తాలిబన్ల సీక్రెట్ మీటింగ్.. ఇక అరాచకమేనా?
posted on Aug 19, 2021 @ 6:45PM
ఆఫ్ఘనిస్థాన్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అఫ్గానిస్తాన్‌లోని అనేక నగరాలు, పట్టణాలలోస్థానిక ప్రజలు జాతీయ జెండాలతో ర్యాలీలు తీశారు. జలాలాబాద్‌లో నిరసనకారులు.. తాలిబాన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరోవైపు కాబూల్ ను క్యాప్చర్ చేసిన మరుక్షణం నుంచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్ల అధినాయకత్వం రహస్య మంతనాల్లో మునిగిపోయింది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ అజ్ఞాత ప్రదేశంలో అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలకమైన సమాచారం పంచుకున్నారు. రెండురోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ బాహ్య ప్రపంచంలోకి రాావడానికి 48 గంటల సమయం తీసుకుంది. ఆ సమాచారం ప్రకారం తాలిబాన్ సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా.. ఆఫ్ఘనిస్థాన్ లో అడ్మినిస్ట్రేషన్ ను పర్యవేక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. దాదాపుగా ఇదే ఫైనల్ కావచ్చని తాలిబన్ అధికార ప్రతినిధి జబిఉల్లా ముజాహిద్ ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు. పరిపాలనపరంగా ఆఫ్ఘనిస్థాన్ కు నిర్ణయించిన పేరును, దాని ఎంబ్లెమ్ ను కూడా ఆయన విడుదల చేశాడు. దాని ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ ను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ (ఐ.ఇ.ఎ.) గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్లో పరిపాలన అనేది ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థలోకి మారుతోంది కాబట్టి.. అది కూడా అకస్మాత్తుగా చేతులు మారుతున్న అధికారం ఎలాంటి అనూహ్యమైన పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘన్లో ఓవరాల్ ఇంచార్జీ ఎవరు.. అధ్యక్షుడిగా ఎవరుంటారు... పరిపాలనను ఎలా నిర్వహిస్తారు... ఉద్యోగులను ఎలా రిక్రూట్ చేస్తారు.. తక్షణం కావాల్సిన సైన్యాన్ని ఎలా సమకూర్చుకుంటారు.. ఇప్పుడున్న అమెరికా, నాటో సైన్యాన్ని ఏం చేస్తారు.... పైలెట్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు.. ఇలాంటి ప్రశ్నలన్నీ ముసురుకుంటున్నాయి. ఇలాంటి దశలో ఈ రహస్య సమావేశం నుంచి కొంతవరకు క్లారిటీ రావడం విశేషం.
ఆఫ్ఘనిస్థాన్లో పరిపాలనను పర్యవేక్షించే సుప్రీం లీడర్ కు ముగ్గురు డిప్యూటీలు ఉంటారు. వారిలో ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ ఒకరు. అలాగే హక్కానీ నెట్వర్క్ ఇంచార్జ్ గా ఉన్న సిరాజుద్దీన్ హక్కానీ రెండో వ్యక్తి. ఇక దోహాలో తాలిబన్ రాజకీయ ప్రధాన కార్యాలయానికి నాయకత్వం వహిస్తున్న అబ్దుల్ ఘనీ బరాదర్ మూడో డిప్యూటీగా ఉంటారు. ఈ ముగ్గురి సహకారంతో అఖుంద్జాదా పరిపాలన పర్యవేక్షిస్తారు. ఆఫ్ఘన్లో పరిపాలన కోసం ఓ మండలిని ఏర్పాటు చేస్తారని, ఆ మండలి పర్యవేక్షణలోనే మిగతా నెట్వర్క్ అంతా పనిచేస్తుందని నిర్ణయించారు. మండలికి టాప్ రేంజ్ లో ఉన్న అఖుంద్జాదానే దేశాధ్యక్షునికి సమాన హోదాలో ఉంటారని, అయితే ఆయన డిప్యూటీల్లో ఎవరికైనా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి తాను పైనుంచి సూపర్ వైజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని స్పోక్స్ పర్సన్ జబిఉల్లా చెబుతున్నాడు. దీన్నిబట్టి మరిన్ని దఫాల చర్చలు జరిగి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని గానీ, తాత్కాలిక ప్రభుత్వాన్ని గానీ ఏర్పాటు చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ప్రభుత్వ నమూనా ఎలా ఉంటుందనేది కూడా పూర్తి నిర్ణయం జరగలేదు. మొత్తానికి షరియా-లా ప్రకారమే ఉంటుందని, అదే తమకు ఫైనలని చెబుతున్నారు.
ఇక ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లకు ఇప్పటికిప్పుడు ఎదురవుతున్న భద్రతాపరమైన సమస్య ఏంటంటే... తమను తాము రక్షించుకోవడం ఎలా? ఎందుకంటే తాలిబన్లకు పెద్దసంఖ్యలో సాయుధ సైనికులు ఉన్నారు గానీ... ఆకాశమార్గాన ఎదురయ్యే దాడులను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు. తమ దగ్గర ఇప్పుడైతే పైలట్లు లేరని... టర్కీ, జర్మనీ, యూకేల్లో రహస్యంగా శిక్షణ పొందుతున్న తమవారిని రప్పించుకుంటామంటున్నారు. ఆఫ్ఘన్ నుంచి పొరుగుదేశాల్లో ల్యాండై ఉన్న మిలిటరీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తమకు తిరిగివ్వాలని ఆయా దేశాలకు వర్తమానం పంపుతున్నారు. ఆఫ్ఘన్ కు చెందిన 22 మిలిటరీ ప్లేన్లు, 24 హెలికాప్టర్లు ఉజ్బెకిస్తాన్లో ఉన్నాయి. వాటిని తిరిగివ్వాలంటున్నారు. అలాగే దేశంలోని వైమానిక స్థావరాల్లో, సైనిక స్థావరాల్లో ఉన్న విమానాలను నడిపే సామర్థ్యం తమకు లేదని బాహాటంగానే చెబుతుండడం విశేషం. మరోవైపు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నవారిని పైలట్లు వచ్చి ఉద్యోగాల్లో చేరాలని కోరుతున్నామంటున్నారు.
ఇక ఆఫ్ఘన్లో అమెరికా-నాటో దళాల నుంచి సుశిక్షితులైన సైనికులు సాయుధులై దాదాపు 3 లక్షల మంది అక్కడే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 20 ఏళ్లలో నాటో దళాలు వేలాది మంది తాలిబన్లను కాల్చి చంపాయి. మరిప్పుడు తాలిబన్ల రాజ్యం వచ్చాక నాటో సైనికుల్ని ఏం చేస్తారన్నది ఆందోళన రేపుతోంది. తాలిబన్లు తాము అనుకున్నదానికన్నా చాలా తొందరగా వచ్చారని అగ్రరాజ్యాధినేత బైడెన్ చెప్పడం కలవరం కలిగిస్తోంది. అంటే దళాలన్నింటినీ షిఫ్టు చేయాలనుకున్నా చేయలేకపోయారని బైడెన్ ఆందోళన చెందుతున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటారా... లేక నాటో దళాలను దేశం విడిచి పోవాలని హెచ్చరిస్తారా అన్నది ఇంకా ఎటూ తేలలేదు. ఒకవేళ ఘనీ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ వస్తా అంటున్నాడు కాబట్టి... త్వరలోనే మళ్లీ సాయుధులైన నాటో దళాల సహకారం తీసుకొని యుద్ధం కొనసాగిస్తాడా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు... ఆయుధాలు చేబూనిన నాటో సైనికులను నియంత్రించేవారు ఎవరూ లేకపోవడంతో రోడ్ల మీద పడి అరాచకం సృష్టిస్తారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఇలాంటివాటిని నయా తాలిబన్ అధినాయకత్వం ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి..