బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన కూలీ.. కేంద్రంపై కేటీఆర్ నిప్పులు..
posted on Jul 6, 2021 @ 2:32PM
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్ పల్లి- బాలానగర్- సికింద్రాబాద్ రూట్ లో అతిపెద్ద సమస్యగా ఉన్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. 1. 3 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్ ను రూ.385 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో నిర్మించారు. ఈ బ్రిడ్జీకి.. 2017 ఆగస్టు 21న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబూ జగ్జీవన్‌రామ్ పేరు పెట్టారు.
బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫ్లై ఓవర్ రిబ్బన్ కటింగ్‌ను వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కూలీతో చేయించారు. ఆమె గత రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంది. శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకోవడంతో అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.లక్షలాది మంది కార్మికులు ప్రాజెక్టుల్లో నిమగ్నమై పని చేశారని వారిని గౌరవించుకోవాలనే సీఎం కేసీఆర్ సూచనతో.. వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కూలీతో ఫ్లై ఓవర్ రిబ్బన్ కటింగ్ చేయించామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో పాలు పంచుకునే కూలీలను గౌరవించుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఇప్పటికే వంతెనలు, అండర్‌పాసులు మహానగరంలో అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు, జూబ్లీ నుంచి తుర్కపల్లి(ఓఆర్ఆర్) దాకా... స్కైవేలు నిర్మించేందుకు గత 4 ఏళ్ల నుంచి కసరత్తు జరుగుతోందన్నారు. రక్షణ రంగ సంస్థలకు చెందిన భూములు ఉండటం వల్ల.. కేంద్రం సహాయక నిరాకరణ వల్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండు స్కైవేల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.