వేల కోట్ల బేరం.. హుజురాబాద్ ఉప సమరం
తెలంగాణ రాజకీయం మొత్తం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హుజురాబాద్ ఉప ఎన్నికను తమ రాజకీయ జీవితానికి సవాలుగా తీసుకున్నారా? అన్న విధంగా పావులు కదుపుతున్నారు. సర్వంతానై వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, చివరకు సొంత పార్టీ స్థానిక నాయకులకు సైతం ఖరీదు కట్టి కొనేస్తున్నారనే ఆరోపణలు అంతటా వినిపిస్తున్నాయి. వినిపించడం ఏమిటి కనిపిస్తున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాళేశ్వరం (స్కామ్)లో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు చకా చకా చేతులు మారిపోతున్నాయి. అలాగని ప్రత్యర్ధులు తక్కువతిన్నారని కాదు, కాషాయం కట్టగానే ఈటల పునీతుడు అయిపోయాడని బీజేపీ భావిస్తే భావించవచ్చును, కానీ, ఈటల కూడా గులాబీ గూటి పక్షే .. ఆ తానులో పీసే...అదలా ఉంట, అధికార పార్టీకి సహజంగా ఉండే అడ్వాన్టేజిని కేసీఆర్ కొంచెం ఎక్కువగా ఉపయోగించు కుంటున్నారు. అందుకే కావచ్చు జనం పై వరాల జల్లు కురిపిస్తున్నారు.ఎందుకనో అన్నీ తెలిసిన కేసీఆర్, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న అర్యోక్తిని మరిచిపోయారని పార్టీలోనే కొందరు ఆందోళన చెందుతున్నారు. అంతే కాదు, కొందరైతే, ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ భూతద్దంలో చూసి భయపడుతున్నారని అంటున్నారు.
అదలా ఉంటే, మాజీ మంత్రి,, ఉద్యమ నాయకుడు. అన్నిటినీ మించి, రెండు దశాబ్దాలుగా తమ వెన్నంటి. కష్ట సుఖాలు, పాప పుణ్యాలలో పాలుపంచుకున్నఈటల రాజేందర్’ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్’కు అంత ఆగ్రహం ఎందుకో గానీ, ఆయన్ని ఓడించేందుకు ఎందాకా ఆయినా వెళ్లేందుకు సిద్దమంటున్నారు. అందుకోసంగా రూ.700 కోట్లు ‘ముడుపు’ కట్టారని, అవసరం అయితే ఇంకొన్ని వందల కోట్లు కుమ్మరించేందుకు కూడా కీసేఆర్ సిద్ధంగా ఉన్నారని, మీడియా కోడై కూస్తోంది. ఇక ప్రభుత్వ కుమ్మరింతల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఒక్క దళిత బంధు పథకాన్ని దృష్టిలో ఉంచుకుని కావచ్చు, ఒక్క అసెంబ్లీ నియోజక వర్గానికి 2 వేల కోట్ల రూపాయల పథకమా అంటూ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనరసింహ వంటి నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
మరో వంక ఒక్క నియోజక వర్గంలో పార్టీ పరంగా ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నదే నిజం అయితే రాష్ట్రంలో సాగుతున్న అవినీతి పాలనకు అది అద్దం పడుతుందని అంటున్నారు.
అదలా ఉంటే, హుజురాబాద్ పేరిట జరుగతున్న పార్టీ ఫిరాయింపులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సహజంగానే గోడ దూకుళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఫిరాయింపుల వార్తలు కొద్దిగా ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలాంటిది ముఖ్యమంత్రి తమ వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక పరపతి మొత్తాన్ని పణంగాపెట్టి పోరాడుతున్న ఉప ఎన్నిక సందర్భంగా ఫిరాయింపులు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. చివరకు సొంత పార్టీ నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం గతంలో ఎప్పుడూ లేదని, తెరాస కొత్త వరవడికి శ్రీకారం చుట్టిందని అంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక క్రతువు నేపధ్యంగా చిన్నా, చితక నాయకుల ఫిరాయింపులు, బేరసారాలు పక్కన పెడితే, పెద్ద చేపల్లో పెద్ద చేప ఈటల రాజేందర్, గులాబీ గుతినుంచి కమల దళంలోకి దూకేశారు. అనివార్యంగానే కావచ్చు గులాబీ పార్టీతో ఉన్న ఇరవై ఏళ్ల అనుబంధాన్ని, తెంచుకుని కాషాయం గూటికి చేరారు. ఇక ఆయన ఖాళీని నింపుకునేందుకు, తెరాస ఎవరినీ వదలకుండా, అన్ని పార్టీల నుంచి అయిన వాళ్ళను కానీ వారినీ అందరికీ, ఎదో ఒక రేటుకు బేరం కుదుర్చుకుని కండువాలు కప్పెస్తోంది. టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణను తెచ్చుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి 60 వేలపై చిలుకు ఓట్లు తెచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డినీ కేసీఆర్ లాగేశారు. చివరకు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం హుజురాబాద్ నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలిచి, చంద్రబాబు పుణ్యాన మంత్రి అయిన పెద్ది రెడ్డికి కూడా రెడ్ కార్పెట్ సిద్ద చేస్తున్నారు. ఈ 20 ఏళ్లలో పెద్దిరెడ్డి, ఎక్కని గడప (పార్టీ) లేదు.. కప్పని జెండా లేదు.అన్ని పార్టీలు తిరిగి చివరకు బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు అక్కడి నుంచి కారెక్కేందుకు సిద్దమయ్యారు.
ఇంత చేసినా ఈటలకు ప్రత్యర్ధి ఎవరన్నది ఇంతవరకు తేలలేదు. ఇప్పట్లో తేలే సూచనలు కూడా కనిపించడం లేదు. చివరకు, ఇప్పుడు పార్టీలో చేరిన అందరినీ, బొమ్మల కొలువులో బొమ్మల్లా పేర్చి, ఇంకెవరికో టికెట్ ఇచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. నిజానికి జరిగేది అదే, అని అంటున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్ధి అన్వేషణలోనే వుంది. నిజం అవునో కాదో కానీ, అభ్యర్ధి పేరు ప్రకటిస్తే, ఆవెంటనే కారెక్కేస్తారనే భయం వలన చేత కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించడం లేదని, గాంధీభవన్ మచ్చట్లలో విని పిస్తోంది.
మొత్తానికి, హుజురాబాద్ ఉప ఎన్నిక, రాజకీయ బేహారుల నిజ రూపాన్ని, తెర మీదకు తెచ్చింది. రాజకీయ విలువలకు పాతర వేసింది. రేపటి రాజకీయ రాక్షస క్రీడను ఈరోజే ఆవిష్కరించింది. రాష్ట్రంలో అవినీతి ఎన్ని వేల,లక్షల కోట్ల ఎత్తుకు ఎదిగిందో అద్దంలో చూపిస్తోందని అంటున్నారు.