కేసీఆర్ ఇక బేజార్.. సమరానికి సై అంటున్న ఉద్యమకారుల ఐక్య వేదిక..
posted on Jul 5, 2021 @ 6:56PM
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ముహూర్తాన, ఈటల రాజేందర్’ను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్’ చేశారో ఏమో కానీ, ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈటల విషయంలో కేసీఆర్ లెక్క తప్పింది. ఆయన బీజేపీలో చేరడంతో, కథే అడ్డం తిరగింది. ఈటల మీద వేటు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగానూ, ప్రజల్లో ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల జనాగ్రహం కట్టలు తెంచుకుంది. మరో వంక ఈటల హుజురాబాద్ నుంచి పూరించిన ఎన్నికల సమర శంఖం కేసీఆర్’ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈటల వెంట కదిలిన కమల దళం కేసీఆర్ కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి.
అది చాలదన్నట్లు, కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే.. ఇక్కడ పీసీసీ చీఫ్‘గా రేవంత్ రెడ్డి ఒకడు మోపడైండు. గొంతులో పచ్చి వెలక్కాయ లెక్క రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయి కూర్చున్నాడు. మాటల తూటాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అసలే ఫైర్ బ్రాండ్ ఆపైన పీసీసీ చీఫ్. అందుకే కేసీఆర్ ఇప్పటికే కాలికి బలపం కట్టుకుని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 7వ తేదీన రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోవచ్చును. అటు ఈటల, బండి సంజయ్.. ఇటు రేవంత్ బ్యాండ్ బజాయిస్తున్నారు. దీంతో అధికార పార్టీ అయోమయంలో పడిపోయింది. ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు అయోమయంలో చిక్కుకు పోయారు.
అది అలా ఉంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కారులంతా ఏకమై కత్తులు నూరుతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన, చేస్తున్న కేసీఆర్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు సిద్దమవుతోంది.. రాజకీయాలకు అతీతంగా, కేసీఆర్ గడీల పాలన అంతమొందించడమే లక్ష్యంగా జూలై 9న హైదరాబాద్’లో ఉద్యమ కారుల ఐక్య వేదిక పురుడు పోసుకుంటోంది.
నిజానికి, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంగా పక్షం రోజులకు పైగానే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివిధ వర్గాల నేతలంతా ఏకమవుతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కేసీఆర్ వమ్ము చేశారని ఆరోపిస్తున్న ఉద్యమకారులు..కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఉమ్మడి వేదిక నిర్మించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారులు హుజురాబాద్ ఎన్నిక రాష్ట్రానికి అత్యంత కీలకమని భావిస్తున్నారు. తెలంగాణలో ఏడేండ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు... హుజురాబాద్’లో టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజురాబాద్’ లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత ఏడేండ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు.. ఇంటింటికి తిరిగి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే.. గులాబీ బాస్ చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది. అందుకే టీఆర్ఎస్ వర్గాలు కూడా ఉద్యమకారుల కదలికలపై నిఘా పెట్టారని చెబుతున్నారు.
అంతే కాదు, హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంగా వేదిక నిర్మాణం జరుగుతున్నా.. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని ఉద్యమ నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. నిజానికి ఈటల కంటే ముందు కూడా కేసీఆర్, అనేక మంది ఉద్యమ నాయకులను కరివేపాకు లెక్క తీసి పారేసారు. అయినా, రావాల్సిన స్థాయిలో ప్రజల నుంచి ప్రతిఘటన రాలేదు. ఆ ధైర్యంతోనే కావచ్చు కేసీఆర్ ఈటలను ఎరేశారు. కానీ, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా ..