ఏపీలో సంక్షేమ పథకాలకు కోతలు? అధికారులను బకరా చేయబోతున్నారా?
posted on Jul 28, 2021 @ 7:02PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త అవతారం ... ఎత్తుతున్నారా? ఇంత వరకు అంతా తమ ఘనతే అని, కొవిడ్, కష్టాలు కట్టకట్టుకుని దాడి చేసినా, సంక్షేమ ఫలాలను గంట కొట్టినట్లు ఠంచనుగా టైముకు ఇంటింటికీ చేర్చిన ఘనత మొత్తానికి మొత్తంగా తమకే దక్కుతుందని అధికార పార్టీ డబ్బాలు కొట్టుకుంది. అంతే కాదు, ఆ క్రెడిట్ మొతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకే చేరుతుందని కూడా అధికార గణాలు ముఖ్యమంత్రికి కీర్తి కిరీటాలు తగిలించాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం, గొంతు మారుతోందా? అధికారులను బకరాలను చేసే బ్లేమ్ గేమ్’కు రంగం సిద్డంమవుతోందా? అంటే, అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 26 నెలలు అయింది. అయితే ఇంతవరకు ఆయన అధికారులను పల్లెత్తు మాట అన్న సందర్భం ఇంచుమించుగా లేదనే అంటారు. ఒకటి రెండు సందర్భాలలో చిరుకోపం చూపినా, మరీ ఇంతలా ముఖాన వాతలు పెట్టిన సందర్భం అయితే లేదు. ఇంతకీ విషయం ఏమంటే,కొంత మంది అధికారుల పనితీరును సిఎం మొట్టమొదటి సారిగా చీదరించుకున్నారు. ఛీ .. చండాలం, వెరీ బ్యాడ్’ అని అక్షింతలు వేశారు.
మంగళవారం (జూలై 27) న స్పందన కార్యక్రమం పై జిల్లా కల్లెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్’లో ముఖ్యమంత్రి కొంత మంది ఆఫీసర్స్ పనితీరు చాలా బాగాలేదని, వెరీ బ్యాడ్ అని పేరు పేరునా చెప్పేశారు. ఇది ఆమోదయోగ్యం కాదు అని గట్టిగా మందలించారు. అంతే కాదు, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో ఫెయిల్ అయిన వారికి మెమోలు ఇవ్వండి, అని పై అధికారాలకు ఆదేశాల జారీ చేశారు. అక్కడితో ఆగకుండా, ఇలా మెమోలు ఇవ్వవలసి రావడం బాధాకరం. నాకు నేను మెమో ఇచ్చుకోవడంతో సమానం, మీ ఫెయిల్యూర్ నా ఫెయిల్యూర్’ అంటూ మొదటిసారిగా అధికారుల ముఖం మీదనే చీవాట్లు పెట్టారు. గ్రామ, వార్డ్ సెక్రటేరియట్ల ఇన్స్పెక్షన్’కు సంబంధించి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గ్రామ, వార్డ్ సచివాలయాలు తమ మానస పుత్రికలుగా పేర్కొంటూ, వాటిని నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు ..అంటూ అధికారుల ఫెయిల్యూర్స్ ఏకరువు పెట్టారు. మనం ముందు మనుషులమ తర్వాతనే అధికారులం .... అంటూ చాలా చక్కగా జ్ఞానబోధ చేశారు. అంతే అయితే అదోరకం, కానీ, అసలు చెప్పదలచుకున్న విషయాన్ని చివర్లో అధికారుల చెవిలో వేశారు. సంక్షేమ ఫలాలు అనర్హులకు అందరాదు, అలాంటి అనర్హులను ఎరివేయండి, అందుకోసంగా ఇల్లిల్లు తిరిగి అయినా సంక్షేమ లబ్దిదారుల జాబితాను, కుదించమని చెప్పారు. అఫ్కోర్స్ అదే సమయంలో అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని కూడా అన్నారనుకోండి. అయితే, అధికారులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా గీత దాటిన నేపధ్యంలో. ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు తెన్నులను బట్టి, సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్యను కుదించి, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టమావుతోందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుల పద్దు హద్దులు దాటిందని హెచ్చరించింది. కేంద్ర నిధుల దారి మళ్లింపు కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా బీజేపీ ఎంపీ జీవిఎల్, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, టీడీపీ ఎంపీల బృదం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఈ నేపధ్యంలో, సంక్షేమ కోతలకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. అయితే, ఆ పాపం తమ చేతికి అంటకుండా, అధికారాలను బకరాలను చేసేందుకే, ముఖ్యమంత్రి డైరెక్ట్’గా మెమోల వరకు వెళ్ళారని అధికారులు అంటున్నారు. అయితే ఈ బ్లేమ్ గేమ్ ఎక్కడి వరకు వెళుతుంది.. ఏ మలుపు తీసుకుంటుంది చూడవలసి వుందని అధికారులు అంటున్నారు.