శ్రీశైలంలో దూకుతా.. అందుకు ఎమ్మెల్యే రోజానే సాక్షి.. గేరు మార్చిన బండి..
posted on Jul 6, 2021 @ 3:25PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ శ్రీశైలం ప్రాజెక్టులో దూకుతానన్నారు. సీఎం కేసీఆర్‌పై తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే అన్నంత పని చేస్తానంటూ సవాల్ చేశారు. ఒకవేళ నిజమైతే.. ముక్కును నేలకు రాసి.. పొర్లు దండాలు పెట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాక రేపారు బండి సంజయ్.
తెలుగు రాష్ట్రాల జల వివాదంలో బీజేపీ దూకుడు పెంచింది. రేవంత్‌రెడ్డి ఎఫెక్టో ఏమో కానీ.. బండి సంజయ్ గేరు మార్చి.. స్పీడ్ పెంచారు. బాగా వర్కవుట్ చేసి వచ్చి మరీ, మీడియా ముందు కృష్ణా లెక్కల చిక్కుముడులు ముందేశారు. అంతా కేసీఆరే చేస్తున్నారని తేల్చి పారేశారు. కృష్ణా జలాల వివాదంలో కేసీఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శలు గుప్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలను ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి తాకట్టు పెట్టారంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా వైసీపీ ఎమ్మెల్యే రోజానూ ఇన్వాల్వ్ చేయడంతో బండి వ్యాఖ్యలు మరింత రక్తి కట్టాయి.
"2015లో జూన్ 18, 19 తేదీలలో మొదటిసారి జరిగిన సమావేశంలో నీటి పంపకాలపై తెలంగాణ సలహాదారు విద్యాసాగర్, హరీశ్ రావు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబులు మాట్లాడుకున్నారు. 299 టిఎంసీల నీళ్లు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా? 811 టీఎంసీలలో 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలని 12.5.2020న రజత్ కుమార్ లేఖ రాశారు. అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదట ఒప్పుకుందే కేసీఆర్. రోజా ఇంటికి వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది." అంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్.
"ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులు మోహరించేలా చేసి డ్రామాలు ఆడుతున్నారు. హుజురాబాద్ ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామా నడుస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగే చోట అవసరమైతే రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుంటారు. కొత్త డ్రామాలకు తెరలేపి.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలోనే ఒప్పందం జరిగింది’’ అంటూ విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షులు.
ఇక, ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి తనకు ఫోన్ చేశారంటూ సీఎం కేసీఆర్ అబద్దలు ప్రచారం చేస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. అసలు ఆనాడు ఏం జరిగిందో వివరించారు. ‘‘సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి ఫోన్ చేస్తే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండి ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మిస్డ్ కాల్ చూసిన కేంద్రమంత్రి కాల్ బ్యాక్ చేశారు. దీనికి కేంద్రమంత్రే తనకు ఫోన్ చేశాడంటూ ప్రచారం చేసుకున్నారు. నోరు తెరిస్తే అబద్దాలు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేశారు. అన్యాయం చేసినోడు తెలంగాణలో బతకొద్దు. పాపం చేసినోడు వాడి పాపం వట్టిగా పోదు. నా ఆరోపణలు అబద్దమైతే శ్రీశైలం ప్రాజెక్టులో దూకి చనిపోతా. ఇదే నా సవాల్. ఒక వేళ నిజమైతే.. ముక్కును నేలకు రాసి.. పొర్లు దండాలు పెట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఆయన వందేళ్లు బతకాలని కోరుకుంటున్నాను. పైకి మాత్రమే జగన్‌తో కొట్లాటలు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలి’’ అంటూ కేసీఆర్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు బండి సంజయ్.