సూపర్ లీడర్ రేవంత్.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు.. ఇక అందరివాడు..
posted on Jul 5, 2021 @ 10:53PM
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన నాయకుడు. రాజకీయాల్లో ఈ ఫార్ములా పర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఇప్పుడదే చేస్తున్నారు. నెగ్గుకొచ్చే దగ్గర నెగ్గుతూ.. తగ్గాల్సిన చోట తగ్గుతూ.. అసలైన నాయకుడిగా నిరూపించుకుంటున్నారు.
కేసీఆర్‌పై నెగ్గడమే రేవంత్ టార్గెట్. అందుకే ఆయన టీడీపీని వీడి.. కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో కమిటెడ్‌గా పని చేసి అనతికాలంలోనే పీసీసీ చీఫ్‌గా ఎదిగారు. తాను ముఖ్యమంత్రి అవుదామనే కోరిక కంటే కూడా.. కేసీఆర్‌ను బయటకు గుంజాలనే పట్టుదలే ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కేసీఆర్‌పై ఎలాగైనా నెగ్గితీరాలని కసితో కొట్లాడుతున్నారు రేవంత్‌రెడ్డి.
ఆయన లక్ష్యం, గమ్యం ఒక్కటే.. అది గులాబీ బాస్‌ను దెబ్బకొట్టడమే. అంతే తప్ప ఇక తనకు మిగతా ఎవరితోనూ విభేదాలు లేవు, ఉండవు అంటారు రేవంత్. అందుకే, కాంగ్రెస్‌లో అందరినీ కలుపుకు పోతానని.. తాను అందరివాడినంటూ పీసీసీ చీఫ్ కాగానే ప్రకటించేశారు. కోమటిరెడ్డి కూడా తమ కుటుంబమేనంటూ.. పార్టీలో తనకెవరూ శత్రువులు లేరంటూ తేల్చి చెప్పేశారు. జస్ట్ చెప్పడమే కాదు.. మాటలతో పాటు చేతలతోనూ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే.. ఎక్కడ తగ్గాలో తెలిసిన అసలైన లీడర్ రేవంత్‌రెడ్డి కాబట్టి.
తనను పీసీసీ చీఫ్‌గా అధిష్టానం ప్రకటించాక.. ఆయన కలిసిన వారి లిస్ట్ చూస్తే అర్థమైపోతుంది రేవంత్‌రెడ్డి ఎంతలా తగ్గారో. తనను కలిసే వారితో పాటు.. తాను కలిసే వారి సంఖ్యా భారీగానే ఉంటోంది. వారం రోజుల నుంచి రేవంత్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ కార్యకర్తలతో, అభిమానులతో కోలాహలంగా ఉంటోంది. ఆ ఇంటితో పాటు ఆ వీధి వీధంతా ఒకటే జాతర. జై రేవంతన్న నినాదాలతో జూబ్లీహిల్స్ హోరెత్తుతోంది. అభిమానులు, అభినందనల తాకిడి తట్టుకోలేక.. వారంలో రెండు రోజులు అదికూడా సాయంత్రం 4 తర్వాతే అందుబాటులో ఉంటానంటూ ఇప్పటికే ప్రకటించారు రేవంత్‌రెడ్డి. అయినా.. ఆ అభిమాన వరద ఆగితేగా.. జన జాతర తగ్గితేగా.
ఇక, కాంగ్రెస్ సీనియర్లతో పాటు వివిధ వర్గాల ప్రముఖులను కలుసుకుంటూ.. తనకు మద్దతుగా ఉండాలంటూ.. తాను అందరి వాడినంటూ.. అసలైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తున్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ కురవృద్ధుడు, తన పదవికి మొదటి నుంచీ అడ్డుపడిన వీహెచ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి మరీ కలిశారంటే రేవంత్ ఎంత మారిపోయారో అర్థం చేసుకోవచ్చు. పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, రోశయ్య.. ఇలా వెటరన్ లీడర్స్ అందరి ఆశీస్సులూ తీసుకుంటున్నారు పీసీసీ చీఫ్.
ఇక అసలైన తగ్గడమంటే ఏంటో తన చేతలతో నిరూపిస్తున్నారు రేవంత్‌రెడ్డి. తన స్థాయి కాకున్నా.. తన కింద పని చేయాల్సిన వారే అయినా.. అందరినీ కలుపుకు పోవాలనే సంకల్పంతో.. కొండా సురేఖ, పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్‌రెడ్డి లాంటి వారి ఇంటికి వెళ్లి మరీ కలిసి పనిచేద్దామని పిలుపు ఇస్తున్నారంటే నాయకుడంటే ఇలా ఉండాలి అనిపించక మానదు. పీజేఆర్ తనయుడిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయింది.. పక్కన పెట్టేసింది.. కానీ, రేవంత్ గుర్తు పెట్టుకున్నారు.. తనకన్నా చిన్నవాడు అయినా.. ఆయన తండ్రి మీద ఉన్న గౌరవంతో ఇంటికెళ్లి మరీ ముచ్చటించి కాంగ్రెస్‌కు సరికొత్త తనదైన రాజకీయం నేర్పుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
కాంగ్రెస్‌లో ఎవరితో కలవకుండా తమ ఇలాఖాలోనే పాలిటిక్స్ చేసుకొనే కొండా సురేఖ కుటుంబాన్ని సైతం కాంగ్రెస్‌లో కలిసిపోయేలా చేయడానికి రేవంత్ చేస్తున్న కృషి అభినందనీయం అంటున్నారు. ఎవరి మానాన వారే రాజకీయాలు చేసుకుంటూ పోవడమే ఇన్నేళ్లూ కాంగ్రెస్‌కు తెలిసిన పని. రేవంత్‌రెడ్డి రాకతో ఆ పాత అలవాట్లన్నీ మారిపోతున్నాయి. కాంగ్రెస్ కొంగొత్త పోకడ పోతోంది.
తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రంలోనూ తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. దక్షిణాదిలోనే అత్యంత బలమైన, సంపన్నమైన కాంగ్రెస్ నాయకుడైన కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఆయన ఇంటికెళ్లి మరీ కలిశారు రేవంత్‌రెడ్డి. జులై 7న తన పదవీ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. డీకేలానే రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లతో తలపడి మరీ.. పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు.
ఇక, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గేను సైతం కలిసి.. హైదరాబాద్‌లో తన ప్రోగ్రామ్‌కి ఆహ్వానించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. రేవంత్‌రెడ్డికి తెలంగాణలో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. బెంగళూరులోనూ అంతే ఉంది. ఆ విషయం రేవంత్ బెంగళూరుకు వెళ్లాకే ఆయనకు సైతం తెలిసినట్టుంది. రేవంత్‌రెడ్డి బెంగళూర్ టూర్ ఆసాంతం ఒక్కటే అభిమాన కోలాహలం. రేవంత్ బెంగళూరు వచ్చిన విషయం తెలిసి.. అక్కడ ఉండే అనేకమంది తెలుగువారు ఆయన్ను కలిసేందుకు తరలిరావడం.. తెలుగువారిలో రేవంత్‌రెడ్డి సూపర్ హీరోగా ఎదిగారరడానికి నిదర్శణం. అందుకే అంటున్నారంతా.. ఎక్కడ తగ్గాలో తెలిసిన అసలైన నాయకుడు రేవంత్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌గా ఇప్పుడిక అందరివాడు.. కేసీఆర్‌ను ప్రగతిభవన్ నుంచి బయటకు గుంజే మొనగాడు...!