రామోజీరావును కలిసిన రేవంత్ రెడ్డి.. గాంధీభవన్ లో సందడే సందడి
posted on Jul 6, 2021 @ 12:17PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి.. తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. బుధవారం గాంధీభవన్ లో పార్టీ పగ్గాలు తీసుకోనున్న రేవంత్ రెడ్డి.. అందుకు ముందుగానే పార్టీ నేతలందరిని ఏకం చేస్తున్నారు. అన్ని వర్గాల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. సోమవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు పలువురు నేతలను కలిశారు. కాంగ్రెస్ నేతలతో పాటు ప్రముఖులను కలుస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నిజానికి రేవంత్ ను కలవడానికి వీరిద్దరూ ఆసక్తి చూపలేదని సమాచారం. అందుకే ఇతర నేతలను కలిసినప్పటికి వీళ్లిద్దరని కలవలేదు రేవంత్ రెడ్డి. దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి దూతగా రంగంలోకి దిగిన మాజీ ఎంపీ మల్లు రవి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తన సోదరుడైన భట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించారు. మల్లు రవి మంత్రాంగంతో ఇద్దరు ముఖ్య నేతలు దిగిరావడంతో.. వాళ్లను కలిసేందుకు రేవంత్ రెడ్డి వస్తున్నారని చెబుతున్నారు.
పీసీసీ ఎంత ముఖ్యమో,రాష్ట్రంలో సీఎల్పీ నాయకుడు కూడా అంతే ముఖ్యమన్నారు మల్లు రవి. వీటిలో ఏ ఒకటి లేకపోయిన పార్టీ నడవదన్నారు. భట్టి కూడా పీసీసీ కోరుకున్నా దక్కలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతల స్వీకరణ కు కూడా భట్టి హాజరవుతారని చెప్పారు. రేవంత్ కార్యక్రమానికి సర్కార్, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే బాగుండదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దని డీజీపీ, సీపీలను కోరారు. ఒకవేళ ఇబ్బంది పెడితే..జైలు భరో కార్యక్రమం పెడతామని హెచ్చరించారు మల్లు రవి.
మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి గాంధీభవన్ ముస్తాబైంది. పార్టీ ఆఫీసులో కొన్ని మార్పులు కూడా చేశారు. గతంలో కాంగ్రెస్ లో కీలక పదవులు అలంకరించి ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్న నేతల ఫోటోలను తొలగించారు. పీసీసీ చీఫ్ లుగా పని చేసిన కేశవరావు, డీఎస్ ఫోటోలను తొలగించారు.
ఇక రేవంత్ రెడ్డికి మద్దతుగా ఐదు వేల బైక్ లతో ర్యాలీ నిర్వహించేందుకు హైదరాబాద్ కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ రూపొందించాయి. ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 బైకులు పాల్గొనాలని నిర్ణయించారు.