మమతా ఢిల్లీ యాత్ర సక్సెస్ అయినట్లేనా?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన,అనుకున్నట్లుగా జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించలేదు కానీ, చలనం అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీలో జోష్ పెంచింది. ఆయన మీద మాత్రం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన ప్రభావం ఘనంగానే ఉన్నట్లు కనిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక విధమైన సంతోషం మరో విధమైన విస్మయం వ్యక్తపరుస్తున్నారు.
పార్లమెంట్ లో యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులతో జరిగే చర్చల్లో రాహుల్ గాంధీ సహజంగా పాల్గొనరు. పార్లమెంట్‘లో అనుసరించవలసిన వ్యూహం పై చర్చించే యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలకు ఆయన హాజరు కారు. భాగస్వామ్య పార్టీల నాయకులతో చర్చించే ఏ విషయంలో ఆయన జోక్యం చేసుకోరు. కోఆర్డినేషన్ వ్యవహరాలను పార్టీ ఫ్లోర్ లీడర్స్,ఇతర నాయకులు చూసుకుంటారు.కానీ, మమతా బెనర్జీ ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చిన మంగళవారం రాహుల గాంధీ, యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.నిజానికి రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు, మల్లిఖార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతి రోజు యూపీఏ వ్యూహ కమిటీ సమావేశం జరుగుతుంది. అయితే, ఇంతవరకు రాహుల్ గాంధీ,ఎప్పుడూ ఆవైపు కన్నెత్తి చూడలేదు. అలాంటిది మంగళవారం సమావేశానికి హాజరయ్యారు. చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు.
పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వం పై వత్తిడి పెంచేందుకు విపక్షలన్నీ ఏకమవ్వాలని అన్నారు. అవసరం అయితే, ప్రభుత్వ మొండి వైఖరిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళి, ఆయన జోక్యం కోరదామని సూచించారు. మరో వంక విపక్షాలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారనే సంకేతాలు పంపేందుకు, ఏఐసీసీ కార్యాలయం, యూపీఏ కోఆర్డినేషన్ సమావేశానికి రాహుల్ గాంధీ అధ్యక్షత వహించిన ఫోటోలను విడుదల చేసింది. అయితే, రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు ఎంత కాలం ఉంటుందనేది, ఇప్పుడే చెప్పలేమని సమావేశానికి హాజరైన యూపీఏ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అలాగే, ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు జరుగుతున్నప్రయత్నాలలో రాహుల్ గాంధీ క్రియశీల పాత్రను పోషించాలని, గాంధీ కుటుంబ విధేయ ఎంపీ ఒకరు తమ మనసులోని మాటను మీడియా ముందుంచారు. అయితే, ప్రతిపక్షాలను ఏకం చేయడం, రాహుల్ గాంధీకే కాదు, మమతా బెనర్జీ, శరద్ పవార్ సహా. ఎవరికీ కూడా అనుకున్నంత సులభంగా అయ్యే పనికాదు. అందుకే. అదే పనిలో నిమగ్నమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అయినా శరద్ పవార్, మమతా బెనర్జీ అయినా మరొక రైనా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న పార్టీలు, నాయకులు కొంచెం వెనకా ముందుగా అయినా, ప్రధాని మోడీ ని ఒంటరిగా ఓడించడం, కాంగ్రెస్ సహా ఏ పార్టీకీ అయ్యే పని కాదనే నిజాన్ని గ్రహించారు. అన్ని పార్టీలు ఏకమైతేనే కానీ, మోడీని గద్దె దించడం సాధ్యం కాదన్న సత్యాన్ని తెలుసుకున్నారు. అదే విషయం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో మరో మారు స్పష్టమైంది. అయితే, మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనతో విపక్షాల ఐక్యతా ప్రస్థానంలో తోలి అడుగు పడిందని మాత్రం చెప్పవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మమతా బెనర్జీ, చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అంతే మోడీని గద్దేదించేందుకు ఏర్పడే కూటమికి ఎవరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని, మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అలాగే, విపక్షాల ఐక్యత కోసం పిల్లి మెడలో గంటకట్టే బాధ్యతను తాను తీసుకుంటానని ముందు కొచ్చారు. ఆ విధంగా దీదీ ఢిల్లీ పర్యటన, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఒక ముందడుగా పరిశీలకులు భావిస్తున్నారు.