వసూళ్లు చేసుకోండి.. వాళ్ల జోలికి మాత్రం రాకండి! ఎంపీడీవోకు వైసీపీ నేత వార్నింగ్
posted on Aug 19, 2021 @ 7:03PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బహిరంగంగానే బరి తెగిస్తున్నారు కొందరు నేతలు. ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు.. అధికారులపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ముఖ్య నేత ఎంపీడీవో అధికారిని ఓపెన్ గానే బెదిరించాడు. ఆయన అధికారికి వార్నింగ్ ఇచ్చిన ఆడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వసూళ్లు చేసుకోండి.. లంచాలు తీసుకోండి.. కాని వాళ్ల జోలికి మాత్రం వెళ్లకండి అంటూ వైసీపీ నేత చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రభుత్వ అధికారులపై వైసీపీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సమక్షంలోనే ప్రభుత్వ అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. వలంటీర్ల జోలికి వస్తే ఖబడ్దార్ అని ఎంపీడీవోను శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. వాలంటీర్లకు కేవలం ఐదు వేలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఐదు వేల రూపాయలతో మోటార్ సైకిల్ పెట్రోల్, టీ ఖర్చులు కూడా రావడం లేదన్నారు. అలాంటి వలంటీర్లపై లేనిపోని అభాండాలు వేసి సస్పెండ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ ఎంపీడీవోను శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
" నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. పబ్లిక్ సర్వెంట్ వలంటీర్ల జోలికి రావద్దు. నాయకుల మాటలు విని వలంటీర్ల జోలికి వస్తే నీ ఉద్యోగం ఊడుతుంది. మీ ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టుముట్టి జరిగిన తప్పులను ఎండగడతాం" అని ఎంపీడీవోను శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. " మీ వసూళ్ళు మీరు చేసుకోండి, లంచాలు తీసుకోండి, కాంట్రాక్టులు మీరు చేసుకోండి, మీ దోపిడీ మీరు చేసుకోండంటూ" అధికారులకు శ్రీనివాస్‌రెడ్డి సలహా ఇచ్చారు. శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాలంటీర్ల కోసం మాట్లాడటం బాగానే ఉంది కాని.. అధికారులను లంచాలు తీసుకోమని చెప్పడం ఏంటని జనాలు నిలదీస్తున్నారు. ఎంపీడీవోను వైసీపీ నేత బెదిరించడంపై ఉద్యోగ సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.