ఈటల రాజేందర్ బామ్మర్ది వాట్సాప్ చాట్ లీక్.. బండి సంజయ్ షేక్
posted on Jul 29, 2021 @ 11:18AM
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఇటీవలే పాడి కౌశిక్ రెడ్డి... ఓ బీజేపీ కార్యకర్తలో మాట్లాడిన ఆడియో లీకై సంచలనంగా మారింది. చివరకి అది కౌశిక్ రెడ్డి పార్టీ మారడానికి కారణమైంది. తాజాగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాట్ ఒకటి లీకై నియోజకవర్గంలో వైరల్ గా మారింది. ఈటల రాజేందర్ భార్య జమునా రెడ్డి సోదరుడైన మధుసూధన్ రెడ్డి .. ఎన్నికల వ్యవహారాలను చూస్తున్నారు. రాజేందర్ పాదయాత్ర ఏర్పాట్లను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈటలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కూడా మధుసూదన్ రెడ్డే చూస్తారని చెబుతారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక, ఈటెల రాజేందర్ పాదయాత్రకు సంబంధించి కొండవీటి మధు సుధన్ రెడ్డి.. ఈటల పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన ఫోన్ వాట్సప్ చాట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దళితులను తిడుతూ అందులో మెసేజ్ చేశారు మధుసూధన్ రెడ్డి. దళిత బంధు స్కీమ్ తో ఓడిపోతామని భయం వ్యక్తం చేశారు. అంతేకాదు రాజేందర్ కు బండి సంజయ్ సపోర్ట్ చేయడం లేదని చెప్పాడు మధుసూదన్ రెడ్డి. కిషన్ రెడ్డి అండ తమకు ఉందన్నారు. వివేక్ వెంకట స్వామి, వీ6 మీడియా సపోర్టుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు మధుసూదన్ రెడ్డి.
ఈటెల రాజేందర్ పౌల్ట్రీ పార్టనర్ ద్వారా బయట పడ్డ ఫోన్ చాట్.. ఇలా ఉంది..
మధుసూదన్ రెడ్డి : నరేష్ గానికి మొన్న 50 లక్షలు పంపించిన అయినా వాని పని ఇలా ఉంది
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న నరేష్ డామినేషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ...మన పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు..డబ్బులు వాడు వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడు
మధుసూదన్ రెడ్డి : వాడికి ఫోన్ చేసి మాట్లాడిన...వాడు మీడియా వాళ్లకు ఇచ్చినా అంటుండు... రేపు అందరిని కనుక్కొని చెప్పు నాకు
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : ఒకే అన్న.. కాల్ చేసి కనుక్కొని చెప్తా
మధుసూదన్ రెడ్డి : ఒకే
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న ఫోన్ చేయి
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న ఆ నరేష్ గాడు మీడియా వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు(వాట్సప్ సంభాషణ తరువాత)
మధుసూదన్ రెడ్డి : జమ్మికుంట వాళ్లకు కూడ డబ్బులు పంపించు..కేశవన్న కు ఒక్కసారి ఫోన్ చేయి
మధుసూదన్ రెడ్డి : నారాయణగూడలో 10 కోట్లు తీసుకోని ఫార్చూనర్ కారులో వెళ్లి ..4 కమలాపూర్ లో మిగిలిన 6 జమ్మికుంటలో ఇచ్చేయి
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : ఓకే అన్న... డబ్బులు అందాయి...మహేష్ వచ్చాడు...ఫోన్ చేశా మీకు...వాట్స్ ప్ కాల్ కలవటంలేదు
మధుసూదన్ రెడ్డి : దళిత బంధు మీద గ్రామాల్లో అభిప్రాయం ఏమిటి
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : బాగుందన్న
మధుసూదన్ రెడ్డి : ఓకే..దళిత బందు ఏమైనా ప్రభావం చూపిస్తుందా..హుజురాబాద్ ప్రజలు ఏం అనుకుంటున్నారు...ఎస్సి ఓట్లు 40 వేలు ఉన్నాయి
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : 45 వేల వరకు ఉన్నాయి అన్న...కుటుంబానికి 10 లక్షలు అనేసరికి కొంచం తెరాస వైపే మొగ్గు చూపుతున్నారు...మనం కొంచం టర్న్ చేయాలన్న
మధుసూదన్ రెడ్డి : మాదిగ కొడుకులు చాలా చిన్న వాటికి ఆశ పడతారు వాళ్ళను నమ్మలేంరా...జాతీయ నాయకులు రాగానే టర్న్ అవుతుంది
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అవునన్న...అమిత్ షా రావాలి
మధుసూదన్ రెడ్డి : వస్తాడు..వీడు బండి సంజయ్ పట్టించుకోట్లేడు...కావాలని మొహం చాటేస్తున్నాడు...చూద్దాం
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : రాజేందర్ అన్నకు V6 వివేక్ మద్దతు పలకడం బండి సంజయ్ కి నచ్చట్లే అన్న...వివేక్ ను మనం కొన్ని రోజులు పక్కన పెట్టాలి...V6 కూడ పెద్ద కవరేజ్ ఇవ్వట్లేదు
మధుసూదన్ రెడ్డి : వివేక్ నుండి మనకు కిషన్ రెడ్డి మద్దతు ఉంది
ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అవునన్న...కిషన్ రెడ్డితో ఉంటేనే మంచిది...మనకు జేపీ నడ్డా అమిత్షా వాళ్ళ మద్దతు ఉంటది
మధుసూదన్ రెడ్డి : అవును
మధుసూధన్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న ఈ వాట్సాప్ లీక్ ఇప్పుడు నియోజకవర్గంలో ప్రకంపనలు రేపుతోంది. దీన్ని అస్త్రంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు స్పీడ్ పెంచారు. దళితులను కించపరిచారంటూ.. ఆ వర్గాలతో ఆందోళనలు చేయిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ తో రాజేందర్ కు విభేదాలు ఉన్నట్లుగా ఉన్న చాట్.. బీజేపీని షేక్ చేస్తోంది. ఈటల పాదయాత్రను బండి సంజయ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. పాదయాత్ర ప్రారంభం రోజున సంజయ్ లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా బయటపడిన వాట్సాప్ చాట్ తో రాజేందర్ తో బండి సంజయ్ తో విభేదాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.