జీతాలకే గతిలేదు.. కేంద్రానికి కట్టేదెలా? జగనన్న బండి గడిచేదెలా?
posted on Jul 29, 2021 @ 12:24PM
అసలు లేదు మొగుడా అంటే పెసర గారెలు కావాలన్నాడంట వెనకటికి ఒకడు. ఇప్పుడు కొత్త అప్పు ఇవ్వమంటే కుదరదంటారు.. ఒకవైపు ప్రకటించిన పథకాలకు డబ్బులు కావాలి.. ఇంకోవైపు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం ఇవ్వడం గగనమైపోయింది. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అయితే సరేసరి నెలల తరబడి జీతాలు పెండింగ్ పడిపోయాయి. సమాచార శాఖలో పని చేసే అవుట్ సోర్సింగ్ వారికే మూడు నెలలు పెండింగ్ పడ్డాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.
ఆల్రెడీ పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు కాబట్టి.. కొత్త అప్పు కుదరదన్నారు. ఇంకోవైపు ఇప్పటిదాకా ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్ అన్నట్లు డబ్బులు అటు ఇటు తిప్పేశారు జగనన్న. ఇప్పుడు అది కూడా కుదరకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే డబ్బులు ఆ పథకాలకే వాడేలా బ్యారికేడ్స్ పెట్టేస్తోంది. ఇక ఆ ముచ్చట కూడా జరగదు. ఇవన్నీ కాక..మీరు పరిమితికి మించి తీసుకున్న 4500 కోట్లు వెంటనే తిరిగి చెల్లించేయండని ఒక నోటీసు ఇచ్చిపారేసింది కేంద్రం.
ఇది సాధ్యమేనా.. ఆదాయం లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. డబ్బులు పందేరం చేయడంలో సక్సెస్ అయ్యారు. అసలు ఇప్పుడు కొత్తగా అప్పులు కావాలని అడుగుతుంటే.. అప్పు కట్టేయమని చెప్పడంలో కేంద్రం ఉద్దేశమేంటని వైసీపీ ప్రభుత్వ నేతలు మండిపడుతున్నారు. వాటీజ్ దిస్ నాన్సెస్స్ అంటుంటే.. అటు కేంద్రం ఏమో మీరు చేసిందే నాన్సెన్స్ అందుకే చెబుతున్నాం.. ఇప్పటికైనా కళ్లు తెరవండని చెబుతుందంట. మన అదినేత ఏమో వినడం గాని..చూడటం గాని ఉండదు కదా.. ఆయన ఏది అనుకుంటే అదే జరగాలి. ఇప్పుడు అలా జరిగేలా లేదు. అన్నీ అడ్డంకులే. మరోవైపు ఆ రఘురామకృష్ణరాజు ఒకడు తలనొప్పిగా తయారయ్యాడు. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ దెబ్బకు.. ఇప్పుడు లోపలకు పోవాల్సి వస్తుందా అనే టెన్షన్ ఒకవైపు పీకుతుంటే.. ఇంకోవైపు ఈ ఆర్ధిక కష్టాలొకటి.
అందుకే ఈ మధ్య కొత్తగా ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు ఇస్తున్నట్లుగా ఫుల్ పేజీ యాడ్స్ మాత్రం ఇచ్చేస్తున్నారు. అవి కింద మాత్రం రాలేదంటున్నారు. ముందు కొద్దిగా..తర్వాత కొద్దిగా..దశలవారీగా డబ్బులొచ్చినదానిని బట్టి వేస్తున్నారు. జీఎస్టీ డబ్బులొక్కటే ప్రధాన ఆదాయం..ఆ తర్వాత మద్యం అమ్మకాలు..ఇవన్నీ వాస్తవంగా ఈ పథకాలు లేకపోతే..ప్రభుత్వం నడపటానికి సర్దుకోవచ్చు. కాని ముందు పథకాలకు ఇచ్చేసి.. ఆ తర్వాత ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలు, రోజువారీ ఖర్చులు పెండింగ్ పెట్టేస్తున్నారు.
ఇప్పుడు వరుసబెట్టి మీద పడ్డ ఆంక్షలతో జిమ్మిక్కులు చేయడం కుదరదు..మేజిక్ చేయడం అసలే కుదరదు. ముందు ఆ 4500 కోట్లు ఎక్కడ నుంచి కడతారో చూడాలి. కట్టకపోయినా ఆశ్చర్యపోవనవసరం లేదు. కోర్టులనే లెక్క చేయనోళ్లు కేంద్రాన్ని మాత్రం లెక్క చేస్తారనుకోవడం పొరపాటే.