ఏపీలో 52, తెలంగాణలో 39 లోక్ సభ సీట్లు?
posted on Jul 28, 2021 @ 9:58PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లు ఉండగా.. తెలంగాణలో 17 స్థానాలున్నాయి. అయితే త్వరలో ఏపీలో లోక్ సభ స్థానాలు 52కు, తెలంగాణలో 39 పెరగబోతున్నాయనే సమాచారం వస్తోంది. దేశంలో లోక్ సభ సీట్ల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 543 లోక్ సభ సీట్లుండగా.. వాటిని వెయ్యికి పైగా పెంచడానికి కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉండే తన సహచర ఎంపీల ద్వారా ఈ విషయం తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. దీంతో లోక్ సభ సీట్లు పెరగనున్నాయనే వార్త దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
'2024 లోపు లోక్ సభ స్థానాలను 1000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని బీజేపీలో ఉన్న నా సహచర ఎంపీల ద్వారా తెలిసింది. కొత్త పార్లమెంట్ భవనం 100 సీట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఒకవేళ వెయ్యి స్థానాలకు పెంచితే అంతకంటే ముందు ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలి. కీలకమైన ఈ అంశంపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.'' అని మనోజ్ తివారి ట్వీట్ చేశారు. లోక్ సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా వెయ్యికి పెంచే దిశగా మోదీ సర్కారు ప్రతిపాదనలు రూపొందిస్తోందని, దీనిపై జనాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తివారీ తన ట్వీట్ లో అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన వాదనకు నిదర్శనంగా.. కొత్తగా కడుతున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాను వెయ్యి మందికి సరిపడేలా కడుతున్న వైనాన్ని ఆయన ఉదహరించారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్థానాలను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల సందర్భంగా ఆయన అన్నారు. అంతేకాదు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు.. వాటి కంటే ఎంతో పెద్దదైన మనదేశంలో ఎందుకు 1000 మంది ఎంపీలు ఉండదని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా తమ జనాభాకు అనుగుణంగా చట్ట సభల సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. మనం ఇంకా ఆ దిశగా ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరుగుతున్న ప్రచారంతో ఆ దిశగా మోడీ సర్కార్ సీరియస్ గానే వర్కవుట్ చేస్తుందని చెబుతున్నారు.
మనదేశంలో ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇందులో 530 సీట్లను రాష్ట్రాలకు కేటాయించగా.. మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయి.ఏళ్లుగా ఈ సంఖ్య అలా పెరగకుండా ఉంటూ వస్తోంది. 1977 నుంచి సీట్ల సంఖ్య అలాగే ఉంది. కాని అప్పుడు మన దేశ జనాభా కేవలం 55 కోట్లే. ప్రస్తుతం దేశ జనాభా 135 కోట్లు దాటింది. కాని లోక్ సభ సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదు. 2009లో పునర్విభజన చేశారు. కాని లోక్ సభ నియోజకవర్గాల పరిధి మాత్రమే మారింది.. కాని సీట్లు సంఖ్య పెరగలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ గతంలో అన్నారని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ కంటే ముందు జితిన్ ప్రసాద కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మోడీ సర్కారు ప్రతిపాదిస్తున్న మాదిరిగా లోక్ సభ సీట్లు వెయ్యికి పెరిగితే.. అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు సంఖ్య ఇప్పుడున్న సంఖ్య కంటే రెట్టింపు కానున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం 80 లోక్ సభ సీట్లుండగా.. కొత్త ప్రతిపాదనతో అది 193కు పెరగనుంది. మహారాష్ట్రలో 48 సీట్ల నుంచి 117కు పెరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు 42 ఉండగా.. పెరిగితే 92 కావొచ్చంటున్నారు. బీహార్ లో ప్రస్తుతం 40 సీట్లు ఉండగా.. 94కు పెంచాలని మోడీ సర్కార్ ప్లాన్ చేస్తుందని సమాచారం. ప్రస్తుత జనాభా ఆధారంగా తమిళనాడు 77, రాజస్థాన్ లో 65 లోక్ సభ సీట్లు ఉండనున్నాయి. మధ్య ప్రదేశ్ లో 68, కర్ణాటకలో 67క. గుజరాత్ లో 60కి లోక్ సభ సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ఎంపీ సీట్లు కూడా డబుల్ కన్నా ఎక్కువ కానున్నాయి. ఏపీలో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లుండగా... మోడీ సర్కార్ ప్రతిపాదన ప్రకారం 52కు పెరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న 17 సీట్లు 39కు పెరుగుతాయి.
లోక్ సభ సభ్యుల సంఖ్యను దాదాపుగా డబుల్ చేసే దిశగా జరుగుతున్న ప్రతిపాదనల వల్ల ప్రాంతీయ పార్టీలు.. ప్రత్యేకించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు లాభమనే చర్చ జరుగుతోంది . అదే సమయంలో యూపీ, బీహార్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో పెరిగే సీట్లు బీజేపీకి ప్రయోజనమనే చర్చ జరుగుతోంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం, ఉత్తరాదిలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనం కావడం వంటి అంశాలను పరిశీలిస్తూ మోడీ సర్కార్ తాజా స్కెచ్ వేస్తుందని చెబుతున్నారు. అయితే లోక్ సభ సీట్ల పెంపుపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చేసిన ట్వీట్ పై కేంద్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీజేపీ కూడా మాట్లాడలేదు. దీంతో మోడీ సర్కార్ మదిలో ఈ ప్రతిపాదన ఉందా లేదా అన్నదానిపై పూర్తి స్పష్టత రావడం లేదు.