పంజాబ్ లో మళ్ళీ హస్తానిదే హవా ...
posted on Jun 30, 2021 @ 2:14PM
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయముంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటుగా పంజాబ్ శాసన సభకు వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో రాజకీయం మాత్రం ఇప్పటికే వేడెక్కింది. ఓ వంక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ షరా మాములుగా అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, మాజీ మంత్రి, క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్దుల మధ్య పచ్చగడ్డి వేయకుండానే మంటలు మండుతున్నాయి. అయినా, జనం మాత్రం కాంగ్రెస్ పార్టీకే జై కొడుతున్నారు. నిజానికి, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. మొత్తం ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఆరు మున్సిపాలిటీలలో హస్తం పార్టీ విజయకేతనం ఎగరేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన కాంగ్రెస్ పంట పండిచ్చింది. సో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంటుందని, రాజకీయ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి, అయితే అమరేందర్, సిద్దుల మధ్య సాగుతునన్న రచ్చ పార్టీ విజయావకాశాలను కొంత మేర దెబ్బ తీస్తుందన్న అనుమానాల మాత్రం పార్టీ వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి.
ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే, ఎంతో కాలంగా కలిసి కాపురం చేసిన బీజేపీ, అకాళీదళ్ పార్టీల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. సుదీర్గ కాలంగా బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీ దళ్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, కూటమికి గుడ్ బై చెప్పింది. ఆ పార్టీకి చెందిన మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. మరో వంక వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగతున్న ఆందోళన ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని వేరే చెప్పనక్కర లేదు. ఈ ప్రభావంతోనే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కమల దళం ఖాతా తెరవలేదు. నిజానికి అకాలీ దళ్, బీజేపీ కలిసి పోటీచేసిన 2017 ఎన్నికలలోనే, ఎన్డీఎ కూటమి ఘోరంగా. పదేళ్ళు పాలించిన కూటమి 15 స్థానాలకు పరిమితం అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)20 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది.ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏకంగా 77 స్థానాలను కైవసం చేసుకుంది.
ఈనేపధ్యంలో, ముఖ్యంగా బీజేపీ,ఆకాలి దళ్’ అడ్రెస్స్ గల్లంతైన నేపధ్యంలో, ఆప్’ పంజాబ్ పై కన్నేసింది. నిజానికి మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, అకాలీ దళ్’తో పాటుగా ఆప్ కూడా తుడిచిపెట్టుకు పోయింది.అయితే,గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారం, పంజాబ్ ‘పై ఆప్ ఆశలు పెంచుకుంటోంది. ఈ నేపధ్యంలోనే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ పై వాగ్దానాల వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా, విద్యుత్ విషయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు దృష్టిలో ఉంచుకుని , రేపటి ఎన్నికలకు కేజ్రివాల్ విద్యుత్’ నే ప్రధాన అజెండా చేసుకున్నారు.పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.అంతేకాదు, పెండింగ్ బిల్లుల రద్దు సహా విద్యుత్తు కనెక్షన్ పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా పంజాబ్‌లోని 77 నుంచి 80 శాతం ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
24 గంటల నిరంతరాయం కరెంట్‌ను మూడేళ్లలో నెరవేరుస్తామని హామీ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.అయితే, గత ఎన్నికలలోనూ ఆప్, ఉచిత వాగ్దానాలు గట్టిగానే చేసింది. 25 లక్షలు ఉద్యోగాలు, రూ.5 లకే భోజనం, ఉచిత వైఫై, పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలు, వృద్ధాప్యపు పింఛన్లు, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతామని హామీలిచ్చింది. అయినా ఓటర్లు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఆప్ కేవలం 20 సీట్లకు పరిమితమయ్యింది.మరి ఈసారి ఏమవుతుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితే కొనసాగితే, 2022 ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ , ఆప్ మదనే ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.