ఛీర్స్.. బీరు ధర తగ్గిందోచ్.. ఎందుకో తెలుసా?
posted on Jul 5, 2021 @ 7:53PM
పెరుగుడే కానీ తగ్గుడు తెలీదు.. యడాపెడా పన్నులు బాదేయడమే కానీ.. తగ్గించిన పాపాన పోరు. మందుబాబుల నుంచి పన్నుల రూపంలో పైసలు పిండేసుకుంటారు పాలకులు. నోరు తెరిచి అడగరని అలుసో.. ఉద్యమాలు గట్రా చేయరనే ధీమానో.. కారణం ఏదైనా.. సర్కారు ఖజానా ఖాళీ అయిన ప్రతీసారి ప్రభుత్వాలకు గుర్తొచ్చేది మద్యం మీద బాదుడే. అందుకే, ఏటేటా లిక్కర్ రేట్లు అమాంతం పెరుగుతుంటాయి. అది కూడా పెట్రోల్ రేట్లు పెంచినట్టు.. కొద్ది కొద్దిగా పైసలల్ల కాకుండా.. ఏక మొత్తంగా పదులు, వందలల్లనే మద్యం ధరలు పెంచేస్తుంటారు. ఇన్నేళ్లుగా ఇదే తంతు. కానీ, అదేందోగానీ.. సడెన్‌గా తెలంగాణ సర్కారు మద్యం రేట్లు తగ్గించేసింది. ఇక పండగ చేస్తోండి అంటూ 10 రూపాయలు కోత పెట్టింది.
ఈ తగ్గింపు బ్రాంది, విస్కీ, వైన్స్ మీద మాత్రం కాదు. కేవలం బీరు ధర మాత్రమే తగ్గించింది కేసీఆర్ సర్కారు. ఒక్కో బీరు బాటిల్ మీద 10 రూపాయల పన్ను తగ్గిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ బీర్ మీద విధిస్తున్న స్పెషల్ సెస్ 40 రూపాయలు ఉండగా.. దాన్ని 30 రూపాయలకు తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అర్థరాత్రి నుంచే తగ్గిన రేట్లకు బీర్ అందుబాటులోకి వస్తుంది. మహాప్రభు.. సీఎం కేసీఆర్.. బీర్‌లానే చల్లగుండాలె.. అంటూ మందుబాబులు దీవిస్తున్నారు.
ఇంతకీ, కేసీఆర్ సర్కారు ఉన్నట్టుండి బీరు మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అనే అనుమానం అందరికీ రాకమానదు. ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించే మందుబాబులంటే కేసీఆర్‌కు ఎంత ఇష్టమైనా కూడా.. మరీ మా మీద సడెన్‌గా అంత లవ్ దేనికోననే డౌట్‌తో ఇంకో బీరు ఎక్కువే తాగుతున్నారు. కారణం ఇదీ అని సర్కారు స్పష్టం చేయకపోయినా.. అబ్కారీ అధికారుల సమాచారం మేరకు అదే కారణమని తెలుస్తోంది.
ప్రస్తుత కొవిడ్ కాలంలో గొంతులో ఏపాటి గరగర అనిపించినా.. కరోనా కావొచ్చని జనాలు హడలిపోతున్నారు. చిల్ల్ బీర్ తాగితే.. గొంతు పట్టేస్తే.. కొంపదీసి కరోనా ఏందీ అని బెదిరిపోతున్నారట. అందుకే, ఎందుకైనా మంచిదని మందుబాబులు బీర్ తాగడం మానేశారట. దీంతో.. గత కొన్ని నెలలుగా తెలంగాణలో బీర్ అమ్మకాలు భారీగా పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. సమ్మరే బీర్ సేల్స్‌కు అసలైన సీజన్. అలాంటిది వేసవిలోనే సేల్స్ లేకపోవడంతో ఖజానాకు పెద్ద బొక్కే పడింది. ఇక, ఎండాకాలం అయిపోవడంతో.. బీర్‌కు డిమాండ్ మరింత పడిపోయింది. వానాకాలంలో బీర్ తాగే వారి సంఖ్య మామూలుగా తగ్గిపోతుంది. ఇటు కరోనా ఎఫెక్ట్.. అటు వానల ఎఫెక్ట్‌తో.. బీర్ అమ్మకాలు బోరుమంటున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయమూ తగ్గింది. అందుకే, ఎలాగైనా జనాలను బీర్ తాగేందుకు ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశ్యంతోనే.. ఒక్కో బీర్ మీద 10 రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. ఆ విధంగానైనా రేట్ తగ్గి.. సేల్స్ పెరిగి.. ఆదాయం వచ్చిపడుతుందనే దురాశ ప్రభుత్వానిది అంటున్నారు. కారణం ఏదైనా.. చాన్నాళ్ల తర్వాత మందు ధర తగ్గించిన మహాప్రభు మా కేసీఆర్ అంటూ మందుబాబులు ఫస్ట్ సిప్‌కు ముందు ఇంకో చుక్క ఎక్స్‌ట్రా పడేస్తున్నారు. దండాలయ్యా సామీ... మందుబాబుల పాలిట దేవుడివయ్యా నువ్వు...