వివేకా కేసులో అనుమానితుడు మిస్సింగ్..
posted on Jul 29, 2021 @ 11:00AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచుతోంది. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. అదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి . వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన సునీల్ కుమార్ యాదవ్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కనిపించకుండా పోయిన సునీల్ కుమార్ కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.
వివేకా హత్య కేసులో విచారణ పేరుతో సీబీఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు సునీల్ కుమార్ యాదవ్. ఆ తర్వాతి నుంచి పులివెందులలోని సునీల్ కుమార్ ఇంటికి తాళం వేసి ఉంది. అప్పటి నుంచి సునీల్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారన్న సమాచారంతో సీబీఐ అధికారులు గాలింపు చేపట్టారు.ఈ క్రమంలో సునీల్ సమీప బంధువు అయిన యువరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అనంతపురంలోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సీబీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ రంగయ్య ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ పేరును కూడా వెల్లడించాడు. ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం కనిపించకుండా పోవడం కీలకంగా మారింది. ఏ క్షణంలోనైనా సునీల్, డ్రైవర్ దస్తగిరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. సీబీఐ దూకుడుతో వివేకా హత్యకేసు అనుమానితుల్లో టెన్షన్ పెరుగుతోంది.