్చిన సీతక్క..
posted on Jun 30, 2021 @ 12:45PM
తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎంపీ రేవంత్ రెడ్డికి రావడంతో.. ఆ పార్టీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు పార్టీ సీనియర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. పీసీసీ పోస్టును అమ్ముకున్నారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీపీసీసీని టీటీడీపీగా మార్చేశారని, రేవంత్ ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర ఉందని కామెంట్ చేశారు కోమటిరెడ్డి. తమను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు కూడా తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నారు. చంద్రబాబు రాహుల్ తో మాట్లాడటం వల్లే టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చారని చెబుతున్నారు.
చంద్రబాబు వల్లే రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్టు వచ్చిందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై .. ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎవరో చెబితే రాలేదన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకే అధిష్టానం రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చారని సీతక్క స్పష్టం చేశారు .ఒక్క రోజులో సీల్డ్ కవర్ రాలేదని.. చాలా రోజులు చర్చలు, అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే అధిష్టానం రేవంత్ అన్న పేరు ఖరారు చేసిందని ఎమ్మెల్యే సీతక్క తేల్చి చెప్పారు.
అధికారాన్ని అనుభవించడానికి తాము కాంగ్రెస్‌లోకి రాలేదని సీతక్క అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే కాంగ్రెస్‌లోకి చేరినట్లు ఆమె స్పష్టం చేశారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడవద్దంటూ పరోక్షంగా కోమటిరెడ్డికి సీతక్క హితవుపలికారు. రేవంత్ టీమ్‌లో పదవి రానందుకు తనకు కూడా అసంతృప్తి ఉందన్నారు. రేవంత్ కు పదవి వచ్చిందన్న సంతోషం కంటే తమకు బాధ్యత పెరిగిందన్నారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీని సక్రమంగా నడిపించే బాధ్యత రేవంత్ అన్నపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు నిజమైన సంతోషమని సీతక్క అన్నారు.