నోట్ల కట్టలు కాదు కట్టు బట్టలతో పారిపోయా.. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ వస్తానంటున్న ఘనీ
posted on Aug 19, 2021 @ 4:43PM
ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షడు ఆష్రఫ్ ఘనీ.. దేశం విడిచి పారిపోయిన 3 రోజుల తరువాత మొదటిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడిన వీడియోను పలు అరబ్ చానల్స్ ప్రసారం చేశాయి. తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకుంటూ ఉండగానే ఘనీ అధ్యక్ష భవనం ఖాళీ చేసి ఎవరి కంటా పడకుండా పారిపోయారు. అతను కిర్గిజిస్తాన్, తుర్కిమెనిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కడికో పారిపోయి ఉంటాడని అనుమానించారు. అయితే తాను అరబ్ ఎమిరేట్స్ లో తల దాచుకున్నానని తనకుతానుగా రివీల్ చేశారు. తాను ఎందుకు ఆఫ్ఘనిస్థాన్ విడిచి వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నారు. దేశం మీద జరిగిన దురాక్రమణను ఖండిస్తూ దేశ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
నేను చెప్పులు విప్పి, కనీసం షూ వేసుకునే టైమ్ కూడా లేదని, అలాంటి పరిస్థితుల్లో తాను కాబూల్ ను వీడాల్సి వచ్చిందని చెప్పారు. తాను భారీ ఎత్తున సొమ్ముతో ఉడాయించినట్లు వచ్చిన పుకార్లను ఎవరూ నమ్మవద్దని, గొప్పనైన ఆఫ్ఘనిస్థాన్ సంస్కృతిని మలినం కాకుండా చూసేందుకు, అరాచక శక్తుల మీద తిరుగుబాటు చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ వస్తానని నమ్మబలుకుతున్న ఘనీ.. అందుకోసం తాను సంప్రదింపుల్లో మునిగిపోయినట్లు చెప్పడం ఆసక్తి రేపుతోంది. పాతికేళ్లలో రెండోసారి కాబూల్ ను కబ్జా చేసిన తాలిబన్లు ఈసారి రెచ్చిపోయిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్తుందో, పాలనను ఎలా ఆర్డర్ లో పెడతారో అర్థం కాని పరిస్థితులు పేరుకుపోయిన క్రమంలో ఘనీ సంప్రదింపుల ముచ్చట... మరేదైనా విదేశీ శక్తుల అండకోసం ప్రయత్నిస్తున్నాడా అన్న అనుమానాలకు తావిస్తోంది.
తాను అక్కడే ఉంటే గనక కొత్తగా ఎలక్టయ్యే అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా ఉరి తీసి ఉండేవారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అల్లకల్లోలానికి కారకులయ్యేవారని.. అయితే అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు, ఆ ఉపద్రవం నుంచి ప్రజలను కాపాడేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో యూఏఈ వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు ఘనీ. ఆఫ్ఘన్ ప్రజల మర్యాదను, వారికి దక్కాల్సిన న్యాయాన్ని అందించేందుకు శతవిధాలా కృషి చేస్తున్నట్లు యూఏఈ నుంచి వాయిస్ వినిపించారు. తన పాలనలో ఆఫ్ఘన్ సాధించిన అభివృద్ధిని కాపాడుకోవాలని, అరాచక శక్తుల చేతుల్లోకి దేశ వారసత్వాన్ని వెళ్లకుండా చూడాలని, ఇందుకోసం ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ప్రజలకు సేవలందిస్తూ గౌరవ ప్రదంగా చనిపోవడానికి తానెప్పుడూ భయపడేవాణ్ని కానని, కేవలం ప్రపంచంలో ఆఫ్ఘనిస్థాన్ గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే కాబూల్ ను వీడినట్లు చెప్పుకొచ్చారు. ఖజానాలోని సొమ్మంతా తీసుకొని వచ్చినట్లు వచ్చిన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఘనీ స్టేట్ మెంట్ మీద నెటిజన్ల నుంచి వ్యతిరేక కామెంట్లే ఎక్కువొస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ ముస్లిం సమాజం తాలిబన్లను స్వాగతిస్తుండగా... ఘనీ చెబుతున్నవన్నీ కల్లబొల్లి కబుర్లంటూ ట్రోల్ చేస్తున్నారు. ఘనీ 169 మిలియన్ డాలర్ల సొమ్ముతో ఉడాయించాడని, సూట్ కేసుల నుండా కరెన్సీ కట్టలు సర్దుకొని తాలిబన్లకు చిక్కకుండా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయితే ఆయన ఫస్ట్ వాయిస్ అనేది అత్యంత బలహీనంగా ఉందని, మళ్లీ కాబూల్ కు వెళ్తే ఘనీని కాల్చి చంపడమో, ఉరి తీయడమో ఖాయమని, అమెరికా తొత్తు అయిన ఈ ముసలి వ్యక్తికి చావే సరైన శిక్ష అంటూ అత్యధిక మంది ముస్లింలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఘనీ నిజంగా ఆఫ్ఘనిస్థాన్ రావడం సాధ్యమేనా.. తాను అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నదాంట్లో ఎంతవరకు వాస్తవముంది... అసలు అమెరికా, నాటో దళాలే వెనుదిరిగిపోతే ఒంటరి ఘనీ ఏం చేస్తాడన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిమీద క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.