జనం బలంతో పునర్జీవనం.. ఇదేనా రేవంత్ రెడ్డి వ్యూహం?
posted on Aug 20, 2021 @ 9:32AM
రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది ఊపొచ్చింది. మొన్న ఇంద్రవెల్లి, నిన్న రావిర్యాల, దళిత గిరిజన గర్జన సభలు, గ్రాండ్ .. గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దీంతో పార్టీ క్యాడర్, నాయకులలో జోష్ మరింతగా ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీపై రేవంత్ పట్టు పెరుగతున్నకొద్దీ,అధికార తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరు అన్న ప్రశ్న పక్కకు పోయింది. తెరాసకు ప్రత్యాన్మాయం కాంగ్రెస్, కేసీఆర్’కు ప్రత్యర్ధి రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం బలపడుతోంది.
రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి ఏమి మాట్లాడారు అనేది పక్కన పెట్టినా, కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన ప్రతి స్పందన, ఎవరో అన్నట్లుగా రేపటి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది. ఏదో అనూహ్య పరిణామం జరిగితే తప్పించి, ఇక రేవంత్ సారధ్యంలో కాంగ్రెస్ దూకుడు ఆపడం కేసీఆర్ కే కాదు కమల దళానికి కూడా సాద్యం కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీలో గొప్ప జోష్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఏ గెలుపు లేక పోయినా రెంత్ కారణంగా అలాంటి జోష్ వచ్చింది. అయితే బీజేపీలో వచ్చిన జోష్ అట్టే కాలం నిలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీటు కోల్పోవాదంతో పాటుగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో డిపాజిట్ కోల్పోవడంతో ఎన్నికల గెలుపుతో వచ్చిన జోష్ ఎన్నికల ఓటమితోనే కొట్టుకు పోయింది.
కాంగ్రెస్ విషయానికి వస్తే, 2014 లోనే పార్టీ పడకేసింది. పార్టీ మీద ఉన్న అభిమానంతో , 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజులు రెండుసార్లూ ఒకటి రెండు సీట్లు అటూ ఇటుగా 20 వరకు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించినా, పార్టీ, నాయకులు ఆ ప్రజాభిమానాన్ని నిలుపుకోలేక పోయారు. ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన శాసనసభ్యుల్లో సగం మందికి పైగా అధికార పార్టీలోకి దూకేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా వృధా, అనే అభిప్రాయం బలపడింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. అందుకే, దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. చివరకు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా సాగర్ ఉపఎన్నికలో, ఓడిపోయారు. నిజానికి, ఒక విధంగా అస్తిత్వ సంక్షోభంలో పడిన కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం అంటే, అది అయ్యేది కాదు, పొయ్యేది కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే, అనేక మంది నాయకులు ఇతర పార్టీలలోకి వెళ్లి పోయారు. అలా వెళ్ళలేని వారు, అజ్ఞాతంలోలి వెళ్లి పోయారు.
ఇలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు పుచ్చుకున్న రేవంత్ రెడ్డి, పోటీ చేసినా ఖాయంగా ఓడి పోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే, పార్టీని జనంలోకి తీసుకుపోయి, తెరాసకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యాన్మాయం అన్న అభిప్రాయం జనం నోట అనిపించుకునేదుకు సభలు సమావేశాలపై దృష్టి పెట్టారని పరిశీలకులకు భావిస్తున్నారు.ఇందులో భాగంగా నిర్వహించిన ఇంద్రవెల్లి, రావిర్యాల సభలు సక్సెస్ అవడంతో మరింతగా జనంలోకి వెళ్లేందుకు, మరిన్ని కార్యక్రమాలకు హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు పార్లమెంటు స్థానాల పరిధిలోనే నిర్వహిస్తున్న సభలను ఇక పై అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా శాసన సభ నియోక వర్గాల వారీగా నిరసన దీక్షలు చేయబోతున్నట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు త్వరలో 48 గంటల దీక్షకు టీపీసీసీ సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు.
కాగా ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు రేవంత్ రెడ్డి దూకుడులోనూ ఒక వ్యూహం, ముందు చూపు ఉన్నాయని అంటున్నారు. వచ్చి పోయే ఉపఎన్నికల కంటే, మరో రెండేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించి పార్టీని జనంలోకి తీసుకుపోయేందుకు రేవంత్ రెడ్డి చూపుతున్నా చొరవ.. ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనంగానూ పరిశీలకులు భావిస్తున్నారు.