కేసీఆర్‌ను నమ్మితే నదిలో ముంచేస్తారు!.. జగన్ తుస్!.. అదే చంద్రబాబు ఉంటేనా!
posted on Jul 6, 2021 @ 1:23PM
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కేసీఆర్ అందలమెక్కారు. ఆ తర్వాత ఆ మూడింటినీ మడిచి మూలన పడేశారు. నీళ్ల విషయంలో ఆయన ఎప్పుడూ జిత్తుల మారే. అతిజాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం సందు చిక్కినా.. చిక్కుల్లో పడేస్తారు. ఆ తర్వాత గిలగిలా కొట్టుకుంటుంటే తమాషా చూస్తారు. ఈ లోగా తన రాజకీయ పబ్బం గుడపుకుంటారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యమంటూ ప్రతిపక్షాలు పదే పదే గుర్తు చేస్తున్నాయి. తాజాగా, తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం ముదరడంతో సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై మరోసారి చర్చ జరుగుతోంది.
జగన్ జల దోపిడీకి పాల్పడుతున్నారని.. కేసీఆర్‌కు తెలిసే రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతున్నారని.. అందుకు ఆయన గతంలోనే అంగీకరించారని.. ఇప్పుడు కావాలని గొడవ చేస్తున్నారనేది తెలంగాణ విపక్షం ఆరోపణ.
రచ్చకు కారణం ఆయనేననేది ఏపీ వాదన. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో సరిపడా నీళ్లు లేకున్నా.. ఏపీని కవ్వించడానికే కావాలనే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ రైతుల కడుపు కొడుతున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రులు అంతగా తిడుతున్నా.. పౌరుషం లేకుండా పడుంటున్న ఏపీ పాలకులపై సర్వత్రా విమర్శలు. కేసీఆర్-జగన్‌లు కలిసి నిధులు, ఓట్లు కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారనేది ఇరురాష్ట్రాల విపక్షాల మాట. ఇలా ఇద్దరు సీఎంలపై రెండు రాష్ట్రాల్లో విమర్శల వర్షం కురవడం బహుషా ఇదే తొలిసారి కాబోలు.
తెలంగాణ దూకుడుగా పోతున్నా.. కరెంట్ పేరుతో నీటిని సముద్రం పాలు చేస్తున్నా.. సీమ ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నా.. ఎన్టీటీలో పిటిషన్‌లతో బెదిరిస్తున్నా.. సీఎం జగన్ మాత్రం చేతగాక చేతులెత్తేసినట్టు లేఖలతో సరిపుచ్చుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రయోజనాలకు సీఎం కేసీఆర్ ఇంతలా గండి కొడుతున్నా.. జగన్ అంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారని.. ప్రజాప్రయోజనాల విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారని నిలదీస్తున్నారు ఏపీ వాసులు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను హ్యాండిల్ చేయడం ఏపీ సీఎం జగన్‌కు చేతకావడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ లాలూచీ పడ్డారా? లేక, జగన్ అసమర్థతనా? అనే అనుమానాలూ ఉన్నాయి. ఇదే సమయంలో గతాన్ని ఓసారి రివైండ్ చేసుకుంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. కేసీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి.. ఏపీ ప్రయోజనాలను కాపాడిన వైనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ చెక్ పెడితే.. జగన్ గగ్గోలు పెడుతున్నారు. కానీ, చంద్రబాబు హయాంలో అలా కాదు. చంద్రబాబు చెక్ పెడితే.. కేసీఆర్ గింజుకోలేక గిలగిల్లాడే వాడు. ఏపీ ప్రయోజనాల విషయంలో అసలేమాత్రం కాంప్రమైజ్ కాలేదు చంద్రబాబు. ఒకవైపు తెలంగాణతో పోరాటం.. మరోవైపు సోమవారాన్ని పోలవారంగా మార్చి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించడం.. ఇంకోవైపు.. పట్టిసీమతో కరువు సీమను జలసీమగా మార్చిన ఘనత.. నిస్సందేహంగా చంద్రబాబునాయుడిదే.
ఇటు కేసీఆర్‌తో జలజగడాలకు దిగుతూనే.. అటు కేంద్ర పరిధిలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా ఫైట్ చేశారు అప్పటి సీఎం చంద్రబాబు. ఇప్పటి జగన్‌లా తిడితే పడలేదు.. ఇప్పటి జగన్‌లా ఉమ్మడి జలాలను తెలంగాణ వాడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేదు.. అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో పంచాయితీ పెట్టి.. ఏపీ వాటా కోసం.. ఏపీ ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు చంద్రబాబునాయుడు. ఏపీ కోసం తెలంగాణను కట్టడి చేశారు కాబట్టే కేసీఆర్‌కు చంద్రబాబు అంటే అంత కడుపుమంట. ఇప్పటి జగన్‌లా రాజకీయ ప్రయోజనాల కోసం రాజీ పడకుండా.. ఏపీ ప్రయోజనాల కోసమే పాకులాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకే, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఇంతలా జలవివాదం నడుస్తుంటే.. ఈ సమయంలో సీఎంగా చంద్రబాబు ఉండి ఉంటే.. సీన్ మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఒక్క ఛాన్స్ అని నమ్మి.. నట్టేట మునిగామని బాధపడుతున్నారు. మరో రెండున్నరేళ్లు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మళ్లీ చంద్రన్న వస్తారు.. కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తారు.. వెయిట్ అండ్ సీ.. అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.