ఏపీ శాసనమండలి రద్దు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
posted on Jul 29, 2021 @ 2:58PM
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు కాబోతోందా? కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందా?.. ఏపీ శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏడాదిన్నర క్రితం ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. జనవరి 27, 2020న అసెంబ్లీలో పాసైన తీర్మానాన్ని.. మరుసటి రోజే కేంద్రానికి పంపించింది జగన్ రెడ్డి సర్కార్. శాసనమండలి రద్దుపై సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉండటంతో రద్దు కావడం ఖాయమని అంతా భావించారు. కాని ఏపీ సర్కార్ ఫైల్ ను మోడీ సర్కార్ పెండింగులో పెట్టింది. తాజాగా ఏపీ శాసనమండలి రద్దు అంశం పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు.
2019 డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. మాడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులు అసెంబ్లీ ఆమోదం తర్వాత మండలికి పంపించారు. అయితే పెద్దల సభలో వైసీపీకి బలం లేకపోవడంతో ఆ బిల్లులకు అక్కడ ఆమోదం లభించలేదు. బిల్లులపై చర్చించి సెలక్ట్ కమిటీకి పంపించారు మండలి చైర్మన్. దీంతో తమకు బలం లేని మండలి అవసరం లేదని భావించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ మండలి ఇలాగే తిరస్కరిస్తూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించి మండలి రద్దుకే మొగ్గుచూపారు. మండలి తీరుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం.. న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మండలి రద్దుపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ జనవరి 27, 2020న శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు.
శాసనసభ ఆమోదించిన మండలి రద్దు తీర్మాణాన్ని కేంద్రానికి పంపినా... అక్కడ పెండింగులో పడింది. శాసనమండలి రద్దుపై చాలా సార్లు కేంద్రానికి జగన్ విన్నవించినా ఆ ఫైల్ ముందుకు కదలలేదు. ఇంతలోనే కొవిడ్ మహమ్మారి కల్లోలంతో మండలి రద్దు అంశం పక్కకు పోయింది. ప్రస్తుతం మాత్రం మండలిలో సీన్ మారిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు పెద్దల సభలో టీడీపీకి మెజార్టీ ఉండగా.. ఇప్పుడు మాత్రం అధికార వైసీపీకే మెజార్టీ ఉంది. గత రెండేండ్లలో భర్తీ అయిన సీట్లతో వైసీపీకి లీడ్ వచ్చింది. దీంతో శాసనమండలి రద్దుపై జగన్ వైఖరి మారిందనే చర్చ జరుగుతోంది. గతంలో మండలి రద్దుకు పట్టుబట్టిన జగన్.. ఇటీవల కాలంలో దాని గురించి మాట్లాడకపోవడంతో.. ఆయన వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. శాసనమండలిని రద్దు చేసి తీరుతానని చెప్పిన సీఎం జగన్.. మడమ తిప్పినట్టేనా అంటూ సెటైర్లు కూడా వేశారు నర్సాపురం ఎంపీ రఘురామ రాజు.
శాసనమండలి రద్దుపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే రాజ్యసభలో ఈ అంశం చర్చకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ శాసనమండలి రద్దు అంశం తమ పరిశీలనలో ఉందని కేంద్రం చెప్పడంతో.. తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి జగన్ మండలి రద్దుకే మొగ్గు చూపుతారా లేక.. చాలా హామీల్లో మడమ తిప్పినట్లే.. శాసనమండలి విషయంలోనూ మాట మారుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.