గవర్నర్ గా కంభంపాటి హరిబాబు.. హర్యానాకు దత్తాత్రేయ బదిలీ
posted on Jul 6, 2021 @ 12:26PM
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు వారికి అవకాశం దక్కింది. ఏపీ బీజేపీ సీనియర్ నేత, విశాఖ పట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గవర్నర్ గిరి పోస్టు దక్కింది. హరిబాబును మిజోరాం గవర్నర్ గా నియమించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయకు మరోసారి అవకాశం దక్కింది. అయితే దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్ గా బదిలి చేసింది కేంద్ర సర్కార్. రాజేంద్రన్ విశ్వనాథ్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా అపాయింట్ చేసింది.
కేంద్ర మాజీ మంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ ను కర్నాటక గవర్నర్ గా నియమించింది. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగుభాయ్ పటేల్ ను అపాయింట్ చేసింది. జార్ఖండ్ గవర్నర్ కు రమేష్ బైస్ నియమితులయ్యారు. త్రిపురకు సత్యదేవ్ నారాయణ్ ను గవర్నర్ గా పంపింది. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మెట్రో మెన్ శ్రీధరన్ పిళ్లె గోవా గవర్నర్ గా ఖరారయ్యారు. కొత్త గవర్నర్ల నియామకం, బదిలీలు, మార్పులు చేర్పులపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.