పార్టీని కాదు నన్ను చూసి ఓటేయండి.. బీజేపీకి ఈటల రాజేందర్ షాక్?
posted on Jul 28, 2021 @ 8:11PM
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు హుజురాబాద్ కేంద్రంగానే తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో ఉప ఎన్నికల జరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితమే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే హుజురాబాద్ లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. హుజురాబాద్ లక్ష్యంగానే సీఎం కేసీఆర్ దళిత బంధును తీసుకొచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏడేండ్లుగా పెండింగులో ఉన్న రేషన్ కార్డుల పంపిణి కూడా బైపోల్ పుణ్యమే అంటున్నారు.
తనకు కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో గెలిచి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని ఈటల రాజేందర్ గట్టి పట్టుదలగా ఉన్నారు. బీజేపీలో చేరిన ఈటల.. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి జనాలతో మాట్లాడుతున్నారు. పాదయాత్రలో సంచలన ఆరోపణలు చేస్తూ ముందుకు వెళుతున్నారు రాజేందర్. సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్న ఈటల రాజేందర్.. ప్రచారంలో మాత్రం పార్టీ పేరును ఎక్కువగా చెప్పడం లేదని తెలుస్తోంది. జమ్మికుంట మండలం గండ్రపల్లి సభలో మాట్లాడిన ఈటల.. బీజేపీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్ ప్రజలు ఎప్పటిలాగే తనకు అండగా ఉండాలని కోరారు రాజేందర్. ఈసారి పార్టీల పరంగా ఆలోచించవద్దని కోరారు. అంతేకాదు తన పార్టీని కాకుండా తనను చూసి ఓటేయమని అభ్యర్థించారు. ఎన్నడూ ఇంతగా ఓట్ల కోసం మిమ్మల్ని అడగలేదని.. మీ గుండెల్లో చోటు సంపాదించిన ఈ బిడ్డను ఈసారి పార్టీ చూడకుండా ఆశీర్వదించాలని కోరారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీని కాదని తనను చూసి ఓటేయమని చెప్పడంపై బీజేపీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరకుండా.. పార్టీ వద్దని చెప్పడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ ఏం చేస్తారన్న దానిపై రకరకాల చర్చలు జరిగాయి. కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరిగింది. కాని రాజేందర్ మాత్రం కమలం గూటికి చేరారు. అయితే బీజేపీలో రాజేందర్ ఇమడలేకపోతున్నారనే చర్చలు కూడా కొన్ని రోజులుగా వస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. దీంతో ఈటల కాంగ్రెస్ లో చేరితే బాగుండేదని, ఆయన తొందరపడ్డారనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపించింది.అంతేకాదు ఉప ఎన్నికల తర్వాత రాజేందర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇప్పుడు రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో ఆయన సంతృప్తిగా లేరనే అభిప్రాయం మళ్లీ తెరపైకి వస్తోంది. బీజేపీ కంటే తన ఇమేజ్ తో ప్రచారం చేసుకుంటనే గెలుస్తాననే ఆలోచనకు ఈటల వచ్చారంటున్నారు. బీజేపీ అయితే కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం ఉండటంతో.. ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఇలా రూట్ మార్చారనే వాదన కూడా వస్తోంది. మొత్తంగా పార్టీని పట్టించుకోవద్దంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.