రెండుసార్లు వ్యాక్సిన్.. మూడుసార్లు కొవిడ్.. వామ్మో మామూలుగా లేదుగా...
posted on Jul 28, 2021 @ 5:59PM
కరోనా వైరస్ మహా ఖతర్నాక్. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కాటేయక మానదు. మాస్కులు పెట్టుకున్నా, శానిటైజర్లు రాసుకుంటున్నా మహా జాగ్రత్తగా ఉండాలి సుమీ. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా... ఇక మాకేమీ కాదని బిందాస్‌గా ఉండలేని పరిస్థితి. కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లా సామర్థ్యం సుమారు 75శాతం మాత్రమే. అంటే, రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కొవిడ్ వచ్చే అవకాశం మరో 25శాతం ఉందన్న మాట. డబుల్ డోస్ వేసుకున్న వారికే కరోనా సోకుతుంటే.. ఇక సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఏమాత్రం సేఫ్ కాదు. తాజాగా, ఓ లేడీ డాక్టర్‌కు ఏకంగా మూడుసార్లు కరోనా అటాక్ అయింది. వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ బారిన పడటం ఆందోళనకర అంశం.
కరోనా కొత్త వేరియంట్లను వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకుంటుందా? లేదా? అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ముంబయికి చెందిన డాక్టర్ శ్రిష్టి హిల్లరి (26) అనే యువ డాక్టర్ రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రెండు సార్లు కరోనా బారిన పడింది. అంతకుముందు కూడా ఓసారి ఆమెకు కరోనాఅటాక్ అయింది. మొత్తం 13 నెలల్లో ఏకంగా మూడుసార్లు ఆమెకు కరోనా వైరస్ సోకింది. తొలి రెండు సార్లు ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉన్నప్పటికీ, మూడోసారి అదీ రెండు డోసులు తీసుకున్న తర్వాత సోకిన వైరస్ కారణంగా ఆమెకు తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది.
ముంబైలోని వీర్ సావర్కర్ హాస్పిటల్‌లో కొవిడ్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ శ్రిష్టి హల్లరికి గతేడాది జులై 17న తొలిసారి కరోనా సోకింది. అప్పుడు ఆమెలో సాధారణ లక్షణాలే కనిపించాయి. ఈ ఏడాది మార్చి 8న తొలి డోసు, ఏప్రిల్ 29న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మే 29న రెండో సారి కరోనా బారినపడ్డట్టు రిపోర్ట్స్ వెల్లడించాయి. సింప్టమ్స్ మైల్డ్‌గానే ఉండటంతో ఇంట్లోనే కోలుకున్నారు. జులై 11న మరోసారి మొత్తం కుటుంబానికి వైరస్ సోకింది. ఈ సారి ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అయితే, టీకాలు ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోకున్నా.. ఆరోగ్యం దిగజారకుండా, పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా కాపాడుతాయనేది నిపుణులు మాట. కానీ, శ్రిష్టి హల్లరి విషయంలో మాత్రం ఆరోగ్యం క్షీణించడానికి.. కరోనా వైరస్ వేరియంట్లు మరింత బలపడుతున్నాయనేందుకు నిదర్శనం అంటున్నారు. అందుకే, మాస్కు పెట్టకున్నా.. వ్యాక్సిన్ వేసుకున్నా.. బీ కేర్‌ఫుల్. నిర్లక్ష్యం ఏమాత్రం తగదు.