బీజేపీలో ముదిరిన కోల్డ్‌వార్! హుజురాబాద్ లో ఈటలకు గండం?
posted on Jul 29, 2021 @ 2:01PM
నిఖార్సైన పార్టీ. సైద్దాంతికతకు కట్టుబడి పనిచేసే పార్టీగా చెప్పుకునే బీజేపీలో కుహానా రాజకీయాలు పెరిగాయి. కరుడుకట్టిన కాషాయ వాదుల్లోనూ వర్గ పోరు వాసనలు వస్తున్నాయి. తెలంగాణలోనూ కమలనాథులు ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. బీజేపీలో కుమ్ములాటలు ఇప్పుడు హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌కు ఇబ్బందిగా మారింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా బాగుండు.. బీజేపీలో ఈ లొల్లేందంటూ రాజేందర్ తెగ వర్రీ అవుతున్నారట. తాజాగా బయటపడిన ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి వాట్సాప్ చాట్‌తో బీజేపీలో ఆధిపత్యపోరు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసొస్తోంది.
ఒకప్పుడు వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్, దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్.. ఇలా బీజేపీ ప్రముఖులంతా ఒక్కమాట మీద ఉంటూ పార్టీని పైకి తీసుకురావడం కోసం కలిసికట్టుగా పని చేసేవారు. ఇప్పుడు పార్టీ ఏకతాటి మీద లేదంటున్నారు. కిషన్‌రెడ్డి తెలంగాణ బీజేపీలో మొదటినుంచీ కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడూ ఉంటున్నారు. టీబీజేపీలో కిషన్‌రెడ్డి ఆధిపత్యం కాదనలేనిది. జాతీయ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరపగల స్థాయి. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల పార్టీ బాధ్యతలనూ పర్యవేక్షించిన సత్తా. అలాంటి కిషన్‌రెడ్డికి.. నిన్నగాక మొన్న పార్టీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్‌కి మధ్య సయోధ్య కుదరడం లేదని తెలుస్తోంది. కరీంనగర్‌లో కార్పొరేటర్ స్థాయి నాయకుడు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడి.. లక్కీగా ఈసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ను ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం.. తనను కాదని ఆయన సొంతంగా దూకుడు రాజకీయం నెరుపుతుండటం కిషన్‌రెడ్డికి కంటగింపుగా మారిందని అంటున్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని చెబుతున్నారు.
ఇటీవల జీహెచ్ఎమ్‌సీలో లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నికల సమయంలో ఆ కోల్డ్‌వార్ మరింత ముదిరింది. బీజేపీకి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఆ బైపోల్ ఏకగ్రీవం చేయాలని కోరుతూ కొందరు బీజేపీ నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలవడం కలకలం రేపింది. ఈజీగా గెలిచే స్థానంలో.. తమకు బద్దశత్రువైన టీఆర్ఎస్ మద్దతు కోరడం దేనికంటూ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇదంతా బండిని ఇరకాటంలో పడేసేందుకు.. కిషన్‌రెడ్డి డైరెక్షన్‌లో జరిగిన కుట్ర అంటూ వార్తలు వచ్చాయి. కట్ చేస్తే.. బీజేపీకి టీఆర్ఎస్ సపోర్ట్ చేసినా కూడా.. ఆ సిట్టింగ్ సీటును కాషాయం చేజారిపోవడం.. కాంగ్రెస్ కొల్లగొట్టడం కొసమెరుపు.
ఆనాటి నుంచి కిషన్.. సంజయ్‌ల మధ్య వైరం మరింత ముదిరిందని అంటున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్‌తో అది తారాస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఈటలను బీజేపీలో చేరేలా చేయడంలో కిషన్‌రెడ్డిదే కీరోల్. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చి.. ఈటలతో చర్చించి.. జాతీయ పార్టీతో మాట్లాడించి.. ఢిల్లీలో కాషాయ కండువా కప్పే వరకూ.. మినిట్ టు మినిట్ ఫాలో చేసింది కిషన్‌రెడ్డినే. ఈటల బీజేపీలో చేరడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర చాలా చాలా పరిమితం. అందుకే, ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం విషయంలోనూ బండి.. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట. సంజయ్ వర్గం ఈటలకు సహకరించడం లేదట. నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించిన రోజు.. బండి సంజయ్ కరీంనగర్‌లోనే ఉన్నా ఆ కార్యక్రమానికి కావాలనే హాజరుకాలేదని అంటున్నారు. మీరు మీరు చూసుకోండి.. మధ్యలో నేనెందుకన్నట్టు బండి సంజయ్ సైడ్ అవుతున్నారట. మరీ, పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ హుజురాబాద్‌లో అడుగుపెట్టకపోతే బాగుండదనుకున్నారో ఏమో.. ఇటీవల ఓ రోజు ఇలా వచ్చి.. ఈటలకు హలో చెప్పి.. అలా వెళ్లిపోయారు. మళ్లీ కనిపిస్తే ఒట్టు. అయితే, ముందుచూపు కాస్తంత ఎక్కువే ఉన్న బండి.. వ్యూహాత్మకంగా హైదరాబాద్ టు హుజురాబాద్ పాదయాత్ర ప్రకటించి బంతిని తన కోర్టులోకి లాక్కున్నారు. హుజురాబాద్‌లో ఈటల గెలిస్తే.. అది కిషన్‌రెడ్డి ఖాతాలో పడకుండా తన అకౌంట్‌లో వేసుకునే ప్రయత్నం ఓవైపు.. పాదయాత్ర ఆసాంతం వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పార్టీని బలోపేతం చేసే వ్యూహం మరోవైపు.
ఈటలపై కిషన్‌రెడ్డి మనిషనే ముద్ర వేసి సంజయ్ వర్గం సైలెంట్‌గా ఉంటుండటంతో ఈటల తెగ ఇబ్బంది పడుతున్నారట. తన స్థాయి వాడు కాకపోయినా.. బాస్ కాబట్టి ఎంతకాదనుకున్నా బండి నేతృత్వంలోనే ఆయన పని చేయాల్సి ఉంటుంది. అయితే, అన్నివర్గాలను గుప్పిట్లో పెట్టుకొని మాంచి దూకుడు మీద ఉన్న టీఆర్ఎస్‌కు ధీటుగా నిలవాలంటే.. ఈటల రాజేందర్‌కు సానుభూతితో పాటు మీడియా సపోర్ట్ అత్యంత కీలకం. ఇక బీజేపీ జాతీయ నేతగా మారిన వివేక్ వెంకటస్వామికి చెందిన V6 ఛానెల్, వెలుగు పేపర్‌లో ఈటలకు ఎంత కవరేజ్ ఉంటే.. అంత మైలేజ్ వస్తుంది. అయితే, ఇన్నాళ్లూ వివేక్-బండి సంజయ్‌లు ఓ వర్గంగా ఉండేవారు. కానీ, ఈటల కోసం కిషన్‌రెడ్డి రంగంలోకి దిగడం.. బీజేపీ పెద్దలతో పదే పదే చర్చించాల్సి రావడం.. జాతీయ నేతగా ఉన్న వివేక్ అందులో భాగస్వామ్యం కావాల్సి రావడం.. ఈ క్రమంలో వివేక్.. సంజయ్‌కు దూరమై.. కిషన్‌కి దగ్గరయ్యారని అంటున్నారు.
ఇలా బండి సంజయ్ వర్గం నుంచి సహాయ నిరాకరణ.. బీజేపీ మీడియా మద్దతు సరైన స్థాయిలో లేకపోవడం.. ఈటలను అసహనానికి గురి చేస్తోందని చెబుతున్నారు. వైరల్‌గా మారిన ఈటల బామ్మర్ది వాట్సాప్ చాట్‌లోనూ అదే ఆవేదన కనిపించింది. మరి, కమలనాథులు కోల్డ్‌వార్ ఈటల రాజకీయ భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో..