రేవంత్ రెడ్డికి ఐదు శాతం ఓట్లే.. కాంగ్రెస్ ఎంపీ కామెంట్లతో కలకలం
posted on Jul 29, 2021 @ 10:15AM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండటంతో ఉప ఎన్నిక షెడ్యూల్ రాకున్నా... ఎన్నికల వాతావరణం పీక్ స్టేజీకి వెళ్లింది. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్ పాదయాత్రతో జనంలో తిరుగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మంత్రులు ఊరూరు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ కొంత వెనకబడి ఉన్నా.. కార్యకర్తల సమావేశాలతో స్పీడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంలో జోష్ మీదున్న కాంగ్రెస్.. హుజురాబాద్ లో సత్తా చాటాలని భావిస్తోంది.
హుజురాబాద్ లో అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో పోరాడుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీరో అనేలా కోమటిరెడ్డి కామెంట్ చేయడం తీవ్ర దుమరం రేపుతోంది. హుజూరాబాద్ ఉన ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం పక్కా అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు కోమటిరెడ్డి. అయితే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలుస్తారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈటల గెలుస్తుందని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ కు డిపాజిట్ రాదన చెప్పడం గాంధీభవన్ లో కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన వెంటనే అసమ్మతి స్వరం వినిపించారు కోమటిరెడ్డి. పీసీసీ పదవిని కొనుక్కున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో పార్టీకి డిపాజిట్ తీసుకొచ్చి తన సత్తా చూపించుకోవాలని కూడా అన్నారు. తాజాగా ఢిల్లీలోనూ అదే అర్థం వచ్చేలా మాట్లాడి కాంగ్రెస్ లో కాక రేపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిగా ఉన్నారనే చర్చ సాగుతోంది. వెంకట్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఢిల్లీకి వెళ్లి కమలం పార్టీ పెద్దలతోనూ మాట్లాడారు. దీంతో ఆయన కాషాయ గూటికి చేరుతారని అంతా భావించారు. కాని అది జరగలేదు. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నా... గాంధీభవన్ కు మాత్రం వెళ్లడం లేదు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు కూడా హాజరుకాలేదు. ఇక పీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో వెంకట్ రెడ్డి కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారనే టాక్ నడుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి ఆయన మంతనాలు సాగించడం ఇందుకు బలాన్నిచ్చింది.
తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న కామెంట్లు .. వాళ్లు కాంగ్రెస్ దూరమయ్యేలా ఉన్నాయంటున్నారు. అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని చెప్పడం ద్వారా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరబోతున్నాననే సంకేతం ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు కొంత కాలంగా బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించగా.. రెండో రోజులుగా మాత్రం సీన్ మారిపోయింది. మంత్రి జగదీశ్ రెడ్డితో జరిగిన వివాదంపై వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తన సోదరుడికి అండగా నిలిచారు. దీంతో త్వరలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం గూటికి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.