వైసీపీకి ఆడపిల్లల ఉసురు!.. జగన్ సర్కారుపై లోకేశ్ మండిపాటు..
posted on Aug 20, 2021 @ 3:39PM
ఏపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ సర్కారు వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నారు. గుంటూరులో రమ్య నేలకొరిగితే.. అదే గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి అఘాయిత్యానికి గురైందన్నారు. తాజాగా, విజయనగరం జిల్లా చౌడవాడలో ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగులబెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేశ్.
లేని దిశ చట్టం.. రక్షించలేని దిశ యాప్ పేరుతో ప్రభుత్వం ఆర్బాటంగా ప్రచారం చేయడం సిగ్గు చేటని విమర్శించారు లోకేశ్. నిందితుల్ని పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆడపిల్లల ఉసురు తగిలితే వైసీపీకి, ఈ రాష్ట్రానికి మంచిది కాదని లోకేశ్ హితవు పలికారు.
ఏపీలో వరుసగా అమానవీయ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని లోకేశ్ మండిపడ్డారు. సీఎం ఇంటికి సమీపంలో ఉన్నవారూ అత్యాచారానికి గురయ్యారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేదని, అంతా భయం భయంగా బతుకుతున్నారని మండిపడ్డారు నారా లోకేశ్.