ఏపీకి అమ‌ర‌రాజా గుడ్‌బై? టార్చ‌ర్ తట్టుకోలేక త‌మిళ‌నాడుకు త‌ర‌లింపు?

అది కంపెనీ కాదు.. ఉద్యోగాల గ‌ని. అది సంస్థ కాదు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తి. అది త‌యారు చేసేది కేవ‌లం బ్యాట‌రీలు మాత్ర‌మే కాదు.. అది ఏపీకి బ్రాండ్ ఇమేజ్ కూడా. అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌. ఇది మ‌న ఆంధ్రుల అంద‌రి కంపెనీ. బ్యాట‌రీ త‌యారీరంగంలో దేశంలోకే నెంబ‌ర్ 2. బిలియ‌న్ డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన సంస్థ‌. ట్యాక్స్‌ రూపంలో దేశ ఖ‌జానాకు 2400 కోట్లు జ‌త చేస్తున్న ఘ‌న‌త‌. ఏపీ ప్ర‌భుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర ప‌న్నులు క‌డుతున్న అక్ష‌య పాత్ర‌. అలాంటి బంగారు బాతులాంటి సంస్థ‌పై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు క‌క్ష్య‌క‌ట్టిందంటున్నారు. కంపెనీ యాజ‌మాన్యం టీడీపీ, 'క‌మ్మ‌' వార‌నే ఏకైక కార‌ణంతో అమ‌ర‌రాజాపై కుట్ర‌లు చేస్తోందనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సంస్థ స్థాపించి దాదాపు 4 ద‌శాబ్దాలు అవుతోంది. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం అమ‌ర‌రాజాకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది.  గ‌ల్లా అరుణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నా కుట్ర‌లు ఆప‌లేదు. గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నార‌ని కాబోలు.. కుతంత్రాలు ఆప‌డం లేదు. ఇటీవ‌ల పొల్యూష‌న్ బోర్డు అధికారుల‌ను అమ‌ర‌రాజా క‌ర్మాగారంపైకి పాల‌కులు ఉసిగొల్పారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కంపెనీ వ‌ల్ల కాలుష్యం క‌లుగుతోంద‌ని.. వెంట‌నే మూసేయాలంటూ నోటీసులు ఇచ్చారు. 36 ఏళ్లుగా ఉన్న ఫ్యాక్ట‌రీ విష‌యంలో ఇప్పుడే పొల్యూష‌న్ గుర్తుకొచ్చిందా? అమ‌ర‌రాజా ఏ చిన్నాచిత‌కా బ‌డ్డీ కొట్టో కాదు. అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీ. నిబంధ‌న‌లు, త‌నిఖీలు ప‌క్కాగా ఫాలో కావాల్సిందే. అంత సిల్లిగా ఏమీ న‌డ‌వ‌దు క‌ర్మాగారం. కావాల‌నే, ఇబ్బందులు సృష్టించార‌ని, పొల్యూష‌న్ బోర్డుతో చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఇదంతా రాజ‌కీయ ప్రోత్బ‌లంతో జ‌రిగింద‌ని పారిశ్రామిక వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయినా, స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. అన్నంత ప‌నీ చేసేవారే. కంపెనీని మూసేసేవారే. కానీ, న్యాయం, చ‌ట్టం అంటూ ఉంటాయిగా. స‌ర్కారే సుప్రీంకాదుగా. అందుకే, కోర్టుకెళ్లి మ‌రీ ఆ ఆదేశాల‌ను అడ్డుకుంది యాజ‌మాన్యం. ఇలా ఒక‌టి కాక‌పోతే ఇంకోటి.. ప్ర‌భుత్వం నుంచి వ‌రుస‌గా వ‌స్తున్న ఇబ్బందుల‌తో విసిగిపోయిన యాజ‌మాన్యం.. ఇక ఏపీలో ఉండ‌టేమంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను ఉండ‌నిచ్చేలా లేరంటూ.. పొరుగు రాష్ట్రానికి వ‌ల‌స వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.   అంత పెద్ద కంపెనీ వ‌స్తానంటే.. ఎవ‌రైనా వ‌ద్దంటారా? అందుకే, రెడ్ కార్పెట్ ప‌రిచి మ‌రీ త‌మ రాష్ట్రానికి రమ్మంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. సీఎం స్టాలిన్‌తో అమ‌ర‌రాజా యాజ‌మాన్యం ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని.. చెన్నై శివార్ల‌లో స్థ‌లం కూడా కేటాయించిన‌ట్టు.. అక్క‌డ ముమ్మ‌ర ప‌నులు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే అనుకున్న‌ట్టే సాగితే.. మ‌రో 3 నెల‌ల్లోనే దేశ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ అమ‌ర‌రాజా కంపెనీ చిత్తూరు నుంచి త‌మిళ‌నాడుకు త‌ర‌లిపోనుంది. ఇది ఆంధ్రులుగా మ‌నంద‌రికీ అవ‌మాన‌క‌ర విష‌య‌మే.  ఏపీపై అమ‌ర‌రాజాకు ఉన్న అనుబంధం, అభిమానం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌లోని  ప్ర‌ధాన కార్యాలయాన్ని తిరుపతికి త‌ర‌లించింది అమరరాజా. ఎందుకంటే, తాము చెల్లించే పన్నులు.. త‌మ సొంత‌ రాష్ట్రానికే దక్కాలనే కార‌ణం. 1985లో గల్లా రామచంద్ర నాయుడు స్థాపించిన అమ‌ర‌రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌.. వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ద‌శ‌బ్దాలుగా దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మాన‌మై వెలుగుతోంది. వాహన బ్యాటరీలు , బ్యాటరీ ఛార్జర్స్, ఎలక్ట్రానిక్స్ , పారిశ్రామిక బ్యాటరీలు , డిజిటల్ ఇన్వర్టర్స్, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ , ఆహార ఉత్పత్తులు , ట్రిక్కేల్ ఛార్జర్స్, యూపిఎస్, విద్యుత్ వ్యవస్థ ఉత్పత్తి, షీట్ మెటల్.. ఇలా ప‌లు ప్రొడ‌క్ట్స్ త‌యారు చేస్తోంది. కంపెనీలో దాదాపు 16వేల మంది ప‌ని చేస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ సంకలనం చేసిన ఆసియా లో "'బెస్ట్ అండర్ ఎ బిలియన్" 2010 జాబితాలో అమర రాజా బ్యాటరీస్ ఒక‌టి. సామాజిక సేవ‌లోనూ అమరరాజా గ్రూప్ త‌న‌వంతు పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ఉపాధి, అభ్యసన-విద్య, సామాజిక పునరావాసం, గ్రామీణ అభ్యున్నతి వంటి రంగాలలో కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.  ఇలా ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఉద్యోగ‌, ఉపాధి, సామాజిక సేవ‌లో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమ‌ర‌రాజా కంపెనీపై కేవ‌లం టీడీపీ, 'క‌మ్మ' అనే కార‌ణాల‌తో కుట్ర‌లు చేస్తూ మ‌నుగ‌డ సాగ‌నివ్వ‌కుండా వేధిస్తూ.. పొల్యూష‌న్‌ను సాకుగా చూసి ఏకంగా ఫ్యాక్ట‌రీనే మూసేయాల‌నే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌ ప్ర‌య‌త్నాల‌తో అస‌హ‌నానికి లోనైన అమ‌ర‌రాజా యాజ‌మాన్యం.. త‌న పుట్టింటిని వ‌దిలి వెళ్లేందుకు బాధ‌తో సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు స‌ర్కారు అక్కున చేర్చుకుంటుండ‌టంతో.. అక్క‌డికి త‌ర‌లివెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతోంద‌ని తెలుస్తోంది. ప‌న్నుల రూపంలో ఏటా వెయ్యి కోట్ల‌కు పైగా జ‌మ చేస్తూ.. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీని కాల‌ద‌న్నుకొని.. జ‌గ‌న్ స‌ర్కారు ఏం సాధించిన‌ట్టో? రాజ‌కీయ లాభం కోసం ఇలా రాష్ట్ర‌, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌డం జ‌గ‌న్‌రెడ్డికే చెల్లిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ఏపీవాసులు.

యంగ్ టీంతో రాహుల్ దూకుడు.. కాంగ్రెస్ లో పీకే ఎఫెక్ట్? 

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోవచ్చును. ఆ బాధ్యతలను తీసుకునేందుకు ఆయన ప్రస్తుతానికి సిద్దంగా లేరన్నది కూడా నిజమే కావచ్చును. కానీ, అవసాన దశకు చేరుకున్న పార్టీని బతికించుకోవాలనుకునే ఆకాంక్షతో రగిలిపోతున్ననాయకులలో ఆయనే ముందుంటారు. పార్టీకి పూర్వ వైభవ స్థితి తీసుకొచ్చేందుకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నివాదులు కునేందుకు  ఆయన సిద్ధంగా లేరు.అవును, గతంలో రాహుల్ గాంధీ రాజకీయ అవగాహనా కొంత భిన్నంగా ఉండేది, ఆయన వ్యవహారశైలి అంటీ ముట్టనట్లుగా ఉండేది. అందుకే, కొదరు రాజకీయ విశ్లేషకులు ఆయన అసలు రాజకీయ నాయకుడే కాదని, కాలేడని తీర్పు నిచ్చేశారు. అంతే కాదు ఇంకా చాలా విధాలుగా ఆయన్ని చిన్నగా చూపించే ప్రయత్నం జరిగింది.  కానీ ఇటీవల కాలంలో ఆయనలో మార్పు వచ్చింది. రాజకీయ అవగాహన, పోకడలలో  మార్పు కనిపిస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై గోవా ప్రభుత్వాన్ని చేజార్చుకున్న అనుభవంతో కావచ్చును,గతంలో కంటే చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రధాని మోడీకి ప్రత్యర్ధి ఎవరు, అన్న ప్రశ్నకు సమాధానంగా తనను తాను మలుచుకుంటున్నారు. కావచ్చును. ఆయనలో వస్తున్న మార్పుకు, ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు కారణం అయితే కావచ్చును. ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్ ఫాక్టర్ కర్ణం అయినా కావచ్చును. అయినా, తెర వెనక ఎవరున్నారు, తెర ముందు ఎవరున్నారు అన్నది కాదు. తెర మీద బొమ్మ పడిందా లేదా అన్నదే పాయింట్. రాజకీయాలలో రాణించడానికి అదే కీలకం.  రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆ మార్పు కారణంగానే నవ జ్యోతి సింగ్ సిద్దు  పంజాబ్ పీసీసీ కెప్టెన్ అయ్యారు. అటు సిద్దు, ఇటు రేవంత్ ఇద్దరి విషయంలో పార్టీ  సీనియర్ నాయకులు, పంజాబ్ ‘లో అయితే ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా సీనియర్ నాయకులు  చాలా చాలా చిక్కులు సృష్టించే ప్రయత్నం చేశారు. అయినా, రాహుల్ పట్టించుకోలేదు. సీనియర్లకు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు.ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ కట్టి పడేస్తున్నారు.  ఈ నేపధ్యంలోనే బీజేపీకి, మోడీకి భయపడే నాయకులు, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎదుర్కునే సత్తాలేని పిరికి నేతలు తనకు అక్కర లేదని, అలాంటి వారు  బయటకు పోవచ్చిని ఎగ్జిట్ మార్గం చూపించారు.  ఇప్పిడిక రాజస్థాన్ పై దృష్టి పెట్టారు. రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి  విజయ మాకన్. పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గత వారాంతంలో మూడు రోజులు రాష్ట్రంలో మకాం చేసి, మొత్తం 115 మంది పార్టీ ఎమ్మెలలో వందమందికి పైగా ఎమ్మెల్యేలను కలిశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం డిమాండ్ చేస్తున్న మంతివర్గ పునః వ్యవస్థీకరణ, సంస్థాగత మార్పుల గురించి ఎమ్మెల్యేలతో విడివిడిగా ఉమ్మడిగా చర్చించారు. పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించారు. రానున్న కొద్ది రోజుల్లో రాహుల్ గాంధీ పంజాబ్ తరహాలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసి మాజీ అధ్యక్షుడు  సచిన్ పైలట్ మధ్య ఇంచుమించుగా సంవత్సరానికి పైగానే ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది.ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక ఈ వివాదాన్ని మరింత కాలం మురగనీయడం మంచి కాదని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే అని మకాన్ స్పష్టం చేశారు. అయితే,పైలట్ బెదిరింపులకు భయపడేది లేదని, ముఖ్యమంత్రి వర్గం గత సంవత్సరకాలానికి పైగానే అధిష్టానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వస్తోంది. ఈ పరిస్థితిలో రాహుల్ గాంధీ  తెలంగాణ, పంజాబ్’లలో  తీసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ స్టాండ్ రాజస్థాన్’లోనూ తీసుకోగలరా, అనేది చూడవలసి వుంది. అయితే ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన బూస్టర్ డోసే పనిచేసిందో ... నిండా మునిగిన తర్వాత  చలేమిటి అనే చొరవే ఆయన్ని నడిపిస్తోందో కానీ, రాహుల్  గాంధీలో కొత్త ఉత్సాహం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు కాంగ్రెస్ పార్టీని కూడా కొత్త బాటలో నడిపిస్తుందని పార్టీ నాయకులు అయితే విశ్వాసంతో ఉన్నారు.

బెయిల్ రద్దు కాకుండా జగన్ ఏం చేస్తున్నారో తెలుసా? 

ఆగ‌స్టు 25న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసులో సీబీఐ కోర్టు తీర్పు రాబోతోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టులో పలుసార్లు విచారణ జరిగింది. పిటిషనర్ తో పాటు జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీబీఐ మాత్రం తమ కౌంటర్ వేయడంలో దాగుడుమూతలు ఆడింది. మొదట చట్టం ప్రకారమే వెళ్లాలని కోర్టుకు చెప్పిన సీబీఐ.. తర్వాత పలు వాయిదాలు కోరింది. చివరకి మళ్లీ కోర్టుకే వదిలేసింది. దీంతో జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ కోర్టు తీర్పు ఉత్కంఠగా మారింది.  జగన్ వంద శాంత బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని పిటిష‌న‌ర్ ఎంపీ ర‌ఘురామ రాజు అంటున్నారు. కేసులో ర‌ఘురామ స‌మ‌ర్పించిన సాక్షాలూ  ప‌క్కాగా క‌నిపిస్తున్నాయని, బెయిల్ ర‌ద్దు నుంచి జ‌గ‌న్ త‌ప్పించుకోలేర‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయితే.. మ‌రోసారి ఆయన జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ రద్దు కేసు నుంచి బయటపడేందుకు జగన్ ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు చింతా మోహన్. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ మాజీ కావడం తథ్యమని జోస్యం చెప్పారు. జగన్ రాజకీయ పతనం ప్రారంభమైనట్టేనని, రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోందని చింతా మోహన్ అన్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు కేసులో తీర్పు రాబోతున్న సమయంలో చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న చింతాకు ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీల నేతలతోనూ ఆయనకు లింక్స్ ఉంటాయి. ఇంతేకాదు పాలనకు సంబంధించిన కీలక విషయాలు ఆయనకు అందుతుంటాయి. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ కేసుపై మోహన్ చేసిన కామెంట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బెయిల్ రద్దు కాకుండా చూడాలని జగన్ సాయం కోరిన కేంద్రమంత్రి కొడుకు ఎవరన్న దానిపై రకరకలా పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీలో కీలకంగా ఉన్న నేత అయి ఉండవచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

అందుకేనా సాగ‌ర్ టూర్‌!? కేసీఆర్‌ను అంత ఈజీగా న‌మ్మేస్తారా?

ఉరుము ఉర‌మ‌లేదు. మెరుపు మెర‌వలేదు. రాజ‌కీయ‌ సూచ‌న‌లేవీ లేవు. అయినా, మెరుపులా నాగార్జున‌సాగ‌ర్‌లో మెరిశారు సీఎం కేసీఆర్‌. కేవ‌లం ఎన్నిక‌ల వేళ త‌ప్పితే.. గెలిచాక అటువైపు క‌న్నెత్తి కూడా చూసే అల‌వాటులేని కేసీఆర్‌.. రాజ‌కీయంగా కొత్త అడుగులు వేస్తున్నారు. హామీలు ఇవ్వ‌డం.. ఆ త‌ర్వాత మ‌ర్చిపోవ‌డం.. అడిగితే ముఖం చాటేయ‌డం.. ఇదే ఆయ‌న‌కు అల‌వాటు అంటారు. అలాంటిది స‌డెన్‌గా నాగార్జున సాగ‌ర్‌లో ప‌ర్య‌టించి.. గ‌త ఉప ఎన్నిక స‌మ‌యంలో తాను ఇచ్చిన హామీలు ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చాయంటూ స‌మీక్షించ‌డం.. వాటిని నెర‌వేర్చ‌డానికి డెడ్‌లైన్ పెట్ట‌డం.. ఆశ్చ‌ర్యంతో కూడిన ఆస‌క్తిక‌ర విష‌య‌మే. కేసీఆర్‌లో ఇంత‌టి మార్పుకు కార‌ణం ఏమై ఉంటుంద‌ని తెగ చ‌ర్చించుకుంటున్నారు జ‌నాలు. ద‌ళిత ముఖ్య‌మంత్రి, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి నుంచి నిరుద్యోగ భృతి వ‌ర‌కూ ఏడేళ్లుగా ఒకేర‌క‌మైన ఎన్నిక‌ల స్టంట్‌. నోటికొచ్చిన హామీల‌న్నీ గుప్పించు.. గంప‌గుత్త‌గా ఓట్ల‌ను కొల్ల‌గొట్టు. ఇదే స్ట్రాట‌జీ. అందుకే, హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ‌.. కుటుంబానికి 10 ల‌క్ష‌లంటూ ద‌ళిత‌బంధు ప్ర‌క‌టించినా కూడా ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. కేసీఆర్‌ను న‌మ్మొచ్చా? నిజంగా ఇస్తారంటారా? ఎల‌క్ష‌న్ ఉంది కాబ‌ట్టి హుజురాబాద్‌లో ఇచ్చినా.. ఆ త‌ర్వాత మిగ‌తా జిల్లా ద‌ళితుల‌కు మొండిచేయి చూపిస్తారా? అనే అనుమానాలు చాలామందిలో. ఎందుకంటే, సీఎం కేసీఆర్ హామీల గ‌త చ‌రిత్ర అలాంటిది మ‌రి. అందుకే కాబోలు, ద‌ళిత బంధు అన‌గానే ఆ వ‌ర్గమంతా కేసీఆర్ ఫోటోల‌కు పాలాభిషేకాలు, ఊరేగింపులు గ‌ట్రా పెద్ద‌గా చేయ‌ట్లేదు. జ‌స్ట్ విని.. ఊర‌క ఉండిపోయారంతే. ఇచ్చిన‌ప్పుడు చూద్దాం.. ఇస్తే తీసుకుందాం.. అన్న‌ట్టుగానే ఉన్నారు.   ప్ర‌జ‌లు క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నా.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నాయి. హుజురాబాద్ ఎన్నిక‌లు ముగిశాక ద‌ళిత‌బంధును అట‌కెక్కించడం ఖాయ‌మంటూ జోరుగా ప్ర‌చారం చేస్తున్నాయి. సోష‌ల్ మీడియా అంతా కేసీఆర్ చిత్త‌శుద్ధిని శంకిస్తోంది. ముఖ్య‌మంత్రిని శ‌ల్య‌ప‌రీక్ష‌కు గురిచేస్తోంది. ఇక ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ, బీజేపీ అనుకూల‌ ఛానెల్‌లోనైతే రోజూ ఇదే న్యూస్‌. హుజురాబాద్‌లో ఎన్నిక‌లు ఉన్నాయ‌నే కేసీఆర్ ఇలాంటి హామీలు ఇస్తున్నార‌ని.. ఇటీవ‌ల నాగార్జున సాగ‌ర్ బైపోల్ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల‌కు ఇప్ప‌టికీ అతీగ‌తీ లేదంటూ దాదాపు ప్ర‌తీరోజూ ఊద‌ర‌గొడుతోంది ఆ మీడియా.  నాగార్జున సాగ‌ర్‌లో ఏయే హామీలు ఇచ్చారు.. ఏయే మండ‌లానికి ఎన్నెన్ని కోట్లు ఇస్తాన‌న్నారు.. అంటూ కేసీఆర్ ఆనాడు మాట్లాడిన ప్ర‌సంగాన్ని ప‌దే ప‌దే చూపిస్తున్నారు. తెలంగాణ‌లో బాగా వ్యూయ‌ర్‌షిప్ ఉన్న ఛానెల్ కావ‌డంతో.. ఆ మేట‌ర్ జ‌నాల్లోకి బాగా వెళుతోంది. నిజ‌మే క‌దా.. సాగ‌ర్‌లో గెల‌వ‌డానికి కేసీఆర్ అన్నిమాట‌లు చెప్పారుక‌దా.. ఆ త‌ర్వాత ఆ ఊసే లేదుక‌దా.. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ అలానే చేస్తున్నారు క‌దా.. ఎన్నిక‌ల త‌ర్వాత హుజురాబాద్‌కు సైతం నాగార్జున సాగ‌ర్ గ‌తే ప‌డుతుందా? అంటూ కేసీఆర్‌పై అనుమానాలు పెరిగిపోయాయి. ఈ విష‌యం ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా ప‌సిగ‌ట్టిన ముఖ్య‌మంత్రి.. క్ష‌ణం ఆలోచించ‌కుండా.. వెంట‌నే నాగార్జున సాగ‌ర్ టూర్ పెట్టుకున్నార‌ని అంటున్నారు.  స‌డెన్‌గా సాగ‌ర్‌లో వాలిపోయారు సీఎం కేసీఆర్‌. త‌న‌కు క‌రోనా రావ‌డం వ‌ల్ల ఇన్నాళ్లూ రాలేక‌పోయానంటూ ముందే క‌వ‌రింగ్ ఇచ్చుకున్నారు. ఎప్పుడో తానిచ్చి మ‌ర్చిపోయిన హామీల గ‌తేందంటూ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి 150 కోట్లు.. హాలియా, నందికొండ అభివృద్ధికి వేరువేరుగా 15కోట్లు.. హాలియాలో డిగ్రీ కాలేజ్‌, మిని స్టేడియం నిర్మాణం.. అక్ర‌మిత భూముల్లో ఉన్న‌వారికి ప‌ట్టాలు.. బంజారా భ‌వ‌నం.. ఇలా పాత హామీల‌ను కొత్త‌గా మ‌రోసారి ప్ర‌క‌టించేసి త్వ‌ర‌లోనే వాటిని నెర‌వేరుస్తానని స్ప‌ష్టం చేశారు. ప‌నిలో ప‌నిగా కృష్ణా జ‌లాలు, ఏపీ దాదాగిరి అంటూ కాస్త సెంటిమెంట్ మ‌సాలా కూడా యాడ్ చేశారు. ఇక‌, ద‌ళిత‌బంధు ప‌థ‌కం గొప్ప‌ద‌నంపై హాలియా బ‌హిరంగ స‌భ‌లో ఘ‌నంగా ప్ర‌స్తుతించారు. ఇలా, ఎన్నిక‌ల త‌ర్వాత సీఎం కేసీఆర్ నాగార్జున సాగ‌ర్‌ను పట్టించుకోలేద‌ని.. హామీల‌ను అట‌కెక్కించేశార‌ని.. రేపు హుజురాబాద్‌కూ ఇదే గ‌తి ప‌డుతుందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి చెక్ పెట్ట‌డానికే ఆయ‌న స‌డెన్‌గా సాగ‌ర్ టూర్ వేశార‌ని అంటున్నారు. అయినా, ఒక్క ప‌ర్య‌ట‌న‌తో త‌ప్పుల‌న్నీ తుడిచిపెట్టుకుపోతాయా? సీఎం కేసీఆర్‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న అనుమానాలు అంత ఈజీగా తొల‌గిపోతాయా?

నామినేటెడ్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై 9 కేసులు! 

రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా అనూహ్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలే కారెక్కిన పాడి కౌశిక్ రెడ్డి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో శాసనమండలికి ఎంపిక చేశారు. కేసీఆర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఉన్న కౌశిక్ రెడ్డి పెద్దల సభకు పంపించారు కేసీఆర్. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడంతో హుజురాబాద్ లో ఇప్పుడు కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. దాంతో పాటు కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి ఎక్కువగా దూకుడు రాజకీయాలే చేశారు. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు భారీగానే నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా కేసులు కూడా నమోదయ్యాయి. చాలా కేసులు ఇప్పటికి విచారణలో ఉన్నాయి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో.. ప్రత్యర్థులు ఆయనపై ఉన్న కేసులను బయటికి తీస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఇంకా ఉన్నాయని తెలుస్తోంది.. ఆ కేసుల వివరాలు ఇవి.. 1. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద జమ్మికుంట పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.  తనను చంపేస్తానని బెదిరించాడని అరుకల వీరశలింగం అనే వ్యక్తి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద  కరీంనగర్ రూరల్ పీఎస్ లో బెదిరింపుల కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు లోక్ అదాలత్ పరిధిలో ఉంది.  3.  సెప్టెంబర్ 28, 2017న ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్ లో 506, 507 సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై బెదిరింపుల కేసు నమోదైంది.  4. డిసెంబర్ 6, 2017న వరంగల్ సుబేదారి పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించి ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు.  5. నవంబర్ 28, 2018న అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినందుకు కౌశిక్ రెడ్డిపై 188, 171 F, 171-H, 127 (A) RP Act కింద వీణవంక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.  6. నవంబర్ 28, 2018న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రూల్స్ కు విరుద్దంగా హనుమాన్ టెంపుల్ లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారనే అభియోగాలతో  505, 171-C, 171-G r/w 171-F IPC    కింద కేసులు పెట్టారు.  7. మే 8, 2020న మార్కెట్ యార్డులో ఎలాంటి అనుమతి లేకుండా సమావేశం, నిరసన తెలిపినందుకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై  188 IPC కింద కేసు నమోదైంది. 8. కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ 59 మందితో సమావేశం నిర్వహించారనే కారణంతో సిరిసిల్ల పీఎస్ లో జూన్ 13, 2020న పాడి కౌశిక్ రెడ్డిపై 143, 147, 353, 341, 269, 270 r/w 149 IPC, Sec 3 of Epidemic Diseases Act   కింద కేసులు నమోదయ్యాయి.  9. సెప్టెంబర్ 1, 2020న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై  186, 188, 506 IPC, Sec 3 The Epidemic Diseases Amendment   కింద కేసులు కట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి హుజురాబాద్ ప్రభుత్వాస్పత్రిని విజిట్ చేశారు. ఆ సయమంలో డ్యుటీలో ఉన్న వైద్యులు, మెడికల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.   

వీడు మామూలోడు కాదు.. 300మంది యువ‌తుల‌ను మోసం..

వీడు మామూలోడు కాదు. చుట్టానికి అందంగానే ఉంటాడు. అదే వాడి ఆయుధం. ఆ అంద‌మైన ఆయుధానికి మ‌రింత ప‌దును పెట్టాడు. సోష‌ల్ మీడియాలో యువ‌తుల‌కు చాటింగ్‌తో వ‌ల విసిరాడు. యువ‌తులతో పాటు పెళ్లైన మ‌హిళ‌ల‌నూ ట్రాప్ చేశాడు. న‌మ్మించాక‌.. ఎదుటివారు న‌మ్మార‌ని గ్ర‌హించాక‌.. ఇక ముగ్గులోకి లాగుతాడు. ముద్దు మాట‌లు చెప్పి.. ఆ టైప్ ఫోటోలు, వీడియాలో సంపాదిస్తాడు. ఇక అంతే. ఆ అందం ముసుగులో ఉన్న శాడిజం బ‌య‌ట‌కొస్తుంది. ప్రేమ మాట‌ల వెనుకున్న అస‌లు నేరం బ‌య‌ట‌ప‌డుతుంది. వాడు వాళ్ల అందాన్నేమీ దోచుకోడు. వాళ్ల సొమ్మునే దోచుకుంటాడు. అడిగినంతా ఇస్తారా? లేదంటే, ఆ ప‌ర్స‌న‌ల్ ఫోటోలు, వీడియోలు నెట్‌లో పెట్ట‌మంటారా? ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. డ‌బ్బు లేక‌పోతే గోల్డ్‌తోనైనా అడ్జ‌స్ట్ అవుతానంటాడు. ఇలా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 200 మంది యువ‌తులు, 100 మంది మ‌హిళ‌లు వాడి అంద‌మైన నేరానికి బాధితులుగా మారారు. ఇంత‌టి ఖ‌త‌ర్నాక్ క్రైమ్ క‌థా చిత్ర‌మ్‌లో హీరో క‌మ్ విల‌న్‌.. క‌డప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంత్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అలియాస్‌ టోనీ. ఎన్నిపేర్లు మారుస్తాడో.. అన్ని కుట్ర‌ల‌కూ తెగ‌బ‌డ‌తాడు. బీటెక్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లోనే చదువుకు డంకీ కొట్టేశాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. గొలుసు చోరీలు, ఇళ్లలో దొంగతనాలకు తెగ‌బ‌డ్డాడు. జైలుకు కూడ వెళ్లాడు. బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక‌రిని మోసం కూడా చేశాడు. ఇటీవ‌ల ఓ చోరీ కేసులో ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేసి విచారించగా.. పోలీసుల‌కే దిమ్మ‌తిరిగే అస‌లు విష‌యాలు తెలిశాయి. చోరీ కేసు కాస్తా.. వ‌ల‌పు కేసుగా ట‌ర్న్ తీసుకుంది.   కడప, విజయవాడ, హైదరాబాద్‌ తదితర నగరాల్లో అత‌డి బాధితులు ఉన్నారు. ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులు, వివాహితుల‌తో పరిచయం పెంచుకునేవాడు. మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించేవాడు. వారితో చాటింగ్‌ చేస్తూ వారి అస‌భ్య చిత్రాలు, వీడియోలు సంపాదించి.. ఆ త‌ర్వాత‌ బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు పంపాలని డిమాండ్‌ చేసేవాడు. లేదంటే ఆ కంటెంట్‌ను సోష‌ల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు ఇలా సుమారు 200మంది యువతులు, వందమంది మహిళలను మోసం చేశాడు. అతని ఫోన్ స్వాధీనం చేసుకొని ప‌రిశీలించిన పోలీసుల‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఫోన్లో అన్నీ మహిళలు, అమ్మాయిల చిత్రాలే ఉన్నాయి. అతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయని గుర్తించారు. ప్ర‌స‌న్న‌కుమార్ నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా పోలీసులు. ఇలాంటి మోస‌గాళ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. అందం చూసి, మాట‌లు చూసి.. టెంప్ట్ కావొద్ద‌ని సూచిస్తున్నారు. ఎలాంటి ప‌ర్స‌న‌ల్ కంటెంట్ ఎవ‌రితోనూ షేర్ చేసుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

అంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్తి.. రికార్డు సాధించిన తొలి సిటీ..

ఇండియాలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం న‌త్త‌న‌డ‌క‌గా సాగుతోంద‌నేది ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌. అభివృద్ధి చెందిన‌ దేశాల‌తో పోలిస్తే.. మ‌నం టీకా పంపిణీలో చాలా వెన‌క‌బ‌డి ఉన్నామ‌నే ఆరోప‌ణ‌. దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఒక్క డోసు టీకా ఇవ్వ‌డానికే ఇంకా చాలా  నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌నే అంచ‌నా. ఇక రెండు డోసులు ఇచ్చి.. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం పూర్తి చేయడం ఇప్ప‌ట్లో సాధ్యం కాక‌పోవ‌చ్చ‌నే నిరాశ. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో దేశంలోకే కరోనా టీకా పంపిణీలో 100శాతం లక్ష్యాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది ఓ న‌గ‌రం. అదేమీ ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరులాంటి టాప్ సిటీ కాక‌పోవ‌చ్చు. అక్క‌డేమీ జ‌గ‌న్‌, కేసీఆర్‌లాంటి గొప్ప‌లు చెప్పుకునే ముఖ్య‌మంత్రి లేరు. తెలుగు రాష్ట్రాల‌కు ప‌క్క‌నే ఉన్నా.. ఆ స్టేట్ పేరుగానీ, ఆ సీఎం గురించి గానీ.. దేశంలో పెద్ద‌గా ప్ర‌స్తావ‌న‌కు రాదు. మ‌న సీఎంల మాదిరి ప్ర‌చార ఆర్బాటాల‌తో ఆయ‌న ఊద‌ర‌గొట్ట‌రు. సింపుల్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతారు. తాజాగా, వ్యాక్సినేష‌న్‌లో 100శాతం టార్గెట్ కంప్లీట్ చేసిన న‌గ‌రంగా ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ రికార్డు సాధించింది.    భువ‌నేశ్వ‌ర్‌లో 18 ఏళ్లు పైబడిన, అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ రెండు డోసులను అందించినట్లు భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నగరం ఇదేనని మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ అన్షుమన్‌ రథ్ ప్ర‌క‌టించారు. భువనేశ్వర్‌లో 18ఏళ్ల వయసు పైబడిన వారు దాదాపు 9లక్షల మంది ఉండగా.. ఇప్పటివరకు 18.16లక్షల మందికి టీకా డోసులు అందించారు. నగరంలో అర్హులైన 100శాతం మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. స్థానికుల‌తో పాటు వలస కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో 31వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, 33వేల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 5.17లక్షల మంది 18 - 44 ఏళ్ల మధ్య వయస్కులు, 45ఏళ్లు పైబడిన 3.25లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపారు.    టీకా పంపిణీలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్షుమన్‌ వివరించారు. నగర వ్యాప్తంగా 55 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతో లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తిచేశామ‌న్నారు. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ లాంటి న‌గ‌రాల్లో ప్ర‌హ‌స‌నంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం సాగుతుంటే.. ఆ ప‌క్క‌నే ఉన్న భువ‌నేశ్వ‌ర్‌లో మాత్రం వంద శాతం టీకా పంపిణీ పూర్త‌వ‌డం తెలుగురాష్ట్రాల‌కు సిగ్గు చేటు. స‌మ‌ర్థ‌వంత‌మైన ముఖ్య‌మంత్రి ఉంటేనే ఇలాంటి రికార్డులు సాధ్యం. అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.   

జగన్ సర్కార్ దాదాగిరి చేస్తోంది.. కేసీఆర్ హాట్ కామెంట్స్ 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జల వివాదం ఢిల్లీకి చేరింది. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా రివర్డ్ బోర్డు మేనేజ్ మెంట్ ఆదేశాలను కూడా రెండు రాష్ట్రాలు పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. తాజాగా జల జగడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్..  కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం, ఏపీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభించే తెలంగాణ వ్య‌తిరేక వైఖ‌రి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా న‌దిపై ఏ విధంగా అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నారో ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మ‌న‌కు ఇబ్బంది జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌నం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణా జలాల వివాదంపై చర్యలు చేపడుతామని చెప్పారు కేసీఆర్. దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్టులు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్‌ ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నింటిని ఏడాదిన్నరలోపే పూర్తి చేసి తీరుతామని సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు.  నాగార్జున సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్.  ఏడాదిన్నర లోపు అన్ని లిఫ్టులను పూర్తి చేస్తామన్నారు. దళితబంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తామంటే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశారని.. రెండేళ్లు కాదు ఇరవై ఏళ్లయినా ఇవ్వలేరని అన్నారని కేసీఆర్ తెలిపారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటానని జానారెడ్డి అన్నారని.. కాని రెండేళ్లలో మేం 24 గంటల విద్యుత్‌ ఇచ్చామని చెప్పారు. జానారెడ్డి మాత్రం మాట తప్పి మొన్న కాంగ్రెస్‌ కండువా కప్పుకునే పోటీ చేశారని కేసీఆర్‌ విమర్శలు  కురిపించారు.

రాజాసింగ్ రాజీనామా!.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం..

తెలంగాణలో కొన్ని రోజులుగా ఓ నినాదం హోరెత్తుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పుడా నినాదం జోరుగా సాగుతోంది. మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటే.. మా ఎమ్మెల్యే చేయాలంటూ యావ‌త్ తెలంగాణ ప్ర‌జానికం గొంతెత్తి నిన‌దిస్తోంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక రావాలి.. ఇదే వారి ల‌క్ష్యం. ఎందుకో తెలుసా.. ఉప ఎన్నిక వ‌స్తేనైనా త‌మ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌న్నదే వాళ్ల ఆశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా ద‌ళిత బంధు అమ‌ల‌వుతుంద‌నే అత్యాశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా కులాల వారీగా క‌మ్యూనిటీ హాళ్లు.. అంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అద్దాల్లాంటి రోడ్లు.. అంద‌మైన బ‌స్టాండ్లు.. సుంద‌ర‌మైన‌ పార్కులు.. అంద‌రికీ రేష‌న్ కార్డులు.. కొత్త పింఛ‌న్లు.. గ్రామానికి లక్ష‌లు.. మండలానికి కోట్లు అంటూ నిధులు వ‌ర‌ద పారుతుంద‌న్న నమ్మకం.  మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే నినాదం ప్రజా ప్రతినిధులకు తగులుతోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళుతున్నప్పుడు.. రాజీనామా చేయాలంటూ కొన్ని వర్గాలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నాయి. మరికొందరు నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలు ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లడానికే జంకుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా దీన్నే ఆస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రెండు వేల కోట్ల కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే సంచలన ప్రకటన చేశారు. కోమటిరెడ్డి ప్రకటన అధికార పార్టీని ఇరుకున పడేసింది.  తాజాగా  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని  ప్రకటించారు. గోషామహల్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని... వారి కోరిక మేరకు రాజీనామా చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసిన వెంటనే... అసెంబ్లీ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందిస్తానని తెలిపారు. ఉపఎన్నిక వస్తే కానీ బడుగులు, రైతులపై కేసీఆర్ కు ప్రేమ రావడం లేదని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిధులను విడుదల చేసిన వెంటనే స్పీకర్ కు తన రాజీనామా లేఖ ఇస్తానని చెప్పారు.

చర్చలతో పరిష్కరించుకోండి.. కృష్ణా జల వివాదంపై సీజేఐ 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సీజేఐ  జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని చెప్పారు. జల వివాదం అంశాన్ని రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించి తాము పూర్తిగా సహకరిస్తామని... లేని పక్షంలో ఈ  పిటిషన్ ను వేర్ బెంచ్ కు బదిలీ చేస్తామని చెప్పారు. ఇరువైపు న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సమస్యను పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ వివాదంలో తాము అనవసరంగా జోక్యం చేసుకోదలుచుకోలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఏపీ సర్కార్ పిటిషన్‌ వేసింది. విచారణలో ఏపీ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. కృష్ణా నదీజలాలు, నీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని వాదించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నియంత్రణ ఉండాలని కూడా కోరారు. అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని... గెజిట్ ను ఇప్పటి నుంచే అమలు చేయాలని, కొన్ని నెలల పాటు నీటిని నష్టపోకూడదనే తాము అడుగుతున్నామని అన్నారు. త్రాగునీటి మరియు నీటిపారుదల ప్రయోజనాల కోసం తమకు న్యాయబద్ధమైన వాటాను తెలంగాణ రాష్ట్రం  నిరాకరిస్తున్నదని పిటీషన్ లో ఆరోపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్‌లో తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేయడం ద్వారా నీటి వినియోగం కారణంగా రిజర్వాయర్ పరిమాణం తీవ్రంగా క్షీణించిందని వెల్లడించింది.తెలంగాణ తరపున వాదించిన వైధ్యనాథన్.. ఏపీ వేసిన పిటిషన్ పై విచారణ అవసరం లేదని చెప్పారు.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ జారీ చేసిందన్నారు.  ఏపీ తరపున హాజరైన న్యాయవాది దుష్యంత్ దవే సమయం కావాలని కోరగా... తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

బండి యాత్ర లేన‌ట్టేనా? హైక‌మాండ్ వ‌ద్దందా? సీనియ‌ర్లు చెక్ పెట్టారా?

ఆగ‌స్టు 9న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని భాగ్య‌ల‌క్ష్మి టెంపుల్ నుంచి హుజురాబాద్ వ‌ర‌కూ మొద‌టి విడ‌త పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు బండి. ఢిల్లీ పెద్ద‌ల అనుమ‌తి తీసుకున్నారో లేదో.. సీనియ‌ర్ల‌తో చ‌ర్చించారో లేదో కానీ.. పాద‌యాత్ర షెడ్యూల్‌, రూట్‌మ్యాప్ అయితే రెడీ అయిపోయింది. ఆగ‌స్టు 9 కోసం బండి సంజ‌య్ వెయిటింగ్‌. అంత‌లోనే అధ్య‌క్షుల వారికి ఢిల్లీ నుంచి షాకింగ్ న్యూస్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. పాద‌యాత్ర లేదు.. పాడూలేదు.. పార్ల‌మెంట్ సెష‌న్‌కు ఆసాంతం అటెండ్ కావాలంటూ ఎంపీ బండి సంజ‌య్‌ని ఆదేశించింద‌ట హైక‌మాండ్‌. ఆగ‌స్టు 13న వానాకాల స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాల‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.  ఆగ‌స్టు 13 వ‌ర‌కూ అంటే.. ఆగ‌స్టు 9న ప్రారంభ‌మ‌య్యే పాద‌యాత్ర లేన‌ట్టేనా? అనే సందేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. లేన‌ట్టే.. అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. ఎందుకు లేన‌ట్టు? అని ప్ర‌శ్న‌. అందుకు అదే కార‌ణ‌మా? వారే పుల్ల‌ పెట్టారా? అనే అనుమానం. అట్నుంచి అవున‌నే స‌మాధానం. ఇలా బీజేపీలోనూ కాంగ్రెస్ త‌ర‌హా రాజ‌కీయం రంజుగా సాగుతోంది.  ఆగ‌స్టు 9 నుంచి పాద‌యాత్ర అని ఘ‌నంగా ప్ర‌క‌టించారు బండి సంజ‌య్‌. ఆ రోజు తెలీదా పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉంటాయ‌ని? అంత తెలీకుండా ఉంటారా? ఆగ‌స్టు 8న క్విట్ ఇండియా డే కాబ‌ట్టి.. ఆ మ‌ర్నాటి నుంచి పాద‌యాత్ర ప్ర‌క‌టించారో లేక‌, ఆ రోజు మంచి రోజ‌ని అనుకున్నారో కానీ, డేట్ అయితే ఫిక్స్ చేసేశారు. మ‌రి, అందుకు అధిష్టానం అనుమ‌తి తీసుకున్నారా? లేదా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. బీజేపీలో ఇలాంటి పాద‌యాత్ర‌ల క‌ల్చ‌ర్ లేదు. ఆ రోజుల్లో అద్వానీ ర‌థ‌యాత్ర మిన‌హా.. ఆ త‌ర్వాత‌ క‌మ‌ల‌నాథులు ఇలాంటి యాత్ర‌ల జోలికి పోయింది లేదు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. బీజేపీ సైద్ధాంతిక ప్రాతిప‌దిక‌న న‌డిచే పార్టీ. పార్టీ సిద్దాంతాల ఆధారంగానే ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాలి కానీ, వ్య‌క్తుల ఇమేజ్‌తో కాద‌ని బ‌లంగా న‌మ్ముతుంది. ఒక్క మోదీ విష‌యంలో మాత్రం ఆ ప్రిన్సిపుల్‌ను ప‌క్క‌న పెట్టేసింద‌నుకోండి అది వేరే విష‌యం. సో, ఆ లెక్క‌న‌.. బండి సంజ‌య్ పాద‌యాత్ర చేప‌డితే.. పార్టీకంటే ఆయ‌న‌కే ఎక్కువ ప్ర‌చారం, పాపులారిటీ వ‌స్తుంద‌ని.. ఇది పార్టీ ప్రాథ‌మిక సిద్ధాంతానికి విరుద్ధ‌మ‌ని అంటున్నారు. ఇదే పాయింట్ మీద సీనియ‌ర్లు పార్టీ పెద్ద‌ల ద‌గ్గ‌ర కొర్రీ పెట్టార‌ని అంటున్నారు.  ఇప్ప‌టికే టీబీజేపీలో వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి- రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంద‌ని చెబుతారు. ఈట‌ల విష‌యంలో అది మ‌రింత తారాస్థాయికి చేరింద‌ని.. ఈట‌లకు కిష‌న్‌రెడ్డి స‌పోర్ట్ చేస్తుండ‌గా.. బండి అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.  ఇప్ప‌టికే హుజురాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర నిర్వ‌హిస్తుండ‌గా.. బండి సంజ‌య్ చార్మినార్ నుంచి హుజురాబాద్‌కు పాద‌యాత్ర చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేది సీనియ‌ర్ల ప్ర‌శ్న‌. వేరే జిల్లాల మీదుగా పాద‌యాత్ర చేస్తే.. హుజురాబాద్‌లో ఈట‌ల‌కు ఎలా లాభిస్తుంద‌నే లాజిక్కును లాగుతున్నారు. ఇదంతా కిష‌న్‌రెడ్డి, ఈట‌ల‌కు పోటీగా.. బండి సంజ‌య్ త‌న పాపులారిటీ పెంచుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే.. పాద‌యాత్ర‌ను ప్ర‌క‌టించారంటూ అధిష్టానానికి కొంద‌రు సీనియ‌ర్లు ఫిర్యాదు చేశార‌ని అంటున్నారు. ఆ సీనియ‌ర్ల ఒత్తిడి మేర‌కే.. బండి సంజ‌య్‌ను పార్ల‌మెంట్ సెష‌న్ ముగిసే వ‌ర‌కూ ఢిల్లీలోనే ఉండాల‌ని పార్టీ ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. అదే నిజ‌మైతే.. ఆగ‌స్టు 9న బండి చేప‌ట్ట‌బోయే పాద‌యాత్ర లేన‌ట్టేనా? వాయిదా ప‌డుతుందా? మొత్తానికే ర‌ద్దు అవుతుందా? వారం రోజుల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ.. ఇలాంటి గుస‌గుస‌లే....

ప్రధానితో ఐస్ క్రీం తినబోతున్న సింధు.. తెలుగు తేజానికి పార్లమెంట్ ప్రశంసలు

ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించి చరిత్ర స్పష్టించిన  భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ లో  కాంస్య పతకం సాధించిన పీవీ సింధును పార్లమెంట్‌ ఉభయసభలు అభినందించాయి. సింధు తన అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించిందని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అభినందించారు. లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా సింధు విజయాన్ని ప్రస్తావించారు.  టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్యం సాధించడం ఆనందకరమని చెప్పారు. ఇది ఆమెకు వరుసగా రెండో ఒలింపిక్‌ పతకం.. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు ఆమే కావడం విశేషమన్నారు.  చారిత్రక విజయం అందుకున్న సింధుకు సభ సభ్యులందరి తరఫున స్పీకర్ అభినందనలు తెలిపారు. సింధు విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకని స్పీకర్‌ ఓం బిర్లా కొనియాడారు.  సింధు గురించి ఆమె తండ్రి పీవీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంస్యం గెలిచిన తన కుమార్తె ఇక ప్రధాని మోడీతో కలిసి ఐస్‌క్రీం తింటుందని చెప్పారు. ప్రధాని ప్రోత్సాహం మరువలేనిదన్నారు రమణ.  టోక్యో వెళ్లేముందు సింధును ప్రోత్సహించేందుకు.. గెలిచి రాగానే ఐస్‌క్రీం తిందామని ప్రధాని చెప్పారన్నారు.   ‘‘ప్రధాని మోదీ ఆమెకిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ‘నువ్వు వెళ్లు.. రాగానే మనిద్దరం కలిసి ఐస్‌క్రీం తిందాం’ అని ఆయన అన్నారు. ఇప్పుడు సింధు రాగానే ప్రధానిని కలిసి కచ్చితంగా ఐస్‌క్రీం సేవిస్తుంది’’ అని పీవీ రమణ అన్నారు.   వరుసగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు రమణ. ఈ దేశానికి పేరు, కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చిందన్నారు. ఆమెకు లక్ష్యంపై దృష్టి ఉంది. తనలో కసి ఉందని తెలిపారు.  సింధు ఆటను ఆస్వాదిస్తుంది.. ఆమె ఎప్పుడు ఒలింపిక్స్‌కు వెళ్లినా పతకం తీసుకొచ్చిందన్నారు. గతసారి రజతం గెలిచింది. ఈ సారి కాంస్యం కైవసం చేసుకుంది అని పీవీ రమణ ఆనందం వ్యక్తం చేశారు.     

కౌశిక్‌రెడ్డి కాక‌పోతే ఇంకెవ‌రు?హుజురాబాద్‌లో సాగ‌ర్ స్ట్రాట‌జీ?

నోముల న‌ర్సింహ‌య్య మృతితో నాగార్జున‌సాగ‌ర్‌కు ఉప ఎన్నిక వ‌చ్చింది. కారు పార్టీ టికెట్ కోసం రేసులో ప‌లువురు ఆశావ‌హులు ఉన్నారు. నోముల‌కు కొడుకు ఉన్నా.. ఆయ‌న పేరు అతిత‌క్కువ‌గా వినిపించింది. మొద‌ట్లో కోటిరెడ్డి అన్నారు. జానారెడ్డికి అత‌నే క‌రెక్ట్ కేండిడేట్ అంటూ విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.  కొన్నాళ్ల‌కి స‌డెన్‌గా గురువ‌య్య యాద‌వ్ అనే కొత్త పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. బాగా సౌండ్ పార్టీ, యాద‌వ ఓట్లు అంటూ విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి. క‌ట్‌చేస్తే.. చివ‌రాఖ‌రికి నోముల త‌న‌యుడు భ‌గ‌త్‌ టీఆర్ఎస్ అభ్య‌ర్థి కావ‌డం గెల‌వ‌డం జ‌రిగిపోయింది. తండ్రి చ‌నిపోతే కొడుక్కి టికెట్ ఇవ్వ‌డం రాజ‌కీయాల్లో సంప్ర‌దాయం. ఇంత సింపుల్ విష‌యాన్ని అంత‌లా కాంప్లికేట్ చేసి.. ఎవ‌రెవ‌రో పేర్లు ప్ర‌చారంలో ఉండేలా చేయ‌డం.. కేసీఆర్ త‌ర‌హా పాలి..ట్రిక్స్‌కి నిద‌ర్శ‌నం. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ గులాబీ బాస్ నాగార్జున సాగ‌ర్ త‌ర‌హా స్ట్రాట‌జీనే ఫాలో అవుతున్నార‌ని అంటున్నారు.  నాగార్జున‌సాగ‌ర్‌లో కోటిరెడ్డి, గురువ‌య్య యాద‌వ్‌ల పేర్లు ఉట్టి పుణ్యానికే ప్ర‌చారంలోకి రాలేదు. ఆ పేర్లను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచే లీక్ చేశారు. మీడియాలో, ప‌బ్లిక్‌లో చ‌ర్చ జ‌రిగేలా చేశారు. ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ ఆ క‌న్ఫ్యూజ‌న్‌ను కంటిన్యూ చేశారు. అదంతా ఓ ఎత్తుగ‌డ‌. అప్ప‌ట్లో టీఆర్ఎస్ నేత కోటిరెడ్డి త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్మారు. కేసీఆర్ హ్యాండిస్తే కాంగ్రెస్‌లోకి జంప్ కొట్టాల‌ని భావించారు. ఆయ‌న అలాంటి దుందుడుకు ప‌నులు చేయ‌కుండా.. కాంగ్రెస్‌లోకి మార‌కుండా.. కోటిరెడ్డికే టికెట్ వ‌స్తుందంటూ ప్ర‌చారం చేసి ఆయ‌న ముంద‌రికాళ్ల‌కు బంధం వేశారు కేసీఆర్‌. ఇక గురువ‌య్య యాద‌వ్ ఎపిసోడ్ కూడా అంతే. ఆయ‌న టీఆర్ఎస్ నాయ‌కుడు కాదు. రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా.. స్ట్రాంగ్ కేండిడేట్ అవుతార‌ని భావించిన‌ బీజేపీ.. గురువ‌య్య యాద‌వ్‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఆ విష‌యం ప‌సిగ‌ట్టిన కేసీఆర్‌.. గురువ‌య్య పువ్వు గుర్తుపై బ‌రిలో దిగితే త‌మ పార్టీకి న‌ష్టం త‌ప్ప‌ద‌ని భావించి.. గురువ‌య్య‌కే టీఆర్ఎస్ టికెట్ అంటూ లీకులిచ్చారు. నిజ‌మేన‌ని భ్ర‌మ‌ప‌డిన ఆయ‌న‌.. చివ‌రి వ‌ర‌కూ టికెట్ కోసం ఎదురుచూసి.. కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోనేలేదు. ఎలాంటి ఎక్స్‌ప‌రిమెంట్స్ చేయ‌కుండా నోముల న‌ర్సింహ‌య్య త‌న‌యుడు భ‌గ‌త్‌కే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు కేసీఆర్‌. మిగ‌తా వారంతా కేసీఆర్ ఆడిన ఆట‌లో అర‌టిపండ్లు అయ్యారు. ఇలాంటి జిత్తుల‌మారి మాస్టర్‌ప్లాన్‌లు కేసీఆర్ మైండ్‌లో అనేకం ఉంటాయంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రెష్ పాలి..ట్రిక్స్‌తో ముందుకు వ‌స్తుంటారు. ఈసారి హుజురాబాద్ ఉపఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న రాజ‌కీయ చాణ‌క్యానికి మ‌రింత ప‌దును పెడుతున్నారు. ఈట‌ల‌ను ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా అడ్డుకునేందుకు ర‌క‌ర‌కాల‌ ఎత్తుగ‌డ‌లు ర‌చిస్తున్నారు. క‌డియం శ్రీహ‌రి నుంచి కౌశిక్‌రెడ్డి వ‌ర‌కూ.. హుజురాబాద్ బ‌రిలో అనేక మంది పేర్లు వినిపించాయి. స్థానిక నేత‌ల‌తో పాటు ప‌లువురు ఇంపోర్టెడ్ లీడ‌ర్ల‌పైనా లీకులొచ్చాయి. మాజీ మంత్రి ముద్ద‌సాని కుటుంబ స‌భ్యుల పేర్లు సైతం ప్ర‌చారంలో ఉన్నాయి. ఆడియో లీక్ కాక‌పోతే కౌశిక్‌కు ఛాన్స్ వ‌చ్చేదేమో. అయితే, రెడ్డి వ‌ర్గానికి కాకుండా బీసీ అభ్య‌ర్థినే ఈట‌ల‌పైకి ప్ర‌యోగించే అవ‌కాశం ఉందంటున్నారు.  హుజురాబాద్‌లో 65వేల‌కుపైగా ఉన్న‌ ఎస్సీల‌ను ద‌ళిత‌బంధుతో గంప గుత్త‌గా త‌న ఖాతాలో వేసుకునే పాచిక బాగానే పారుతున్న‌ట్టుంది. ఇక బీసీ ప్ర‌తినిధిగా చెలామ‌ణి అవుతున్న‌ ముదిరాజ్ వ‌ర్గానికి చెందిన ఈట‌ల రాజేంద‌ర్‌కు.. బీసీ అభ్య‌ర్థితోనే చెక్ పెట్టాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌లా ఉంది. బీసీల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకే అన్న‌ట్టుగా.. ఏడేళ్లుగా అవ‌స‌రంరాని ఎల్‌.ర‌మ‌ణ‌ను హ‌డావుడిగా కారెక్కించేశారు. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు లాగిన‌ కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి.. బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని ర‌ప్పించి.. బ‌ల‌మైన నేత‌ల‌ను హుజురాబాద్‌లో మోహ‌రించారు. ఇలా.. అభ్య‌ర్థి ఎవ‌రైనా స‌రే.. గెలిపించే స‌త్తా ఉన్న బ‌ల‌మైన బ‌ల‌గాన్ని ముందే మోహ‌రించారు కేసీఆర్‌.  హుజురాబాద్‌ టీఆర్ఎస్ టికెట్ ఎవ‌రిక‌నేది చాలా ట‌ఫ్ క్వ‌శ్చ‌న్‌. ప్ర‌స్తుతానికైతే కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన ర‌వితో పాటు టీఆర్ఎస్వీ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. స్థానిక‌తే వారి అర్హ‌త‌. ఇందులో గెల్లుకే ఛాన్సెస్ ఎక్కువ అంటారు. గెల్లు శ్రీనివాస్ తండ్రి అప్ప‌ట్లోనే జెడ్పీటీసీగా ఉండేవార‌ని.. స్థానికంగా ఆయ‌న‌కు మంచి పేరు ఉండేద‌ని.. టీఆర్ఎస్ ఏర్ప‌డిన తొలినాళ్ల‌లోనే ఆయ‌న‌కు పార్టీ టికెట్ రావాల్సి ఉండ‌గా.. ఆయ‌న‌కు బ‌దులు ఈట‌ల‌ను తొలిసారి ఎమ్మెల్యే చేశార‌ని అంటారు. ఆ తండ్రి వార‌స‌త్వంతో పాటు ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న యువ‌కుడిగా, టీఆర్ఎస్వీ ప్రెసిడెంట్‌గా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను ఈట‌ల‌కు పోటీగా నిల‌బెడ‌తార‌ని అంటున్నారు. యువ‌కుడైన నోముల భ‌గ‌త్‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టుగానే.. హుజురాబాద్‌లోనూ గెల్లుకు ఛాన్స్ ఇచ్చి.. యువ నాయ‌క‌త్వంను ప్రోత్స‌హిస్తార‌ని చెబుతున్నారు.  అయితే, గెల్లు శ్రీనివాస్.. ఈట‌ల స్థాయి ఇమేజ్‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి కాలేర‌నే వారూ లేక‌పోలేదు. జానారెడ్డికి.. నోముల భ‌గ‌త్ స‌రిజోరు కాక‌పోయినా.. అక్క‌డ‌ తండ్రి చ‌నిపోయిన సానుభూతి క‌లిసొచ్చింది. ఇక్క‌డ అలాంటి అడ్వాంటేజేస్ ఏమీ లేవు. బ‌య‌టి నుంచి బ‌ల‌మైన నాయ‌కుడిని తీసుకొస్తే.. నాన్‌లోక‌ల్ సెంటిమెంట్ రాజుకుంటుంది. అది అస‌లుకే మోసం తెస్తుంది. లోక‌ల్‌గా కౌశిక్‌రెడ్డి ఒక్క‌డే స్ట్రాంగ్ కేండిడేట్ అయినా.. ఆడియో లీక్‌తో ఆ ఛాన్సూ మిస్ అయింది. ఇక మిగిలింది.. గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్ మిన‌హా టీఆర్ఎస్‌కు వేరే ఆప్ష‌న్ లేక‌పోవ‌చ్చ‌నేది కొంద‌రి మాట‌. అయితే, కేసీఆర్ మ‌దిలో ఎవ‌రున్నారో ఆయ‌న‌కు మాత్ర‌మే తెలుసు. ఎవ‌రూ ఊహించ‌ని అభ్య‌ర్థిని ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎవ‌రు పోటీ చేసినా గెలిపించుకునేలా.. ఇప్ప‌టికే క‌ద‌పాల్సిన పావుల‌న్నిటినీ క‌దిపేశారు. ఇక ఈట‌ల‌కు చెక్ చెప్ప‌డ‌మే మిగిలిందంటున్నారు. చూడాలి మ‌రి, హుజురాబాద్‌లో కారులో ఊరేగేది ఎవ‌రో..

జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఓ కీలక కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేశారు.అంతేకాదు ఆ కార్యక్రమం అమలు తీరునే ప్రశ్నించేలా అధికార పార్టీ ఎమ్మెల్యే కామెంట్ చేయడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోందని. సదరు ఎమ్మెల్యే తీరుపై సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. తాము ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కార్యక్రమాన్ని డ్యామేజీ చేశారని ఆయన మండిపడ్డారట.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిశ చట్టాన్ని అట్టహాసంగా ప్రకటించింది. సీఎం జగన్ ఎంతో పట్టుదలతో ఏపీలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు.మహిళల రక్షణ కోసం గొప్ప కార్యక్రమం చేపట్టామని సీఎం జగన్ ప్రకటించుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వం ‘దిశ’ చట్టం గురించి చెబుతున్నారు.  ఈ చట్టం యాప్ వినియోగంపై అధికారులు వివిధ రూపాల్లో ప్రచారం కల్పిస్తున్నారు. అయితే దిశ చట్టం వచ్చాకా కూడా ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు జరగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీపంలోనే వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర సంచలనం రేపింది. నెలలు గడుస్తున్నా ఈ గ్యాంగ్ రేప్ ఘటన నిందుతులు ఇంకా దొరకలేదు. దీంతో దిశ చట్టంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  అసలు అమలు కాని చట్టం గురించి ప్రచారం ఏంటని  ఆరోపిస్తున్నాయి. దీంతో యాప్ పై మరోసారి జనాలకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగానే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పోలీసులు దిశ యాప్ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ చట్టంపై సాక్ష్యాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే కీలక వ్యాఖ్యలు చేశారు. దిశ' అంటే ఏంటి నాకు తెలియదని చెప్పారు.  శ్రీకాకుళం జిల్లా రాజాంలో దిశ యాప్ పై పోలీస్ శాఖ శనివారం అవగాహన సదస్సు నిర్వహించింది. 'దిశ' డీఎస్పీ వాసుదేవ్.. చట్టంతోపాటు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగులు మాట్లాడారు. తనకు అసలు దిశ చట్టం గురించి తెలియదన్నారు. దీంతో అక్కడున్న వారు అంతా షాక్ అయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి.. అందులోనూ అసెంబ్లీలో సీఎం జగన్ ఈ 'దిశ' చట్టంను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నప్పుడు మద్దతుగా ఆమోదించిన వ్యక్తికి చట్టం గురించి తెలియకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేకే అవగాహన లేకపోతే.. జనాలకు ఎలా ఉంటుందని, ఆ యాప్ ను ఎలా వినియోగిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

అమరావతిలో మళ్లీ దొంగలు పడ్డారు.. ఇంకెన్ని రోజులీ ఘోరాలు! 

ఆంధ్రప్రదేశ్ లో దొంగలు పడ్డారు... ఇది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ కాదు.. సామాన్య జనాల నుంచి కూడా అదే అభిప్రాయం వస్తోంది. ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలే ప్రజలు ఇలా అనుకోవడానికి కారణమవుతున్నాయి. ఓ వైపు ఏపీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు అందినకాడిచి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాండ్, మైనింగ్, లిక్కర్... ఇలా ఏది వదలిపెట్టకుండా.. అన్నింట్లోనూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే రోడ్లను కూడా దొంగిలించే వరకు.. అవును మీరు వింటున్నది నిజమే. అమరావతిలో రాత్రికి రాత్రే రోడ్లు మాయమవుతున్నాయి.  అమరావతిలో రోడ్ల తవ్వకం యథేచ్చగా కొనసాగుతోంది. రోడ్లను తవ్వేసి కంకర, ఇసుకను ఎత్తుకెళ్తున్నారు. పది రోజుల క్రితం ఉద్దండరాయునిపాలెంలో రోడ్డును తవ్వేసి కంకరను తరలించిన ఘటనను మర్చిపోకముందే.. తాజాగా మోదుగులింగాయపాలెంలో రోడ్డును తవ్వేశారు. గ్రామానికి ఉత్తరంగా ఉన్న సీడ్ యాక్సెస్ పక్కన ఉన్న రోడ్డును తవ్వేసిన గుర్తు తెలియని వ్యక్తులు కంకరను తరలించారు. నాలుగు అడుగుల లోతు, 200 మీటర్ల పొడవున రోడ్డును తవ్వేసిన దుండగులు దాదాపు 100 టిప్పర్ల కంకరను తరలించి ఉంటారని భావిస్తున్నారు. పెద్దగా జనసంచారం ఉండని ఈ ప్రాంతంలో టిప్పర్లు, జేసీబీలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రోడ్డును తవ్వేసిన విషయం తెలిసిన వెంటనే అమరావతి దళిత జేఏసీ నాయకులు, వెలగపూడి రైతులు రోడ్డు తవ్వేసిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే రోడ్ల తవ్వకాలు జరుగుతున్నాయని  ఆరోపించారు. రోడ్లను ధ్వంసం చేస్తూ రాజధాని అమరావతి నామరూపాల్లేకుండా చేస్తున్నారని దళిత జేఏసీ నేతలు మండిపడ్డారు. రోడ్ల తవ్వకం, నిర్మాణ సామగ్రి చోరీపై న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.   అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతి ప్రాంతం.. జగన్ రెడ్డి పాలనలో శిథిలమైన భవనంలా మారింది. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే అమరావతిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లంతా మెటీరియల్ ను రోడ్డు మీదే వేసుకుంటారు కాబట్టి అదే పని చేశారు. ఇసుక, కంకర, స్టీల్ అన్నీ సైట్ల పక్కనే ఉన్నాయి. సడెన్ గా జగన్ ఆ నిర్మాణాలకు పేమెంట్స్ నిలిపేశారు.. మళ్లీ చేస్తారో చేయరో చెప్పలేదు. దీంతో లేబర్ అంతా వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు కూడా వేరే పనులు చూసుకున్నారు.  పాలకుడే అమరావతి నాశనం కోరుకుంటుండటంతో ఇక దొంగలకు పని ఈజీగా మారిపోయిందని అంటున్నారు. అందుకే రాత్రికి రాత్రే రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఏకంగా వేసిన రోడ్డును తవ్వి మరీ కంకర ఎత్తుకుపోతున్నారు. దొంగలు పడి ఎత్తుకుపోతుంటే... ఆ దొంగలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేవలం అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులను ఆపటానికో, కొట్టడానికో.. అరెస్టు చేయడానికో తప్ప.. వేరే ఏ పని మీద అడుగు పెట్టరు. వైసీపీ వారు చేసే అక్రమాలపై ఫిర్యాదులు వస్తే అసలే పట్టించుకోరు.  అమరావతిలో రోడ్డు తవ్వి కంకర ఎత్తుకుపోయారంటే.. ఎత్తుకుపోయినా ఎవరూ పట్టించుకోలేదదంటే..ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి..   

కేసీఆర్ వ్యూహాలకు ఈటల విలవిల.. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో, ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఏమవుతుందో  ఏమో కానీ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, రోజుకో ఎత్తుతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పటికిప్పుదు ఎన్నికలు జరిగితే తెరాస అభ్యర్ధి (ఎవరైనా సరే) ఓడిపోతారు, ఎన్నికలు ఎంత ఆలస్యంగా జరిగితే, తెరాసకు అంత మేలు జరుగుతుంది, ఇది ఎవరో దారినపోయే దానయ్య అంటున్నమాట కాదు. ముఖ్యమంత్రి, చాలా గట్టిగా విశ్వసించే సర్వే సంస్థలు జనం నాడి పట్టి తేల్చిన పక్కా లెక్క.   ఎన్నికలను వాయిదా వేయడం రాష్ట్రం ప్రభుత్వం చేతుల్లో ఉండే వ్యవహారం కాదు. ఎన్నికల షెడ్యూలు ఖరారు చేసే అధికారం కేంద్ర ఎన్నికలసంఘానికి మాత్రమే ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉంటుంది. అయితే, ఫలానా సమయంలో ఎన్నికల నిర్వాహణకు స్థానిక పరిస్థితులు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది, అనే విషయంలో  కేంద్ర ఎన్నికల  సంఘం  రాష్ట్ర ప్రభుత్వ సూచనలు తీసుకుంటే తీసుకోవచ్చును. అయితే, ఆ సూచనలు తప్పక పాటించాలనే నియమమ ఏదీ లేదు. అయినా, ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో కేంద్ర ఎన్నికల సంఘం ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం సాహసమే అవుతుంది. అలాంటి సాహసం ఎన్నికల సంఘం చేయక పోవచ్చునని, అంటున్నారు. ఇప్పటికీ, కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకున్న ఎన్నికల సంఘం తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు.    జూన్ నెలలో సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం, కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పరిస్థితి ఏమిటని,రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇదే అదనుగా, కేసీఆర్ ప్రభుత్వం,మండలి ఎన్నికలకు పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని, వెంటనే సమాదానం ఇచ్చింది. అయితే రాష్ట్రంలో పరిస్థతి చూస్తే ఎవరికైనా, కేవలం 116 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే మండలి ఎన్నికలు కాదు, సాధారణ ఎన్నికలు అయినా జరిపించేందుకు ఏ మాత్రం అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదనిపిస్తుంది. అలాగని, రాష్ట్రానికి కరోనా ముప్పు తొలిగిపోయిందని కాదు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, పాదయాత్రలు ఒకటని కాదు, రాజకీయ కార్యకలాపాలు అన్నీ, మాములుగా జరిగి పోతున్నప్పుడు, పెళ్ళిళ్ళు, పేరంటాలు వంటి సామాజిక కార్యకలాపాలు, బోనాల వేడుకలు వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు, బార్లు, సినిమాలు వంటి వినోద, వికార కార్యక్రమాలు అన్నీ యథావిధిగా జరుగుతున్నప్పుడు, ఓ వందమంది ఎమ్మెల్యేలు వచ్చి ఓటేసిపోయే మండలి ఎన్నికలు జరిపేందుకు కరోనా అడ్డు వస్తుందా అన్నదే, సామాన్య జనం వ్యక్తపరుస్తున్న చిరు సందేహం.  మండలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది, పోయేది ఉండదు. అదీ గాక, ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో అధికారపార్టీ గెలుపు ముందుగానే ఖరారైపోయింది. సో ... మండలి ఎన్నికల ఎప్పుడు జరిగినా ఒకటే.కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక అలాకాదు. ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు జరిగి, అధికార పార్టీ ఓడిపోతే, తట్టుకోవడం కష్టం. అందుకే, ఈ వంకన హుజురాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగానే మండలి ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేవని,అధికారుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశారు. అయితే అదేమీ రహస్యం కాదు. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. మరోవంక కేసీఆర్ తమ ఎజెండాను ఇంచక్కా ముదుకు తీసుకు పోతున్నారు. దళిత బంధును తెరమీదకు తెచ్చిన కేసీఆర్, అవసరం అయితే, ఆ ఉచ్చులోంచి తప్పించుకునే వ్యూహాలకు కూడా పదును పెడుతున్నారు. పులి మీద స్వారీ చేస్తూ కూడా పట్టుతప్పకుండా బాలన్స్ చేసుకుంటున్నారు. అదీ ఎదురు తిరిగితే దళిత ఓటును చెల్చేందుకు దళిత దొర, ఐపీఎస్ ను సిద్ధం చేస్తున్నారు. హుజురాబాద్ టికెట్ విషయంలోనూ కేసీఆర్ వ్యుహత్మకంగానే పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి, ఈ మధ్యనే తెరాసలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో, ఒకే దెబ్బకు రెండు పిట్టలను బుట్టలో వేసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓటును, కొంత తమ వైపుకు తిప్పుకున్నారు. అలాగే, ఇటీవల తెరాసలో చేరిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణతో పాటుగా, కాషాయ గూటినుంచి గులాబీ గూటికి చేరిన మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి, ఇంకా కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నా, ఈటల ప్రధాన బలం అయిన బీసీల నుంచే తెరాస అభ్యర్ధిని ఎంపిక చేసీ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఎల్ . రమణతో పాటుగా  టీఆర్‌‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌‌, జమ్మికుంట మాజీ సర్పంచ్‌‌ పొనగంటి మల్లయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.  హుజూరాబాద్‌‌  ఉప ఎన్నికను చావో రేవో సమస్యగా తీసుకున్న కేసీఆర్‌‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎక్కడ ఎలా ఎవరిని దెబ్బ కొడతారో ఉహించడం అయ్యే పనికాదు. ఎన్నికల ప్రకటనకు ఎటూ కొంత కాలం ఉంది కాబట్టి, ఈలోగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టి ముందుగానే తమ అభ్యర్ధిని మంత్రివర్గంలోకి తీసుకున్నా తీసుకుంటారని, ఆ విధంగా  మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి మద్య తూకం తమవైపుకు మొగ్గేలా చేసినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. ఏదైనా ఈటలను ఓడించడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమని అందుకోసం ఏమైనా చేస్తారని అంటున్నారు.

కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి?.. ఈట‌ల‌, రేవంత్‌ల‌కు చెక్ పెట్ట‌డానికేనా?

పాడె కౌశిక్‌రెడ్డి. ఉద్య‌మంలో పాల్గొన‌లేదు. కేసీఆర్ వెంట తిర‌గ‌లేదు. మొన్న‌టి వ‌ర‌కూ కారు పార్టీలోనూ లేడు. ఒక్క‌సారి కూడా ఎమ్మెల్యేగా గెల‌వ‌లేదు. అయినా, అనూహ్యంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌రించింది. అదికూడా గ‌వ‌ర్న‌ర్ కోటాలో. మాజీ క్రికెట‌ర్ అయిన కౌశిక్‌కి నామినేటెడ్ ప్ర‌మోష‌న్ ల‌భించింది. వ‌డ్డించే వాడు మ‌న‌ వాడైతే ఎలాంటి ప‌ద‌వైనా ఇలానే వెతుక్కుంటూ వ‌స్తుంది. ఏళ్లుగా గులాబీబాస్‌కు గులాంగిరీ చేస్తూ.. కారును ముందుకు తోస్తున్న అనేక‌మంది నాయ‌కులు ఎమ్మెల్సీ కోసం ఆశ‌గా ఎదురుచూస్తుంటే.. నిన్న‌గాక మొన్న గులాబీ కండువా క‌ప్పుకున్న కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేస్తుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఇలాంటివి రాజ‌కీయాల్లోనే సాధ్యం. కేసీఆర్ మార్క్ పాలిటిక్స్‌కు నిద‌ర్శ‌నం.  అంద‌రికీ తెలిసిన విష‌య‌మే కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎందుకు ఎంపిక‌య్యారో. ఆయ‌న ఆడిన‌ క్రికెట్‌కు గుర్తింపుగా కాకుండా.. హుజురాబాద్‌లో ఆడ‌బోయే పొలిటిక‌ల్ మ్యాచ్‌కు ఆల్‌రౌండ‌ర్‌గా మారుతాడ‌నే చిన్న‌వాడైన‌ కౌశిక్‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపించారు. త‌న‌కు బ‌ద్ధ‌శ‌త్రువుగా మారిన‌ ఈట‌ల‌కు ఎలాగైన చెక్ పెట్టేందుకు.. ఆయ‌న‌కు బ‌ద్ద‌శ‌త్రువైన కౌశిక్‌కు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు లాగారు. ఎమ్మెల్యే టికెటే ఇచ్చే వారేమో కానీ.. పార్టీలో చేర‌క‌ముందే లీకైనా ఆడియో టేపుల వ‌ల్ల ఎమ్మెల్యే పోయి ఎమ్మెల్సీ వ‌చ్చిందంటున్నారు. ఏదైతేనేం.. హౌజ్‌లో అధ్య‌క్ష అనే అవ‌కాశం వ‌చ్చిందంటూ.. పాకిస్తాన్ మీద‌ సెంచ‌రీ కొట్టినంత ఖుషీ అవుతున్నార‌ట కౌశిక్‌రెడ్డి. ఇప్ప‌టికే ఈట‌ల ద‌య‌వ‌ల్ల త‌మ‌కు 10 ల‌క్ష‌లు రాబోతున్నందుకు ద‌ళితులంతా సంతోషంగా ఉన్న‌ట్టే.. అదే ఈట‌ల వ‌ల్ల త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌చ్చినందుకు రెడ్డి గారు కూడా తెగ సంబ‌ర‌ప‌డుతుండొచ్చు. కౌశిక్‌రెడ్డికి రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వి వ‌స్తుందంటూ ఆయ‌న పార్టీలో చేరేట‌ప్పుడే సీఎం కేసీఆర్ ఇషారా ఇచ్చేశారు. మిగ‌తా లీడ‌ర్ల మాదిరి పార్టీలో చేరాక ప‌క్క‌న పెట్టేయ‌కుండా.. నెల కూడా గ‌డ‌వ‌క‌ముందే ఎమ్మెల్సీని చేసేశారు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈట‌ల మీద పోటీ చేసే టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుస్తారో లేరో తెలీదు. ఒక‌వేళ ఓడిపోతే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఓట‌ర్లు అనుకొనే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే, ముందే కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసేసి.. వారి ప్రాంతానికో ప్ర‌జాప్ర‌తినిధిని అప్ప‌టిక‌ప్పుడు రెడీ చేశారని అంటున్నారు. ఈ అభిమానంతో ఆయ‌న మ‌రింత క‌ష్ట‌ప‌డి ఈట‌ల‌ను ఓడించే ప్ర‌య‌త్నం గ‌ట్టిగా చేస్తారు. ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా టీఆర్ఎస్‌కు అనుకూలంగా స‌మీక‌రిస్తారు. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వితో.. ప‌బ్లిక్‌లో కూడా కేసీఆర్‌ను న‌మ్మిన వారికి అన్యాయం జ‌ర‌గ‌ద‌నే మెసేజ్ వెళ్తుంది. ఈట‌ల అన్యాయంగా వ్య‌వ‌హ‌రించాడు కాబ‌ట్టే.. ఆయ‌న్ను ప‌క్క‌న‌పెట్టార‌నే వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుతుందని.. ఇలా కేసీఆర్ ఒక్క పోస్ట్‌తో రెండు ప్ర‌యోజ‌నాలు పొందే స్కెచ్ వేశార‌ని అంటున్నారు.  మ‌రోవైపు, కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీతోనే స‌రిపెట్ట‌ర‌ని.. ముందుముందు మంత్రిని కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయ‌ని అంటున్నారు. అందుకు కూడా మ‌ళ్లీ ఈట‌ల రాజేంద‌రే కార‌ణం. ఎందుకంటే, హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు ఈట‌ల రూపంలో ఏళ్లుగా ఓ మంత్రి అందుబాటులో ఉన్నారు. ఎంత డ‌మ్మీ అయినా.. ఎమ్మెల్యే కంటే మినిస్ట‌ర్‌కు కాస్త ప‌లుకుబ‌డి, ప‌ర‌ప‌తి ఎక్కువ కాబ‌ట్టి.. ఆయ‌న‌తో మ‌రిన్ని ప‌నులు ఎక్కువ అవుతాయి కాబ‌ట్టి.. ప్ర‌జ‌లకు త‌మ ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఉండాల‌నే కోరిక ఉంటుంది. అసంతృప్తిని కూడా లేకుండా చేసేందుకు.. త్వ‌ర‌లోనే కౌశిక్‌రెడ్డికి మంత్రిప‌ద‌వి కూడా వ‌స్తుంద‌ని అప్పుడే ప్ర‌చారం మొద‌లైపోయింది.  ఎప్ప‌టినుంచో కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రు మంత్రులు రేవంత్‌రెడ్డి, ఈట‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని కేసీఆర్ ద‌గ్గ‌ర స‌మాచారం ఉంది. ఇటీవ‌ల మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి మైసూర్ రిసార్ట్ ఎపిసోడ్ క‌ల‌క‌లం రేపింది. మ‌రోవైపు, ఇటీవ‌ల ఎమ్మెల్సీగా గెలిచిన ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, వాణీదేవిల‌ను కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఆ మార్పుల్లో భాగంగా.. యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ అయిన కౌశిక్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తార‌ని అంటున్నారు. పెద్ద నోరేసుకొని, దూకుడుగా ఉండే కౌశిక్‌రెడ్డిని.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపైకి వ‌దులుతార‌ని చెబుతున్నారు. ఇలా కేసీఆర్ మొద‌టిరోజే చెప్పిన‌ట్టు.. కౌశిక్‌రెడ్డిని రాష్ట్రస్థాయిలో కావ‌ల‌సినంత‌గా వాడేసుకుంటార‌ని అంటున్నారు.   

50 వేల రుణం మాఫీ.. రైతులకు సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. హుజురాబాద్ ఎన్నికో మరేదో కారణమో కాని... పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలకు ఆయుధంగా మారిన  రైతు రుణమాఫీపైనా కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ కేబినెట్. ఈ ఏడాది రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి నెలాఖరులోపు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.సర్కార్ తాజా నిర్ణయం రుణమాఫీ నిర్ణయంతో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం దక్కనుంది. 2108 ఎన్నికల సమయంలో లక్ష రుపాయల రైతు రుణ మాఫీ ప్రకటించారు కేసీఆర్. కాని అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా రుణమాఫీ అమలు చేయలేదు. 25 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇటీవల కాలంలో దూకుడు పెంచిన ప్రతిపక్షాలు రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాయి. రైతుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది. దీంతో రైతు రుణమాఫీ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, రుణమాఫీ, ఇతర వ్యవసాయ అంశాలతోపాటు పత్తిసాగుపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ పత్తికి ప్రత్యేక డిమాండ్‌ ఉన్న దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచాలని, ఇందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కింద ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఈ ఆసుపత్రుల సత్వర నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

పీవీ సింధుకు కాంస్యం.. చరిత్ర స్పష్టించిన తెలుగు తేజం

తెలుగు తేజం పీవీ సింధు మరోసారి మెరిసింది. అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. టోక్సో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సింగిల్స్  విభాగంలో కాంస్య పతకం సాధించింది. సెమీస్ లో ఓడిపోయిన సింధు.. ఆదివారం జరిగిన కాంస్యం పతకం పోరులో మాత్రం అద్భుతంగా ఆడి విజయం సాధించింది. భారతదేశానికి మరో మెడల్ అందించింది.  కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్ బింగ్ జియావిపై వరుస సెట్లలో విజయం సాధించింది పీవీ సింధు. మ్యాచ్ ఆరంభం నుంచి అదరగొట్టిన తెలుగు తేజం తొలి సెట్ ను 21-13 తేడాతో ఈజీగా గెలుచుకుంది. రెండో సెట్ లోనూ అదే దూకుడు కొనసాగించి మ్యాచ్ ను కైవసం చేసుకుంది. భారత్ కు కాంస్య పతకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించి సంచలనం స్పష్టించిన పీవీ సింధు.. వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ మెడల్ సాధించి రికార్డు స్పష్టించింది.