కొవిడ్ టీకా సురక్షితమే.. కానీ పూర్తి రక్షణ కాదు..
posted on Aug 20, 2021 @ 1:08PM
దేశంలో కరోనా ముప్పు చాలా వరకు తగ్గింది. తెలంగాణ సహా చలా వరకు రాష్త్రాలలో సెకండ్ వేవ్ సర్దు మణిగింది. మరోవంక, వాక్సినేషన్, టీకాల ప్రక్రియ ఆరంభ అవరోధాలను దాటి, చకచకా ముందకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి నాటికి, అందరికీ టీకా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో, దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం అమెరికా సహా ఇతర దేశాలపై ఉన్నంతగా మన దేశంఫై ఉండదని నిపుణులు కొందరు అంటున్నారు.
దేశానికీ మహామ్మారి ముప్పు ఇంకా తోలిగిపోలేదని, ఎప్పుడు ఏ రూపంలో ఎటు నుంచి థర్డ్ వేవ్ ఎటాక్ చేస్తుందో చెప్పే పరిస్థితి లేదనే హెచ్చరికలు ఇటు అధికార వర్గాల నుంచి అటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వస్తూనే ఉన్నాయి. కరోనాకు మందు లేదు, వాక్సిన్ ఒక్కటే రక్ష’ అని ప్రభుత్వాలు, వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు. ఉపేక్ష వద్దు. ప్రతి ఒక్కరు బాధ్యతగా టీకా వేయించుకోండి ... అని ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారిక సమాచారం మేరకు, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికీ కూడా వైరస్ సోకుతోందని తెలుస్తోంది. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 87 వేల మందికి కరోనా సోకిందని, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులే చెబుతున్నారు. అందులో ఒక్క కేరళలోనే దాదాపు 46 శాతం మంది వరకు ఉన్నారు. ఇక ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారిలో, అది కూడా ఒక్క కేరళలో 80 వేల మందికి కరోనా సోకింది.
ఇలా వాక్సిన్ తీసుకున్నవారిలోనూ కరోనా లక్షణాలు కనిపించడం, కొందరికి కొవిడ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశగా అధికారులు భావిస్తున్నారు. దేశం మొత్తంలో ఇంతవరకు, 56 కోట్లకు పైగా, వాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. కాగా, 44కోట్ల మందికి ఫస్ట్ డోసు, 12 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. మొత్తంగా చూస్తే, దేశంలో టీకాలు తీసుకున్న వారిలో 2.6 లక్షల మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అందులో ఫస్ట్ డోసు మాత్రమే తీసుకున్నవారిలో, 1.70 లక్షల మందికి, సెకండ్ డోస్ తీసుకున్నవారిలో 87 వేల మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి ఒక్క కేరళలో మాత్రమే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పాటుగా దేశం అంతటా కూడా అప్రమత్తత కొనసాగవలసిందే అని కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్రాలను హెచ్చరించింది.
ఇకా దేశంలో కరోనా తాజా సమాచారం గమనిస్తే, ఇటీవల కాలంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. నిన్న (గురువారం) 36 వేల కేసులు 500కు పైగా మరణాలు సంభవించాయని ఈరోజు (శుక్రవారం) కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.తాజాగా 18,86,271 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 36,571 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్క కేరళలోనే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.గడచిన 24 గంటల వ్యవధిలో 540 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, మొత్తం కేసులు 3.23 కోట్లకు, మరణాల సంఖ్య 4,33,589కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3.63లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 1.12 శాతానికి తగ్గింది. కొవిడ్ రికవరీ రేటు 97.54 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 36 వేల మంది కోలుకోగా, దేశం మొత్తంలో ఇంతవరాకు కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.15 కోట్లుకు చేరింది. మరో వంక జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం ఈ మధ్య వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57 కోట్ల మార్కును దాటింది. గురువరం ఒక్కరోజునే 54.7లక్షల మంది టీకా వేయించుకున్నారు.