సీబీఐకి పంజరం నుంచి స్వేచ్ఛ ఇస్తే..! జగన్‌కు జైలే గతా..!
posted on Aug 19, 2021 @ 9:48PM
‘సీబీఐ పరిస్దితి పంజరంలో చిలుకలాగ తయారైంది. కేంద్ర ఎన్నికల కమీషన్-ఈసీ, కంట్రోల్ అండ్ అడిటర్ జనరల్- కాగ్ లాగ సీబీఐకి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి’.. అంటూ మద్రాసు హైకోర్టు కేంద్రానికి ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్. పేరుకు ఇండిపెండెంట్ సంస్థేగానీ ఎక్కడా స్వతంత్రంగా వ్యవహరించకుండా సీబీ-ఐ కళ్లు కేంద్రమే పీకేసిందనే విమర్శ ఉంది. కేంద్రం చూడమన్నదే సీబీఐ చూస్తుంది. కేంద్ర కనుసన్నల్లోనే జాతీయ విచారణ సంస్థ నడుచుకుంటుంది. కేంద్ర ప్రభుత్వమే సీబీఐని అన్నివిధాల కట్టడి చేస్తుందనే ఆరోపణలు ఓపెన్ సీక్రెట్.
తాజాగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఏపీలోనూ ప్రధానంగా చర్య జరుగుతోంది. ఎందుకంటే, ఆ సీబీఐ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి జగన్‌రెడ్డి బెయిల్ మీద బయట ఉంటూ ఏపీని తన ఇష్టమొచ్చినట్టు పాలిస్తున్నారనే చర్చ ఉంది. అమరావతిని ఆగం చేసిన పాపాన్ని మూటగట్టుకున్నారని.. టీడీపీ నేతలను కేసులతో వేధిస్తున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని.. ఇలా సీఎం జగన్‌పై అనేక విమర్శలు ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై బయట ఉంటూ సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు కోర్టులో కేసు వేయడం కీలక పరిణామం. సీఎం జగన్ వర్తమానం, భవిష్యత్తు అంతా సీబీఐ పెట్టిన, పెట్టబోయే బిక్ష మీదే ఆధారపడి ఉందని అంటున్నారు. మద్రాస్ హైకోర్టు చెప్పినట్టు.. సీబీఐని పంజరం నుంచి విడుదల చేస్తే.. జగన్‌కు అసలైన సినిమా ఉంటుందని చర్చ నడుస్తోంది. ఎంతకాదన్నా.. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాల ద్వారా.. సీబీఐని మేనేజ్ చేస్తూ జగన్ పబ్బం గడుపుకుంటున్నారని అంటున్నారు.
ఇక, సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పైనా సీబీఐ వైఖరి వివాదాస్పదమవుతోంది. కర్ణాటకలో బళ్లారికి వెళ్లేందుకు కూడా గాలి జనార్థన్‌రెడ్డిని అనుమతించని సీబీఐ.. ఏపీలో మాత్రం జగన్ బెయిల్ రద్దు చేయమంటూ కౌంటర్ దాఖలు చేయకుండా.. కోర్టు విచక్షణకే వదిలేయడం అనుమానాస్పదం అవుతోంది. బెయిల్ రద్దు చేయమనడం.. లేదంటే బెయిల్ కొనసాగించమనడం.. ఈ రెండూ కాకుండా తటస్థంగా ఉండటం.. వ్యూహాత్మకమంటున్నారు. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులలో గతంలో సీబీఐ కఠినంగా వ్యవహరించింది. జగన్‌ను దాదాపు రెండేళ్లు జైల్లో ఉండేలా చేసింది. కేంద్రంలో రాజకీయాలు మారడంతో.. జగన్‌కు సైతం జైలు నుంచి విముక్తి కలిగేలా సీబీఐ సహకరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
అందుకే పంజరంలో ఉన్న సీబీఐకి స్వేచ్ఛ అవసరమని.. ఈసీ, కాగ్‌లానే సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలని చెన్నై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. అలా జరిగితే.. సీబీఐకి స్వేచ్ఛ లభిస్తే.. జగన్‌లాంటి వారికి దబిడి దిబిడే అంటున్నారు..